అయిపోయింది, అంతా అయిపోయింది… ఇంకేముంది..? ఈ రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబుకు తెలంగాణను రాసిస్తాడు… తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపేస్తాడు… దారుణం, ఘోరం, అక్రమం, అన్యాయం అన్నట్టుగా ఓ మాజీ మంత్రి బీఆర్ఎస్ మౌత్ పీస్ పత్రికలో తెగ ఆక్రోశం వెలిబుచ్చాడు ఈరోజు…
తన ఫ్లో ఎలా సాగిందో ఓసారి ఇది చదవండి…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకే తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్ర ఏర్పాటును పరిహసించి, వికటాట్టహాసం చేసినవాళ్లు ప్రగతిభవన్‌లో కలుసుకునే ఒక దుర్దినం, చారిత్రాత్మక ఘోర తప్పిదం మన కండ్లముందే జరగబోతుండటం దురదృష్టకరం. ఆ గాయాలు మానకముందే ఈ రోజు చంద్రబాబు నాయుడు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి (తెలంగాణను వ్యతిరేకించిన ధీరోధాత్తులు) తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన ప్రగతిభవన్‌లో (తెలంగాణ వ్యతిరేకుల) కలయిక జరుగబోతున్నది. ఆహా ఎంత అద్భుతం! ఇందుకేనా అంతమంది అమరులైంది? ఇందుకేనా దశాబ్దాల పాటు తెలంగాణ గళాన్ని ప్రజలు వినిపించింది? ఓహో ఇందుకేనా వేల మంది కవులు, కళాకారులు తమ గళం విప్పింది, గర్జన చేసింది, పాటలు పాడింది? ఓహో ఇందుకేనా తెలంగాణ సమాజం సకలజనుల సమ్మె చేసింది? ఓహో ఇందుకేనా అంతా ఒక్కటై నిలిచింది? ఎంతటి విషాదమిది.
బీఆర్ఎస్ నాయకులతో ఇదే తంటా… తాము అర్జెంటుగా పాత వ్యవహారాలు అన్నీ మరిచిపోయినట్టే, జనం కూడా మరిచిపోయారు అనుకుంటారు… మరిచిపోవాల్సిందే అంటారు… చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిస్తే అది తెలంగాణ ద్రోహమట… దీనికోసమేనా ఉద్యమాలు, అమరుల త్యాగాలు అని బాగా కన్నీళ్లు పెట్టుకున్నాడాయన… పర్లేదు, తెలంగాణ అమరులు, త్యాగాలు గుర్తున్నందుకు..?
Ads
ఐతే… అప్పుడే అన్నీ మరిచి పోతే ఎలా..? జగన్, కేసీయార్ ఆలింగనాలు, భేటీలు జనం విస్మరించలేదు కదా… చంద్రబాబు కనీసం తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చాడు… జగన్ చాన్నాళ్లు వీర సమైక్యవాద దీక్షలు చేశాడు కదా.., మరి దాన్నేమనాలి..? ఆ ఇద్దరి కలయికను ఏమనాలి..?
రోజా ఇంట్లో భోజనం చేసి, రాయలసీమను రత్నాలసీమను చేస్తానని పలికిన ఆ మాటల వెనుక మర్మేమిటి..? పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేస్తున్నారయ్యయ్యో అని ఉద్యమించిన గొంతు రాయలసీమ లిఫ్టును, పోతిరెడ్డిపాడు విస్తరణను ప్రశ్నించలేదెందుకు..? అభ్యంతరం చెప్పలేదెందుకు..? అంతేల, మాతో చెప్పింతురేమయ్యా…
గోదావరి నీళ్లను శ్రీశైలానికి తీసుకుపోయే మరో పెద్ద లిఫ్ట్ పథకాన్ని సంయుక్తంగా రచించలేదా ఆ ఇద్దరు నేతలు..? శ్రీశైలం నుంచి సీమకు, పెన్నాకు మరిన్ని జలాలు ఇవ్వడమే కదా ఆలోచన..? ఇలాంటివెన్నో..! తెలంగాణవాదం, సమైక్యవాదం దోస్తానా మరిచిపోయారా..? పోనీ, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కలుస్తారనే అనుకుందాం… ఏపీ చంద్రబాబు సొత్తు కాదు, తెలంగాణ రేవంత్‌రెడ్డి సొత్తు కాదు, కలిపేయడానికి, కలిపి పంచుకోవడానికి..!
తెలంగాణ ఆకాంక్షలకు భిన్నంగా వెళ్తాడా రేవంత్‌రెడ్డి, తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టుకుంటాడా..? చంద్రబాబు ఒక సీఎం, రేవంత్‌రెడ్డి ఒక సీఎం… అంతే… వ్యక్తిగతంగా ఇద్దరికీ సత్సంబంధాలు ఉంటే ఉండవచ్చుగాక… ఇరుగూపొరుగూ సీఎంలుగా ఇష్యూస్ ఉంటాయి, కలిసి మాట్లాడితే సొల్యూషన్స్ కూడా దొరుకుతయ్… అంతెందుకు..? ఒక సీఎంగా పీఎం వద్దకు కూడా వెళ్లాడు కదా… పదవుల్లో ఉండే బాధ్యతలు వేరు, పార్టీల ఘర్షణ వేరు…
ఇదే చంద్రబాబు ఎన్డీయే మనిషి ఇప్పుడు… ఇదే రేవంత్‌రెడ్డి ఇండి కూటమి మనిషి ఇప్పుడు… రెండు భిన్న ధృవాలు పార్టీలుగా… సో, పార్టీలు వేరు, వ్యక్తులు వేరు, పదవులు వేరు… కలుస్తున్నారు అంటేనే అదొక విపత్తు అనే చిత్రీకరణ దేనికి అనేదే ఇక్కడ ప్రశ్న..!!
Share this Article