‘‘ఎహె.., ఈ హుజూరాబాద్ ఎన్నిక మాకో లెక్కా..? అంత పెద్ద జానారెడ్డినే ఓడించినం, ఈ ఈటల ఎంత..?’’ అని కదా మొన్నామధ్య ఇదే కేటీయార్ చెప్పుకొచ్చాడు… కానీ ఆచరణ పూర్తిగా కంట్రాస్టు… కేసీయార్, కేటీయార్, హరీష్, టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈటల పనిమీదే ఉన్నారు… తెల్లారిలేస్తే ఈటల జపం తప్ప మరొకటి లేదు… నిద్ర నుంచి ఒక్కసారిగా లేపినా సరే, వెంటనే ఆ నిద్ర కళ్లతోనే ఈటల దుర్మార్గుడు, ఈటల మోసగాడు, ఈటల ప్రజాద్రోహి అంటూ మంత్రాలు చదివినట్టే చదివేట్టున్నారు టీఆర్ఎస్ నాయకులు… ఆఫ్టరాల్ ఈటల అనుకున్నప్పుడు, ఇంత నిత్య జపమేంటి డియర్ కేటీయార్..? చివరకు టీఆర్ఎస్ 20 ఏళ్ల పండుగ ప్లీనరీ సందర్భంగా ‘సెలెక్టెడ్ మీడియా’కు మాత్రమే ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలలో కూడా ఈటల మీద విసుర్లు, హుజూరాబాద్ ఎన్నికల విషయాలే… నిజంగా ఇరవయ్యేళ్ల పార్టీ ఆవిర్భావ వేడుక సందర్భాన్ని జనానికి చెప్పుకునేది ఇలాగేనా..? ఇదేనా..!!
నిజానికి ఈ ఎన్నికే అనవసరంగా తెలంగాణ సమాజం మీద రుద్దబడిన ఓ అనవసరపు ప్రక్రియ… నిజంగా ఈటల మోసగాడు అయితే, ఈటలది ద్రోహచింతన అయితే, ఈటల తెలంగాణ ద్రోహి అయితే దానికి పార్టీ, ఇన్నేళ్లుగా తనను ఎంకరేజ్ చేసిన కేసీయార్ నైతికంగా ప్రథమ దోషి అవుతాడు… ఇన్నేళ్ల పార్టీ ప్రస్థానంలో ఈటల లేకుండా ఏమీ లేదు కదా, మరి ఈటల అక్రమ ఎదుగుదలకు పార్టీ కూడా బాధ్యత వహిస్తుందా..? ఒకవేళ ఈటల గనుక టీఆర్ఎస్‌ను, కేసీయార్‌ను విమర్శిస్తుంటే… అదీ తప్పే… మరి ఆ ద్రోహపార్టీలో, ఆ విశ్వాసఘాతుక నాయకుడి దగ్గర చేతులు కట్టుకుని, ఇన్నేళ్లూ జీహుజూర్ అని నువ్వు ఎందుకు వేలాడినట్టు..? సో, దొందూ దొందే… కేటీయార్ ఇంటర్వ్యూ విషయానికి వస్తే… మొత్తం ఈటల మీద విమర్శలే కనిపిస్తున్నయ్… ఈటల మీద గెలుపు అంత ప్రిస్టేజియసా..? కొత్త కొత్త ‘పథకాల’తో అణగారిన వర్గాల మీద ఎక్కడా లేనంత ప్రేమ, ఎన్నడూ లేనంత ప్రేమ ఇప్పటికిప్పుడు పుట్టుకురావాలా..? వేల కోట్లను గుమ్మరించాలా ఆ నియోజకవర్గంలోనే..? మిగతా ప్రాంతాలు తెలంగాణలో లేవా ఏం..? ఈటలను ఓడించడాన్ని పార్టీ ఓ జీవన్మరణ సమస్యలా తీసుకోవడం ఏమిటి అసలు..? ఈటల ఇప్పుడు గెలిచినా సరే, ఓడినా సరే… ఆల్‌రెడీ పార్టీకి అంటుకున్న జ్వరం ఈటలను నైతికంగా గెలిపించినట్టయింది…
Ads
ఈటల, రేవంత్ ఇద్దరూ గోల్కొండ రిసార్ట్‌లో రహస్యంగా కలిశారట… ఇద్దరూ చేతులు కలిపారట… టీఆర్ఎస్ మీద కుట్ర పన్నుతున్నారట…… ఇదొక మైండ్ గేమ్ ఆరోపణ… నిజంగా ఒక కోణంలో ఆలోచిస్తే… తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిన వాళ్లెందరో టీఆర్ఎస్‌తో ఎందుకు కలిశారు, మంచి పదవులు ఎలా పొందారు..? ఐనా ఈ రోజుల్లో రాజకీయాల్లో విలువలు ఏమున్నయ్..? ఈటల, రేవంత్ కలిస్తే నిజానికి తప్పేమిటి..? అవసరం వచ్చినప్పుడు ఫోటోలు బయటపెట్టడం ఏమిటి..? హుజూరాబాద్ ఎన్నికను మించిన సందర్భం ఏమొస్తుంది..? కమాన్.., ఫోటోలు బయటపెట్టెయ్ చిన్న సారూ… తప్పేముంది..? జనం కోణంలోనే చెప్పుకుందాం… నీ పార్టీ నుంచి తరిమేశాక ఈటల ఎవర్ని కలిస్తే ఏమిటి తప్పు..? అయినా బీజేపీకి ప్రబల, ప్రధాన ప్రత్యర్థి టీఆర్ఎస్… కాంగ్రెస్‌కు కూడా అంతే… దాన్ని నేలమీదకు దింపడానికి రెండు కలిస్తే దాన్ని కుట్ర అని ఎందుకనాలి..? ఎత్తుగడ అనాలి… కనిపిస్తే చాలు, కుత్తుకలు కోసుకునేంత శత్రుత్వం ఉన్న బీజేపీ-లెఫ్ట్ ఆమధ్య బెంగాల్ స్థానిక ఎన్నికల్లో అనేకచోట్ల చెట్టపట్టాలేసుకుని కదిలాయి… ప్రబల, ప్రధాన, అధికార ప్రత్యర్థి మమత నుంచి రక్షణకు అదొక అనివార్యత… ఏది మంచో, ఏది చెడో ఆయా పార్టీల అంతర్గత సమస్య, రిస్కు… ఇందులో కుట్ర ఏముంది..? పార్టీ నుంచి వెళ్లగొట్టి, ప్రజల తీర్పు కోరాలి, రాజీనామా చేయాలని అని గాయిగత్తర చేసిన టీఆర్ఎస్ పార్టీ బయటి పార్టీల నుంచి వచ్చిన వేరే ఎమ్మెల్యేల విషయంలో ఈ వైఖరిని ఎందుకు తీసుకోలేదు..? వాళ్లకు ప్రజాతీర్పులు అక్కరలేదా..? వాళ్లు తాము ఒరిజినల్‌గా గెలిచిన పార్టీలకు ద్రోహం చేయలేదా..? తమకు వోట్లేసిన ప్రజలకు మోసం చేసినట్టు కాదా..?
ఒకవేళ ఈటల కాంగ్రెస్‌లోకి వెళ్లినా సరే, ఎందుకు తప్పుపట్టాలి… టీఆర్ఎస్ నుంచి వెళ్లగొట్టబడితే బీజేపీలో చేరలేదా..? తనకు అనువైన పార్టీలో చేరడం తప్పుడు పని ఎలా అవుతుంది..? ఈటల TRS పార్టీకి చేసిన ద్రోహం ఏముంది..? వెన్నుపోటు పొడిచాడనే వ్యాఖ్యలు సరే, కానీ తనను ఎందుకు పార్టీ నుంచి బయటికి వెళ్లగొట్టారో, కేసీయార్‌కు అంత కోపం ఎందుకు వచ్చిందో ఈరోజుకూ వెల్లడించలేదేమిటి..? కేటీయార్ వారసత్వ పదవీప్రస్థానానికి ఎసరు పెట్టబోయాడా..? పార్టీని చీల్చాలని చూశాడా..? అవన్నీ చెబితేనే కదా ఈటల దుర్మార్గం ఏమిటో ప్రజలకు తెలిసేది, పోనీ, ప్రజలకు తెలియకూడని ద్రోహాలు ఇంకేమైనా చేశాడా..? ఈటల ఏదో శుద్ధపూస, నిఖార్సయిన నీతికీ, నిబద్ధతకూ, నియమశీలతకు ప్రతీక అని ఎవరూ పల్లకీ మోయడం లేదు… కానీ తనకు అమిత ప్రాధాన్యం ఇచ్చి, హీరోను చేస్తున్నది ఎవరు..?! తనపై పార్టీ వేసే బండ రాళ్లన్నీ పరోక్షంగా తగిలేది పార్టీకే కదా..? నిన్నటివరకూ మీవాడే కదా… మీ తానులో ముక్కే కదా..!! సో, 20 ఏళ్ల పార్టీ ప్రస్థానం మీద మాట్లాడాల్సింది పోయి, ఇప్పుడూ ఈ ఈటల పాటలేనా..?! 20 ఏళ్ళ మీ ప్రగతి సూచికా ఈటల..!!
Share this Article