ఈసారి బార్క్ వాడి రేటింగ్స్ పరిశీలిస్తుంటే… ఓ పాయింట్ ఇంట్రస్టింగుగా అనిపించింది… దేశం మొత్తమ్మీద సన్ టీవీ టాప్… నంబర్ వన్… కానీ తెలుగులో ఆ గ్రూపు చానెల్ జెమిని అట్టర్ ఫ్లాప్… ఎప్పుడైనా ఏదైనా కొత్త సినిమా ప్రసారం తప్ప, ఇక మిగతా ఏ విషయంలోనూ ఇదొక చానెల్ ఉన్నట్టుగా కనిపించదు… అంత ఘోరమైన పర్‌ఫామెన్స్… ఎక్కడ కొడుతోంది తేడా..? టీం వైఫల్యమా..? యాజమాన్యానికే తెలుగు మీద ఇంట్రస్టు లేదా..? ఎందుకలా భ్రష్టుపట్టిపోయింది..? ఇదే ఆలోచిస్తుంటే మరొక పాయింట్ చటుక్కున తట్టింది… ఆ అరవ జెమిని వాడు సరే, ఇంత సాధనసంపత్తి, అపారమైన సంపద, అనుభవం, తెలుగు జనంలో రీచ్ గట్రా బొచ్చెడు బలాలున్న ఈటీవీ పరిస్థితి ఏమిటి..? దానికి ఏం తక్కువ..? అదీ వినోద చానెళ్ల పోటీ నుంచి దాదాపు తప్పుకున్నట్టుగా… ఘోరమైన రేటింగ్స్ స్థాయికి ఎందుకు పడిపోయింది..? ఈ వైఫల్యానికి కారకులెవరు..?
ప్రైమ్ టైమ్‌లో మాటీవీకి, ఈటీవికి నడుమ తేడా చూడండి… అసలు జీ, ఈటీవీ, జెమిని కలిపి లెక్కేసినా మాటీవీ రేటింగులకన్నా తక్కువే… ఒక వారం మొత్తం రేటింగ్స్ పరిశీలించినా సరే, ఇదే తేడా… మాటీవీ 2548 లక్షలు), జీ తెలుగు (1410 లక్షలు), ఈటీవీ తెలుగు (1092 లక్షలు) , జెమినీ టీవీ (772 లక్షలు)… గతంలో ఈటీవీ కాస్తయినా రెండో స్థానం కోసం పోటీపడుతున్నట్టుగా కనిపించేది, ఇప్పుడు అదీ వదిలేసినట్టుంది… ఇలాగే నడిస్తే జెమిని స్థాయికి పడిపోతుందేమో… పాపం శమించుగాక..! జీవాడు కాస్త నయం, నగరాల్లో మాటీవీని కొట్టేస్తుంటాడు అప్పుడప్పుడూ… ఇంకాస్త వివరంగా పరిశీలిద్దాం… వినోదచానెళ్లను జనం ప్రధానంగా చూసేది సీరియల్స్, రియాలిటీ షోల కోసం… అంటే ఫిక్షన్ కేటగిరీలో సీరియల్స్, నాన్-ఫిక్షన్ కేటగిరీలో రియాలిటీ షోలు… మరో కేటగిరీ మూవీస్… ఒకసారి ఈ చార్ట్ చూడండి, కేటగిరీల వారీగా ఏ టీవీ ఎక్కడున్నదో…
Ads
కోట్లు పెట్టి కొత్త సినిమాలు కొంటుంది కాబట్టి జెమిని వాడికి అదొక్కటే బలం… ఈవిషయంలో మాటీవీ వాడు ఫ్లాప్… వేల పాత సినిమాల రైట్స్ తప్ప కొత్త సినిమాల పోటీలో ఉండని ఈటీవీ ఈ కేటగిరీలోనూ చాలా వీక్… ఫిక్షన్ విషయానికి వస్తే మాటీవీని ఫస్ట్ ప్లేసులో ఉంచుతున్నవి సీరియల్సే… కార్తీకదీపం, గుప్పెడంత మనసు, వదినమ్మ, చెల్లెలి కాపురం, ఇంటింటి గృహలక్ష్మి, దేవత, జానకి కలగనలేదు, ఎన్నెన్నో జన్మల బంధం… చివరకు నాన్-ప్రైమ్ టైమ్‌లో వచ్చే కేరాఫ్ అనసూయ ఎట్సెట్రా… టీవీలను పోషించేది, నిలబెట్టేది, డబ్బులు సంపాదించి పెట్టేది సీరియల్… ఈ కేటగిరీలో ఈటీవీ చాలా చాలా వెనకబడిపోయింది… నిజానికి ఏ టీవీ సీరియలైనా నాసిరకమే… చెత్త కథనాలు, ప్రేక్షకులంటే ఆ దర్శకులకు పరమ అగౌరవం… నాణ్యత, నవ్యతకు పది ఆమడల దూరంలోనే ఉంటారు వాళ్లు… ఐనాసరే, మాటీవీ సీరియళ్లే ఎందుకింత పాపులర్..? మరీ పర్టిక్యులర్‌గా జీవాడి సీరియల్స్ కూడా నాసిరకంలో మాటీవీ సీరియళ్లతో బాగానే పోటీపడతయ్ కదా, మరి మాటీవీ సీరియళ్లకే ఎందుకింతగా రేటింగ్స్..? అసలేమిటి కథ..?
ఇక నాన్-ఫిక్షన్… ఈవిషయంలో జీటీవీ వాడు అట్టర్ ఫ్లాప్… కోట్లకుకోట్లు తగలేస్తున్న బిగ్‌బాస్ షో వదిలేస్తే మాటీవీ వాడికీ రియాలిటీ షోలు అచ్చిరావడం లేదు… అసలు ఈ చానెల్‌కు మంచి క్రియేటివ్ టీం లేదు… ఈ బిగ్‌బాస్ ఆగిపోతే ఇక రేటింగ్స్ తెచ్చే నాన్-ఫిక్షన్ ప్రోగ్రాం ఒక్కటీ లేదు… స్టార్ మ్యూజిక్ ఫ్లాప్, కామెడీ స్టార్స్ ఫ్లాప్… ఈ విషయంలో కాస్త బలమున్నట్టు అనిపించిన ఈటీవీ క్రమేపీ ఇందులోనూ ఫెయిలవుతోంది… ఎలాగూ సీరియల్స్ బలం లేదు… బలమున్న రియాలిటీ షోలనైనా మెరుగుపరుచుకోవాలి కదా… కిట్టీ పార్టీ తరహా వావ్, క్యాష్… చివరకు న్యూస్ బులెటిన్ కూడా ఇదే కేటగిరీలో…!! హహహ, వినోద చానెల్ ఒకటి న్యూస్ రేటింగ్స్‌తో మిగతా చానెళ్లతో పోటీపడుతోంది… ఆలీతో సరదాగా షో మీద ఆసక్తి సన్నగిల్లుతోంది ప్రేక్షకుడికి… చివరకు ఈటీవీకి బలమైన పిల్లర్‌గా నిలబడే బూతు కామెడీ షో జబర్దస్త్ పని కూడా అయిపోతోంది… (ఈ సోయి కూడా ఈటీవీకి లేకుండా పోయింది)… గతంలో పాడుతా తీయగా, స్వరాభిషేకం ఈటీవీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి… ప్చ్, ఇప్పుడు వాటినీ చెడగొట్టే ప్రయాసలో ఉంది టీవీ…
ఎక్సట్రా జబర్దస్త్ అయితే మరీ రోజురోజుకూ విసిగించేస్తూ, రేటింగ్స్ పడిపోతూ, ఈటీవీని ఇంకా పడేస్తోంది… పాత బిట్స్ మిక్సింగ్ షో అయిన జబర్దస్త్ ఎక్సట్రా డోస్ ఒక వేస్ట్ ప్రయాస… ఈ షోను ఇంకా సొమ్ము చేసుకోవాలని బెస్ట్ ఆఫ్ జబర్దస్త్ అని ఇంకో ప్రోగ్రాం… ఇక జీతెలుగు వాడిది మరో శోకం… ఓంకార్‌ను నమ్ముకుంటే మాయాద్వీపంలో ముంచేశాడు… మరో షో ఏదీ లేకుండా పోయింది… రియాలిటీ షో అని ఏదో ఒకటి రుద్దితే జనం చూడరు… జెమినివాడు కోట్ల ఖర్చుతో జూనియర్ ఎన్టీయార్‌ను హోస్టుగా పెట్టి ఎవరు మీలో కోటీశ్వరులు షో చేస్తున్నాడు… అంతటి స్టార్ సపోర్ట్ ఉన్నా సరే షో అట్టర్ ఫ్లాప్… నాసిరకం కంటెంట్, జూనియర్ భజన ప్రధాన కారణాలు… అలాగే కోట్లు ఖర్చుపెట్టిన మాస్టర్ చెఫ్ మరో ఫ్లాప్ షో… అది మరీ చప్పిడి, పథ్యం తిండి… స్థూలంగా ఇదీ మన తెలుగు వినోద చానెళ్ల స్థితీ, గతీ… అన్నట్టూ… ఒకవైపు ఈనాడు పతనావస్థ, మరోవైపు ఈటీవీ పతనావస్థ, ఇంకోవైపు క్లిక్ కాని ఈటీవీ భారత్, ఈటీవీ న్యూస్ చానెళ్లూ సోసో, తెల్ల ఏనుగులా ఫిలిమ్ సిటీ… సార్, మన సామ్రాజ్యం ఏమైపోతోంది రామోజీరావు గారూ…!?
Share this Article