మళ్లీ మొదలయ్యాయి ఏడుపులు..? తమదే మేధస్సు అని డొల్ల బుర్రలను పదే పదే వాయించుకునే సెక్షన్ శోకాలు పెడుతోంది… ఇండియన్ జర్నలిజానికి కార్పొరేట్ చీడ పట్టిందట… పవిత్రమైన పాత్రికేయం పంకిలం అయిపోయిందట… (అసలు పాత్రికేయం- పవిత్రత అనే పదాలు వింటేనే నవ్వొచ్చే రోజులు కావా ఇవి..?) ఎందుకీ ఆరున్నొక్క రాగాలయ్యా అంటే… ఆదానీ అనే వ్యాపారి ఎన్డీటీవీలో కొన్ని వాటాలను కొనేశాడట… ఇంకేముంది..? అయిపోయింది, జర్నలిజానికి కాలం చెల్లింది అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు రెండు చేతులతోనూ తెగ రాసేస్తున్నారు…
ఒక్కటి… కనీసం ఒక్క టీవీ చానెల్ కార్పొరేట్ అవలక్షణాలు లేకుండా ఉంటే చూపించండి… ఏ పార్టీ కలరింగు లేని ఒక్క మీడియా సంస్థను చూపించండి… ప్రతివాడూ ఏదో ఒక పార్టీకి గులామే కదా… ఏదో ఒక నాయకుడి పాదతీర్థ సేవనంతో తరించిపోతున్నవాడే కదా… ఎక్కడెక్కడికో ఎందుకు..? మన తెలుగునాట అందరికీ తెలిసిన ఉదాహరణే కదా… టీవీ9 నుంచి రవిప్రకాష్‌ను గెంటేసి, చానెల్ కాజేసి, చివరకు మెయింటెన్ చేయడం రాక ఢమాల్ అని రెండో ప్లేసుకు పడిపోయిన తీరు చూశాం కదా… 550 కోట్ల డీల్ అది… దాని మాటేమిటి..?
దాన్ని హస్తగతం చేసుకున్నది కార్పొరేట్ భూతం కాదా..? దాని వెనుక ఉన్నదెవరు..? జస్ట్, ఇది ఒక ఉదాహరణ మాత్రమే… సాక్షిని ముద్రించే జగతి పబ్లికేషన్స్ కార్పొరేటు సంస్థ కాదా..? అదేమైనా పవిత్రమైన, ఉదాత్తమైన, జనోద్ధరణ లక్ష్యాలతో స్థాపించబడిన అహోబిల మఠం ట్రస్టా..? జగన్ అక్రమార్జునల పెట్టుబడులకు అడ్డాగా మార్చారనే కదా తనపై ఉన్న కేసు..? సాక్షిని ప్రసారం చేసే ఇందిరా టెలివిజన్ గ్రూపు దాని సిస్టర్ కన్సర్న్ కాదా… ఈటీవీ-ఈనాడు, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, టీవీ5, టీవీ5-నమస్తే, వీ6-వెలుగు… ఇవన్నీ పవిత్ర పాత్రికేయ యజ్ఞాలు చేస్తున్నాయా ఏం..? కార్పొరేట్ వాసనలే ఎరుగని పత్తిత్తులా..? శుద్ధపూసలా ఇవి..? అసలు ఎఱ్ఱెర్రని 10టీవీ, 99టీవీ స్థాపన, డబ్బు వసూళ్లు, అమ్మకాలు సిగ్గుచేటు కథలు కావా..? ఇప్పుడు రోదించే గొంతుల్లో ఒక్కటీ వాటిపై కిక్కుమనలేదు…
Ads
టెన్ టీవీ వెనుక ఉన్న బడా కార్పొరేట్ సంస్థ మాటేమిటి..? హెచ్‌ఎంటీవీ వెనుక ఉన్నదెవరు..? అంతెందుకు..? సోనియా, రాహుల్ ఈడీ ఆఫీసు చుట్టూ తిరుగుతున్న నేషనల్ హెరాల్డ్ ఓ కుంభకోణం కాదా..? వివిధ పార్టీల ఎంపీలు సొంత మీడియా సంస్థలు నడిపించడం లేదా..? అంతెందుకు..? టూజీ స్కాం ఓసారి మళ్లీ చదివి చూడండి… సన్ టీవీలోకి కదా ఆ స్కాం అక్రమ సంపాదన ప్రవహించింది..? ముఖేష్ అంబానీ నెట‌్వర్క్18, టీవీ18 మాటేమిటట..? అక్కడికి ఫాఫం, ఆదానీ ఒక్కడే ఏదో చేతబడులు, క్షుద్రపూజకు చేస్తున్నట్టుగా… ఈ రోదనలు దేనికి..? ఎప్పుడో పంకిలమైపోయిన ఆ బురదలో ఏ వరాహం దొర్లితే ఏంటట..!!
అదే ఎన్డీటీవీ వందల కోట్ల అక్రమాలకు పాల్పడితే ఇన్నాళ్లూ ఒక్క గొంతు పెగల్లేదు… తెల్లారిలేస్తే లక్ష నీతులు చెప్పే ఆ సంస్థ మనీలాండరింగ్ చేసి, ఓనర్లు కోట్లకు పడగలెత్తినప్పుడు ఒక్కడూ మాట్లాడలేదు… అది పక్కా దేశవ్యతిరేక ధోరణులతో, మన శతృదేశం చైనా అనుకూల క్షుద్ర వామపక్ష వైఖరులు తీసుకున్నప్పుడు కూడా ఎవరూ విశ్లేషించలేదు… రెండేళ్లు సెబి ఈ షేర్ల మీద బ్యాన్ పెట్టినప్పుడు ఒక్క కలమూ రాయలేదెందుకు..? మరెందుకు ఈ కన్నీళ్లు..? ఎందుకంటే రిపబ్లిక్ టీవీ తరహాలో బీజేపీకి మరో పెద్ద మీడియా సంస్థ తోడయ్యే చాన్సుంది కాబట్టి…
నిజానికి ఇప్పుడు ఆదానీ హస్తగతం అయ్యింది 30 శాతంలోపే… ఇంకా జరగాల్సిన కథ చాలా ఉంది… అక్రమ పద్ధతుల్లో ఎన్డీటీవీని కాజేస్తున్నారనేది ఓ ఆరోపణ… అసలు ఆ ఎన్డీటీవీయే ఓ విషవృక్షం… మంత్రాలు చదివితే, కమండలం నుంచి తీర్థం చల్లితే లొంగుతుందా అది… గొడ్డలే కరెక్టు… అది ఓ కార్పొరేట్ వార్… కార్పొరేట్ యుద్ధాలంటేనే నీచంగా ఉంటయ్… (అసలు ఆదానీకి ఎన్డీటీవీలోకి వెళ్లే మార్గం ఎలా దొరికింది అనేది పెద్ద కథ… ఇక్కడ వివరంగా చెప్పుకోలేం…) పోనీయండి, సవాలక్ష చానెళ్లలో అదొకటి… చైనా- పాకిస్థాన్ అనుకూలతలను, ఆ డప్పులను వదిలేసి, కాస్త మన దేశం అనే భావనలోకి పడుతుందేమో… అదే తప్పయితే… అదే జరగరాని విపత్తు అయితే… ఈ ఏడుపులు సరిపోకపోవచ్చు… కమాన్, మోర్ లౌడ్… ఎన్డీటీవీ అక్రమాలకు మీ గొంతులు మద్దతు పలుకుతున్నాయా..? జస్ట్, రీథింక్..!!
Share this Article