నిజమే… రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విశేషాల మీద జోకులు పేలుతున్నయ్… ఆ అవకాశం ఇచ్చింది రేవంత్ రెడ్డే… తనకు ఇంగ్లిష్ ఫ్లుయెన్సీ లేదు, నిజమే, కానీ అదేమీ తప్పు కాదు, అసలు గుంపు మేస్త్రీకి ఇంగ్లిష్ ఫ్లుయెన్సీ అవసరం లేదు, అర్థం చేసుకుని కమ్యూనికేట్ చేసేంత సీన్ ఉంటే చాలు… మోడీకి పెద్ద ఇంగ్లిష్ వస్తుందా..? చంద్రబాబు ఇంగ్లిష్ తెలిసిందే… మోడీ ప్రపంచ దేశాల అధినేతలతో సంప్రదింపులు జరపడం లేదా..? ఇదే చంద్రబాబు ఇదే దావోస్‌లో ఏదేదో ఉద్దరించినట్టు ప్రచారం పొందలేదా..? కానీ..? కానీ..?
గుంపు మేస్త్రీకి తన ముఠా సభ్యులు బాగా పనిచేస్తే చాలు, తను సరిగ్గా ఆర్గనైజ్ చేసుకుంటే చాలు… ముఠాలోని ఏ సభ్యుడు ఏ పని చేయాలో, చేయగలడో తెలిసి పని చేయించుకుంటే చాలు… అసలు జగన్ గానీ, కేసీయార్ గానీ ఈ దావోస్, గీవోస్ ఎప్పుడూ పట్టించుకోలేదు… నిజం చెప్పాలంటే వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో మన అటెండెన్స్‌తో ఉపయోగం పెద్ద సున్నా… ఒకవేళ మన బ్రాండింగ్ కోసమైతే ఐటీ, ఇండస్ట్రీల మంత్రి లేదా ముఖ్యకార్యదర్శి, వాళ్ల టీం చాలు…
కేసీయార్ అండ్ పార్టీకి బాగా నమ్మిన బంటు జయేష్ రంజన్… ఏది ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు… అందుకే కేసీయార్, కేటీయార్ ఆంతరంగికుడు అయ్యాడు… అర్థమైంది కదా… ఇప్పుడూ ఆయనే ఉన్నాడు ముఖ్యకార్యదర్శిగా… ఎందరినో తొలగించారు గానీ ఆయన్ని కొనసాగిస్తున్నారు… వోకే, అదే మంత్రి శ్రీధర్‌బాబును, జయేష్ రంజన్‌ను పంపిస్తే సరిపోయేది… శ్రీధర్ బాబు స్వతహాగానే ఆ ఇంగ్లిష్ బాపతు భాష, కల్చర్‌లో ఇట్టే ఇమిడిపోగలడు… పైగా తన సొంత శాఖ, తన బాధలేవో తను పడేవాడు… తనను బాగా ఎక్స్‌పోజ్ చేయడమే రేవంత్‌కు రాజకీయంగా ఫాయిదా…
Ads
పైగా ఈ ఆదానీ బాపతు పెట్టుబడులకు దావోస్ దాకా వెళ్లడం దేనికి..? అంతకుమించి అందులో ఎక్కువ ప్రాజెక్టులు కేసీయార్ హయాంలో ఒప్పందాలు కుదిరినవే… అంతకుముందు ఒప్పందాలు కుదిరి మెటీరియలైజ్ గాని మరికొన్ని ఇతర పెట్టుబడులు కూడా ఉన్నాయి… అవన్నీ ఇప్పుడు మళ్లీ ఒప్పందాలకు వస్తున్నాయి… అవి హైదరాబాదులో కూడా సాధ్యమయ్యేవి కదా… కొత్త కంపెనీలు ఏవీ మనం దావోస్‌లో ఇచ్చే ప్రజెంటేషన్లు, మనం పెట్టే కొత్తిమీర అన్నం, తోటకూర పప్పు చూసి నిర్ణయాలు తీసుకోవు…
మ్యాన్ పవర్ స్థాయి, జీతాలు, సంఖ్య, శిక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ రాయితీలు, సుస్థిర ప్రభుత్వం, శాంతిభద్రతలు, మంచి కనెక్టివిటీ, సేల్ పాయింట్లతో దూరం ఎట్సెట్రా చాలా అంశాలు చూస్తాయి కంపెనీలు,.. అందుకే, నిజం చెప్పాలంటే… రేవంత్ రెడ్డి ప్రస్తుతం దావోస్ వెళ్లి ఉండాల్సింది కాదు… అనవసరంగా వెక్కిరింతలకు తనే అవకాశం ఇచ్చినట్టయింది… ‘న్యూక్లియర్ చెయిన్ రియాక్షన్, బిజినెస్ మ్యాన్ ఆర్ స్పోర్ట్స్ కార్’ వంటి పదాలు ఎందుకు వచ్చినట్టు…?
అది హైదరాబాద్ మీడియా కాదు, వెల్ ఎన్‌లైటెన్ ఫేమస్ మీడియా పర్సనాలిటీస్ వస్తాయి… అక్కడ కేటీయార్ డూప్లికేట్, నేను ఒరిజినల్ వంటి మాటలు అస్సలు రాకూడదు… రేవంత్ రెడ్డి నోటి వెంట వస్తే సర్లే అనుకోవచ్చు, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి నోటి నుంచి రాకూడదు… అది ఏబీఎన్ ఆర్కే డిబేట్ కాదు కదా… ఆదానీ పెట్టుబడుల వ్యవహారం అంత బహిరంగంగా తెర మీద ప్రదర్శించడం కూడా కరెక్టు స్ట్రాటజీ కాదు… ఇక్కడ హైదరాబాదులోనే ఇంకా ప్రక్షాళన చేయాల్సిన పనులు, అనగా కడిగి, తోమాల్సిన యవ్వారాలు బోలెడున్నయ్… అవన్నీ విడిచి దావోస్ ఎందుకు వెళ్లినట్టు మహాప్రభూ..!? నీ సమర్థకులకు కూడా సమర్థన చేతకాకుండా పోతోందిగా..!!
Share this Article