జగన్ ప్రభుత్వం థియేటర్ల టికెట్ల ధరలు తగ్గిస్తూ ఆమధ్య ఓ నిర్ణయం తీసుకుంది… బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేస్తే, వసూళ్లు చేస్తే తాటతీస్తాను అని చెప్పింది… ఈ నిర్ణయం వెనుక జగన్ అహాన్ని ప్రదర్శిస్తున్నాడనీ, పవన్ కల్యాణ్ మీద కోపంతో ఇండస్ట్రీని తొక్కుతున్నాడనీ, తన ముఖ్యమంత్రిత్వాన్ని గుర్తించని-గౌరవించని ఇండస్ట్రీని కాళ్ల దగ్గర మోకరిల్లేలా చేసుకుంటున్నాడనీ, ఇండస్ట్రీలో ప్రధానంగా కమ్మ పెత్తనం కాబట్టి తన కమ్మ ద్వేషాన్ని ఇండస్ట్రీ మీద కూడా ప్రయోగిస్తున్నాడనీ బోలెడు కథనాలు, ప్రచారాలు సాగాయి…
ఆ ప్రచారాల్లో నిజమెంతో అబద్దమెంతో తెలియదు, ఎందుకంటే జగన్ ఎవరికీ ఓ పట్టాన అర్థం కాడు, ఎవరో ఏదో చెబితే చేయడు… తన బుర్ర నుంచి పుట్టిన ఆలోచనల నుంచి సొంతంగా తీసుకునే నిర్ణయాలే అవన్నీ… తన లెక్కలు వేరు… ఇండస్ట్రీని తన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవడమే జగన్ ఉద్దేశం అనేది నిజమైనా సరే, అదీ కొరడా పట్టుకుని మర్యాదగానే రప్పించుకుంటాడు… అదీ ఓ లెక్క ప్రకారమే…
తన బంధువైన మోహన్‌బాబు తదితరులను పక్కన పెట్టేసి, చిరంజీవికి గౌరవం ఇవ్వడం వెనుక జగన్ ఈక్వేషన్ వేరే ఉండవచ్చు బహుశా… ఎహె, మోహన్‌బాబు కమ్మ, చిరంజీవి కాపు అని కాదు… మోహన్‌బాబు దూకుడు మనస్తత్వం, చిరంజీవి అందరినీ కలుపుకుని పోయి కన్విన్స్ చేయగల నేర్పు… అన్నింటికీ మించి పవన్ కల్యాణ్ సొంత అన్న… ఈ టికెట్ ధరలపై పవన్ ఇంకేం మాట్లాడినా సరే, ఇకపై వైసీపీ లీడర్లు చిరంజీవి వైపు చూపిస్తారు… కక్కలేక, మింగలేక…
Ads
చిరంజీవి నిజంగానే జాగ్రత్తగా ఓ టీం ఎంపిక చేసి, జగన్ వద్దకు తీసుకుపోయాడు… అంతకుముందు జగన్‌తో మధ్యాహ్నభోజనాలు, మర్యాదలు… నాగార్జునతో కలిసి రాయబేరాలు సరేసరి… ప్రభాస్, మహేశ్‌బాబు, చిరంజీవి వేర్వేరు కులాలు… పైగా టాప్ స్టార్స్… ఆలీ సొంత పార్టీయే… నారాయణమూర్తి చిన్న నిర్మాత… రాజమౌళి ఎట్సెట్రా గెస్టులు మాత్రమే… అయితే వీరిలో ఒక్కరూ థియేటర్ల బాపతు ప్రముఖుల్లేరు, సినిమా ట్రేడ్ అసోసియేషన్ల బాధ్యులు లేరు… ఒక హీరోను ముందుపెట్టి, తను చెప్పినట్టల్లా ఆడించడం జగన్ చాణక్యం… (చాలా అంశాల్లోలాగే దీనిపైనా జగన్ స్థిరంగా ఏమీ ఉండబోవడం లేదనీ, మరో యూటర్న్ ఉంటుందనీ అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నదే…)
జూనియర్ ఎన్టీయార్ కోణంలో ప్రస్తుతం జగన్ వద్దకు వెళ్లకపోవడమే కరెక్టు… తనకు ప్రస్తుతానికి ఏమీ లేకపోవచ్చు, కాకపోతే భావి రాజకీయ ఆకాంక్షలు బలంగా ఉన్నవాడే కదా… బాలయ్యను పిలవలేదు కాబట్టి తనూ కుటుంబం కోణంలో ఆలోచించాడు, చంద్రబాబుకు ఇష్టముండదు కాబట్టి పోలేదు అనే వాదనలు కరెక్టు కాకపోవచ్చు, అంత సత్సంబంధాలు ఏమీ లేవు ప్రస్తుతం… చంద్రబాబుతో మరీ..!
సరిగ్గా ఇదే ఆంధ్రజ్యోతి అండ్ టీడీపీ మీడియాకు చిర్రెక్కిస్తోంది… తమ రాతల్లో కూతల్లో అదే వ్యక్తమవుతోంది… టికెట్ల ధరలతో థియేటర్లన్నీ ఇక మటాష్ అని గగ్గోలు పెట్టింది ఆంధ్రజ్యోతే కదా ప్రధానంగా… సినిమావాళ్లను రెచ్చగొట్టే పని చేసిందీ అదే కదా… అంతెందుకు, వర్మను స్టూడియోకు పిలిచి చట్టపోరాటం చేయాలని నేరుగానే పిలుపునిచ్చాడు కదా రాధాకృష్ణ… సరే, ఇప్పుడు చిరంజీవి తన స్వార్థం కోసమో, మనసులో ఇంకేమున్నదో తెలియదు గానీ, తన రేంజ్ దిగి మరీ బతిమిలాడుతూ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు…
జగన్ వద్దకు వెళ్లిన వాళ్లు ఆనందంగానే బయటికొచ్చారు… ఒకటీరెండు నిర్ణయాలు బయటికి చెప్పారు, మిగతావన్నీ జీవోలో వస్తాయి అన్నారు… ఏదో ఓ సానుకూల పరిష్కారం కుదిరినట్టుంది… కోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి ధరలపై నిర్ణయం మార్పు విషయంలో కాస్త ప్రొసీజరల్ జాగ్రత్తలు, కసరత్తు ముఖ్యం… అంతేతప్ప ఆ నాని ఏడి, దగ్గుబాటి రాలేదేంటి, రాజేంద్రప్రసాద్ రానన్నాడా, కమ్మ పెద్దలు కనిపించరేంటి, వాళ్లు కూడా వస్తేనే జీవో ఇస్తాం వంటి మాటలేవీ ఉండవు లెండి… ఏయ్ బిడ్డా, ఇది నా అడ్డా అనే సందేశం క్లియర్‌గా ఇచ్చాడు కదా, ఇక చాలు…
అప్పుడు థియేటర్లు ఇక నాశనం, మూసుకుని సివిల్ సప్లయిస్ గోదాములు చేసుకోవల్సిందే అన్న గొంతులు ఇప్పుడు ఏమంటున్నయ్..? టాక్ హిట్, బొమ్మ ఫట్ అని తేల్చేస్తోంది ఆంధ్రజ్యోతి… అసలు జీవో వస్తే కదా ప్రభుత్వ నిర్ణయాలు ఏమిటో క్లారిటీ వచ్చేది… కేవలం అయిదో షోకు పర్మిషన్ మాత్రమే ఏకైక నిర్ణయం కాదు, పైగా అది చిన్న నిర్మాతకు ఉపయోగకరమూ కాదు…
ఐనా థియేటర్ల సిండికేట్ ఆడించే ఆటలో చిన్న నిర్మాత ఎప్పుడో కొట్టుకుపోయాడు… అయిదో షో కాదు, ఆరు షోలు ఇచ్చినా వేస్టే… అసలు కథ పెద్ద నిర్మాతలది… బెనిఫిట్ షోలు, అదనపు షోలతో డబ్బు కుమ్ముకోవాలి, హీరోల జేబుల్లో పోయాలి… ఇవన్నీ విడిచిపెట్టి, అసలు రిజల్టే లేదు, సినిమా పెద్దలు సంబరాలు చేసుకుంటున్నారు అని ఆంధ్రజ్యోతి వెక్కిరింపు… అన్నీ వచ్చె వచ్చె, పాయె, పాయె బాపతు స్టోరీలు… కొత్త జిల్లాల ఏర్పాటు కుదరదు, కేంద్రం ఎప్పుడో వద్దంది అని ఆమధ్య వార్త రాశారు, మళ్లీ రెండురోజులకే దానికి ఖండన రాసుకున్నారు… హబ్బ, ఏం పాత్రికేయంరా బాబూ… అచ్చం చంద్రబాబు మాటల్లాగే…!! ఏమాటకామాట… ఇష్టమున్నా లేకపోయినా ఈనాడు ఈ స్టోరీని ప్రొఫెషనల్‌గా ప్రజెంట్ చేసింది…!
Share this Article