….. ఈయన పేరు తెలుసు కదా… ఫాదర్ స్టాన్ స్వామి… ఎల్గర్ పరిషత్-మావోయిస్టుల లింకుల కేసులో నిందితుడు… వరవరరావుతోపాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది… మోడీని హతమార్చే కుట్ర, దేశద్రోహం, ఉపా తదితర సీరియస్ కేసులేవో పెట్టినట్టున్నారు… సరే, చట్టం తన పని తాను చేసుకుపోతోంది… ఆ దర్యాప్తు సంస్థ ఏదో వాదిస్తోంది… మనం ఇప్పుడు ఆ కేసు గుణగణాలు, లోతుల్లోకి పోవడం లేదు… ఒక 83 సంవత్సరాల వృద్ధుడిని చూసి ఇంతటి బలమైన రాజ్యం ఎందుకు వణికిపోతోంది…? ఎందుకు అంతులేని క్రూరత్వాన్ని ప్రదర్శిస్తోంది కసికసిగా…!!
సరే, రాజ్యానికి శత్రువు, తిరుగుబాటుదారు, వయస్సుతో సంబంధం లేదు, నిర్బంధించాల్సిందే, శిక్షించాల్సిందే అని ఈ ప్రభుత్వం భావిస్తున్నదీ అనుకుందాం… కానీ తను శిక్షపడిన నేరస్థుడు కూడా కాదు… ప్రస్తుతం విచారణలో ఉన్న నిందితుడు మాత్రమే… విచారణ ఖైదీలకు హక్కులుంటయ్… అన్నింటికీ మించి రాజ్యాంగం కల్పించిన బతికే హక్కు అనే బేసిక్ రైట్ ఉంది… దాన్ని కూడా హరించేలా క్రూరత్వం ప్రదర్శించాలా..? అవును, రాజ్యం అంటేనే క్రూరంగా ఉంటుంది, నిజమే… కానీ ఈ దేశం వేల ఏళ్లుగా విచారణలు, జైళ్లు, శిక్షలు, దర్యాప్తుల విషయంలో కొన్ని ప్రమాణాలను, మానవీయ విలువలను చూపిస్తోంది… ఇప్పుడు అవి ఎందుకు లోపిస్తున్నాయి..?
Ads
ఇదంతా ఎందుకు చెప్పుకోవల్సి వస్తున్నదంటే..? బ్రిటిష్ కాలంలో శిక్షపడిన ఖైదీలను అండమాన్ సెల్యులర్ జైలుకు పంపించి, వాళ్ల జవసత్వాలను పిండేసేవాళ్లు… ఇప్పుడు మన స్వతంత్ర భారతంలో విచారణలో ఉన్న ఖైదీల పరిస్థితి కూడా పెద్ద తేడాగా ఏమీ లేదు… ఒక వృద్ధ ఖైదీ నేను పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నాను, ఆహారం తినలేకపోతున్నాను, పోలీసులు స్వాధీనం చేసుకున్న నా సంచీలో ఒక స్ట్రా, ఒక కప్పు ఉంటుంది, అవి వాపస్ ఇప్పించండి, ద్రవరూపంలో ఆహారాన్ని తీసుకుంటాను అని వేడుకుంటే… కోర్టు వెంటనే స్పందించలేదు… ఏమయ్యా, ఏమిటీ సంగతి అని ఎన్ఐఏను అడిగింది… అసలు వాళ్ళను అడగడం దేనికి..? వాళ్లు దానికి అభ్యంతరపెట్టాల్సిన అవసరం కూడా లేదు నిజానికి… 20 రోజులాగి చెబుతాం అన్నారు, కోర్టు సరేనన్నది… అనూహ్యం, అమానవీయం… చివరకు ఆహారం తీసుకోవడానికి అవసరమయ్యే ఒక స్ట్రా, ఒక కప్పు కోసం కూడా వ్యవస్థల్ని వేడుకోవాలా..? అదీ ఒక వృద్ధ రోగ విచారణ ఖైదీ…
ఇది ఆమధ్య వార్త… తాజా వార్త ఏమిటంటే..? సదరు స్టాన్ స్వామి నుంచి మేం ఏ సంచీ స్వాధీనం చేసుకోలేదనీ, సో, స్ట్రా, కప్పు స్వాధీనమే చేసుకోలేదు కాబట్టి ఎలా తిరిగి ఇవ్వగలమని ఎన్ఐఏ కోర్టుకు చెప్పింది… సరే, మంచిది, అలాగయితే ఆ జైలు అధికారులనే అవి సమకూర్చమని చెప్పండి, కాస్త చలిని తట్టుకునే దుప్పట్లు కూడా ఇప్పించండి అని స్టాన్ స్వామి మరో పిటిషన్ వేశాడు… కోర్టు సానుకూలంగా స్పందించాలి కదా… దుప్పట్లకు కూడా దేబిరించాలా..!!
కోర్టు జైలు అధికారులను సమాధానం అడిగింది… సరే, ఎలాగైతేనేం..? జైలు అధికారులు సమకూర్చారు… ఆహారం ద్రవరూపంలో పీల్చుకోవడం కోసం ఓ ఖైదీ పడిన శ్రమ, జరిగిన జాప్యం, కనిపించిన అమానవీయత ఇది… ఇప్పుడు స్టాన్ స్వామి ఏమంటున్నాడంటే..? నన్ను తలోజా జైలు నుంచి నవీముంబై జైలుకు తరలిస్తారట, దాన్ని ఆపేయండి అని మరో పిటిషన్ వేశాడు… మళ్లీ బెయిల్ పిటిషన్ వేశాడు… పోలీసులు తన నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ క్లోన్, తన సంచీని తిరిగి ఇప్పించాలని ఇంకో పిటిషన్… అసలే రకరకాల ఆరోగ్య సమస్యలున్నందున తనను నవీ ముంబైకి మార్చొద్దని ఈయన కోరిక… కోర్టు మళ్లీ జైలు అధికారులను సమాధానం అడిగింది… వాళ్లేమో సమాధానం ఇవ్వడానికి టైమ్ కావాలీ అన్నారు… జాప్యం, వాయిదా, నిర్లక్ష్యం, అమానవీయత…!!
Share this Article