Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విను తెలంగాణ… కేసీయార్ సర్కారుపై జనంలో ఈ ఆగ్రహానికి కారణాలేమిటి..?

November 28, 2023 by M S R

Kandukuri Ramesh Babu …….. విను తెలంగాణ – ప్రభుత్వంపై ఎందుకీ ఆగ్రహం? కేవలం ఒకే ఒక దశాబ్ద కాలం. కానీ తెలంగాణా అనేక దశాబ్దాల వెనక్కి వెళ్ళింది. ఆ వెనుకబాటు నుంచి ప్రజ మౌనం దాల్చింది. అందుకు కారణం రెండడుగులు వెనక్కి వేసి మరో పెద్ద అడుగు ముందుకు వేయడానికే అని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించినట్లు లేదు.

తెలంగాణా రాష్ట్రంలో అధికార బిఆర్ ఎస్ పార్టీపట్ల పట్ల ప్రజాభిప్రాయాన్ని జన సామాన్యంలో తెలుసుకోవడానికి గాను దాదాపు ఇరవై రెండు రోజుల పాటు ఉమ్మడి పది జిల్లాల్లోని ఎనిమిది జిల్లాల్లో క్షేత్ర పర్యటన గావించినప్పుడు అనేక విస్మయకరమైన విషయాలు తెలిసి వచ్చాయి. విచారానికే గురి చేశాయి. వాటి గురించి వివరంగా రాయడం కంటే సంక్షిప్తంగా పంచుకోవాలన్నది ఈ వ్యాసం ఉద్దేశ్యం. అందులో ఒక అంశం ఇక్కడ ప్రస్థావిస్తాను.

కెసిఆర్ గారు రెండు సార్లు దాదాపు సిట్టింగ్ ఎం ఎల్ ఎ లకు అవకాశమివ్వడం చూడటానికి ఎంతో ఉదారంగా కానవచ్చింది. కానీ అది ఒక నిరంకుశత్వానికి వీలుగా రూపొందించుకున్నదే అన్న గ్రామస్తుల నోటి మాట చెప్పక తప్పదు. నిజానికి ప్రజా ప్రతినిధుల పేరిట బిఆర్ ఎస్ ప్రభుత్వం ఒక సెంట్రలైజ్డ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నది. అందులో భాగంగా ఉన్న ఎం ఎల్ ఎ లు, అందులో మంత్రి పదవులు పొందిన వారేగాక, వివిధ నామినేటెడ్ పదవులను పొందిన వారు, వీరంతా కలిసి తెలంగాణా ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారితో కలిసి పని చేయడం కాకుండా వారి కనుసన్నలలో రాష్ట్రంలోని ప్రధాన వనరులను యధేచ్చగా దోపిడీ చేస్తూ రావడం ప్రజలను కలచి వేసింది.

Ads

తమలో ఒకరిగా ఉన్న వాళ్ళు, మలిదశ ఉద్యమంలో తమతో పాటు భుజం భుజం కలిపి ఉద్యమించి వారు ఎప్పుడైతే అధికారంలో భాగమయ్యారో క్రమేణా వారు ప్రజల సమస్యలను పట్టించుకోవడం మానేసి అవకాశవాదానికి లోనవడం, అవినీతికి చోటివ్వడం, దౌర్జన్యాలకు దిగడం, భూ కభ్జాలకు పాల్పడటం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.

రెండోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ దోపిడీ మరో మెట్టు ఎదిగి అది ఒక మాఫీయాగా రూపాంతరం చెందింది. తెలంగాణాలోని వనరులన్నీ శరవేగంగా తరలి వెల్లడం మొదలయ్యింది. ఒక్కటని కాదు, రాష్ట్రంలోని ప్రతో చోటా మీకు దందాలుగా మొదలైన మాఫియాలు కనబడుతాయి. అధికార పార్టీ అనుమతితోనే ఇంతింతై వటుడింతై అన్నట్టు అధికార ప్రజా ప్రతినిధులు ఎదిగిపోయారు. ఒక్కటని కాదు, వారు చేపట్టనిది లేదు. బూడిద మొదలు ఇసుక, గనులు, కలపతో సహా భూములను ఆక్రమించుకుని అన్ని వనరులనూ కొల్లగొట్టుకు పోతూ వీరు తరతరాలకు సరిపడా ఆస్తులను సంపాదించుకున్నారు.

ఉండటానికి ఇల్లు లేని వాళ్ళు చూస్తుండగానే విల్లాలు, ఫాం హౌజుల దాకా సమకూర్చుకోవడమే కాదు, బంధుమిత్రుల పేరుతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు తెరలేపారు. సహజ వనరుల దోపిడీకి తోడు కల్లుతో మొదలు మద్యం నుంచి చివరకు గంజాయి దాకా విచ్చలవిడిగా అందుబాటులోకి తెచ్చి నేడు గ్రామా గ్రామాన యువతను మత్తులో ముంచి రేపటి తరాన్ని నిర్వీర్యం చేస్తుండటం ప్రజలంతా చూస్తూ వచ్చారు.

ప్రజా ప్రతినిధుల పని ఇలాంటి వ్యాపారం కావడం కారణంగా పాలనా పరమైన విషయాలన్నీ ద్వితీయం అయ్యాయి. కేవలం రోడ్లు, వీధి దీపాలు, పట్టణీకరణ వంటి అభివృద్ధి పెద్ద ఎత్తున కానవచ్చేలా చేశారు. వాటి వెనక జరిగింది విధ్వంసం. సిరిసిల్ల వంటి చోట్ల ఆత్మహత్యలు లేవని ప్రభుత్వం అంటుంది కానీ అక్కడ జీవచ్చవాలు ఉన్నాయన్నది యదార్థం.

ఈ విధ్వంసానికి తోడు ఆంధ్రా కాంట్రాక్టర్లకు మేలు చేస్తూ పెద్ద ఎత్తున కమిషన్లకు చోటిచ్చే బడా ప్రాజెక్టులు మొదలయ్యాయి. ఇవన్నీ కమిషన్ల కోసమే తప్ప ప్రజల జీవితాల్లో మెరుగుదలకు కాకపోవడం ఒక వైచిత్రి. ఇది చిత్తూ ఐతే బొత్తు సంక్షేమం. అనేక సంక్షేమ పథకాల కారణంగా ప్రజలను లబ్దిదారులుగా కుదించి చేష్టలుడిగేలా చేశారు. ముందు చెప్పినట్టు యదేచ్చగా వనరుల దోపిడీ పెద్ద ఎత్తున ఈ పదేళ్ళలో జరుగుతూ పోతుంటే ఆ సంగతి వెలుగులోకి రాకుండా ప్రజల సమస్యలు కానరాకుండా అభివృద్ధి సంక్షేమం గురించి మీడియాలో చర్చలోకి వచ్చేలా జాగ్రత్త పడ్డారు…

1 వ్యక్తి చిత్రం కావచ్చుమరోవంక ప్రజలు ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజా ప్రతినిధులను కలవడానికి లేదు. ఏ శాసన సభ్యూడు, మంత్రు వర్యులూ అందుబాటులో ఉండక పోవడమే కాదు, డబ్బులు ఖర్చు పెట్టిన వారికే అధికారులు పనిచేసే స్థితి వచ్చారు. ఒక్క మంత్రి పీఏ తప్పా మరొకరి మాట వినని నియోజకవర్గాలు రాష్టమంతటా కొత్తగా తయారయ్యాయి. పోలీసులు మొదలు ఏ అధికారీ సామాన్య ప్రజలకు సహకరించే పరిస్థితి లేకుండా పోయింది.

వామపక్ష రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కాదు, ఆయా అన్యాయాలపై ఎవరు గొంతెత్తినా కష్టమే.ప్రభుత్వాన్ని, మంత్రులను, శాసన సభ్యులను ఏ కారణంగా ఎవరు ప్రశ్నించినా, ఎదురించినా, నిలదీసిన వారిపై కేసులు పెట్టడం ఒక సహజ ధర్మంగా మారింది. తమ పార్టీ కాకుండా ఇతర పార్టీల్లో ఉన్న ముఖ్య కార్యకర్తలెవరూ స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి లేదు. దాంతో ప్రజలు అనేక విధాలా బాధపడ్డారు. ఆ బాధలన్నీ రెండు దఫాల పరిపాలనలో వేదనగా మారాయి. ఇక చాలు, ఈ సారి బిఆర్ ఎస్ ను గెలిపిస్తే సద్ది కట్టుకొని ఎట్టికి వెళ్ళాలి అనే పరిస్థితి వచ్చింది.

ఇవన్నీ కలిసి ప్రజల్లో బిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేలా ప్రేరేపిస్తున్నై.తెలంగాణాలో రైతు బంధు కావొచ్చు, ధరణి కావొచ్చు, భూస్వాములను స్థిరపరిచేందుకు, భూములను కొల్లగొట్టేందుకు అది మార్గం తెరిచింది. ఇలా అన్ని పథకాలూ సంపన్నుడిని మరింత బలపరిచేలా పేదవాడిని ఇంకింత దారిధ్య్రంలోకి నేట్టేలా అసమానతలను పెంచి పోషించేలా జాగ్రత్త పడ్డారు. ఇవన్నీ సామాన్యుడికి అర్థమవడమే కాదు, ఆగ్రహానికీ నేడు కారణమయ్యాయి.

ముందు చెప్పినట్లు, కళ్ళ ముందే సహజ వనరులను కొల్లగొడుతూ వందల కోట్లకు ఎదిగిన మంత్రులు ప్రతి జిల్లాకు ఒకరిద్దరు ప్రశ్నించ వీలు లేనట్లు తయారయ్యారు. వారు -పేరేదైనా పెట్టండి -నయా దొరలు, జమీందార్లు, దేశ ముఖ్ లు, కొత్త భూస్వాములు. వీరంతా పదేళ్ళలో అవతరించారు. బలపడ్డారు.చిత్రమేమిటంటే వారంతా తమలోంచి ఎదిగిన వారే. ఈ ఆకస్మిక ఎదుగుదల ప్రజలను అచేతనులను చేసింది.

అవమానానికి గురిచేసింది. దీనికి కారణం రాష్హ్త్రం ఏర్పాటు కావడం, పునర్నిర్మాణం పేరుతో కెసిఆర్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఒక సారి కాదు, వారే రెండుసార్లు నియోజకవర్గంలో ఉంటూ స్థిరపడి పాలకులుగా ఎదగడం అని వారు గ్రహించారు. వీరంతా రెండున్నర దశాబ్దాల మలిదశ తెలంగాణా ఉద్యమం స్థిరపరిచిన విలువలన్నీ లుప్తం చేయదాన్ని సన్నిహితంగా గమనించారు. ఊరుకోలేదు. ప్రజలు శక్తికొద్దీ ఎక్కడికక్కడ తిరగబడిన ఉదాహరణలున్నాయి.

survey

ఆ వ్యక్తిగత నిరసనలను ఎప్పటికప్పుడు తమ అధికారబలంతో అణచివేయడం వారిని మరింత ఆందోళనకు గురి చేసింది. పర్యవసానంగా యావత్ తెలంగాణా అంతా కొన్నేళ్ళుగా మౌనం దాల్చింది. ఈ పరిణామాలన్నీ తెలిసిన మేధావి వర్గం, ప్రభుత్వంలో భాగమైన కవులు, కళకారులు, జర్నలిస్టులు, ఉద్యమ కారుల బృందం కూడా స్థభ్దంగా ఉండి ఈ దోపిడీకి సహకరించడం మరో తీరని ద్రోహం.

సరే, వారు చిన్న విషయం గానీ ప్రజలున్నారే. వారి మౌనం నేడొక నిశబ్ద విస్పోటనానికి యవనిక తెరుస్తున్నదని ఈ వ్యాసకర్త క్షేత్ర పర్యటనలో పొందిన అవగాహన బలిమి.

కాగా, పైన పేర్కొన్న పరిస్థితులను మార్చడానికి ఒకనాటి విప్లవోద్యమం లేదు. ప్రజా సంఘాల నేతలపై బెయిలు కూడా దొరకని విధంగా కేసులు నమోదయ్యాయి. ఈ స్థితిలో మహబూబ్ నగర్ లోని ఒక ఆర్టీసి ప్రభుత్వ ఉద్యోగి అన్నట్టు, “ఇప్పుడు ఎవరూ రాష్ట్రాన్ని రక్షించలేరు. ఒక్క ప్రజలు తప్ప” అన్న మాట నూటికి నూరుపాళ్ళు వాస్తవం. అంతేకాదు, మంచిర్యాల దగ్గర భీమారం గ్రామ రైతు అన్నట్టు, “కెసిఆర్ సార్ రెండుసార్లు పాలించింది చాలు, ఇక ఉంచం” అన్నది ఆ ప్రజలు నేడు నిశ్చయం చేసుకున్న స్పిరిట్.
మొత్తం మీద నేడు బిఆర్ ఎస్ వ్యతిరేకత అన్ని విధాలా కానవస్తుండటానికి పైపైకి పేర్కొనే అనేక కారణాల వెనకాల ప్రజలు సహజ వనరులు కోల్పోతున్న వైనం ముఖ్యంగా ఉన్నదని, తత్పలితంగా సకల జనుల ఆత్మగౌరవం మరుగుతున్నదని తెలుపడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం…

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions