అసాధారణం ఏమీ కాదు… కానీ ఆశ్చర్యమేసింది…! రాజ్యసభలో సభ్యులు చైర్మన్ కుర్చీకి కాస్త దిగువన ఉండే టేబుళ్లపైకి ఎక్కి గొడవ చేసింది నిజం… అయితే అది అసాధారణమేమీ కాదు… ఉభయసభల్లో సభ్యుల బాధ్యతారహిత ప్రవర్తన కొత్తేమీ కాదు… ఆ లెక్కన బీజేపీ కూడా తక్కువేమీ కాదు… సభాస్థంభన పాపంలో అదీ తక్కువేమీ కాదు… అయితే రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కంటతడి పెట్టుకోవడమే ఆశ్చర్యంగా ఉంది… అసలు తన సుదీర్ఘమైన పార్లమెంటరీ జీవితంలో ఎన్ని చూడలేదు ఇలాంటివి..? మరెందుకు కంటతడి..? ఇదేమీ అకస్మాత్తుగా చోటుచేసుకున్న అసాధారణ పరిణామమో కాదు కదా…! ఈమాత్రం దానికి గర్భగుడి, పవిత్రత వంటి పెద్ద పదాలు వాడటమే ఆశ్చర్యంగా ఉంది…
అసలు ఈ గర్భగుడి, పవిత్రత వంటి పెద్ద పెద్ద పదాల్ని, భ్రమల్ని జనం పట్టించుకుంటున్నారా..? మరీ ప్రత్యేకించి కొత్త జనరేషన్స్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్‌ను పట్టించుకుంటున్నాయా..? ఇవన్నీ ఎందుకు..? అసలు నిర్మాణాత్మక చర్చలు అనే పదానికి ఈ పార్టీలకు అర్థం తెలుసా..? ఎంతసేపూ పార్టీల లైన్ బట్టి గొడవలు… వాగ్వాదాలు… ఎత్తిపొడుపులు ఎట్సెట్రా… హుందా రాజకీయాలు అనే పదం మరిచిపోయి ఎన్నేళ్లయిందో కదా ఈ దేశం… కొత్త తరాలు మన రాజకీయాల్ని అసహ్యించుకోవడానికి కారణాలు మళ్లీ మళ్లీ చర్చించుకోవాలా..? ఇవన్నీ వదిలేద్దాం… ఉప రాష్ట్రపతి కంటతడి పెట్టుకున్నాడు అనగానే వైసీపీ సోషల్ మీడియా ఎహెహె అని వెక్కిరింపులకు పూనుకుంది… అది బాగాలేదు… వెంకయ్యనాయుడు తన ఎమోషన్స్ వ్యక్తీకరించడం తప్పంటే ఎలా..? ఆ టైంలో ఏడవలేదు, ఈ టైంలో ఏడవలేదు అనే వాదనలు అబ్సర్డ్… అది ఆ సమయంలో తన ఎమోషన్… దాన్ని తప్పుపట్టడం తప్పు…
Ads
అయితే… వెంకయ్యనాయుడు గద్గదస్వరంతో బాధపడుతున్నానని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది అని మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఇవన్నీ కొత్త కాదు కాబట్టి… అవన్నీ వెంకయ్యకు కొత్త కాదు కాబట్టి… తను ఛైర్మన్ హోదాలో ఉన్నాడు… ఒకవేళ సభ్యులు అనుచితంగా వ్యవహరించారూ అనేదే ఆయన అభిప్రాయం అయితే, తను ఏడ్వడం దేనికి..? నిర్దాక్షిణ్యంగా, నిర్మొహమాటంగా వాళ్లపై చర్యలు తీసుకోవచ్చు కదా… వాళ్లు టీఎంసీ అయితేనేం..? చర్యలు తీసుకుంటే బీజేపీకి కూడా ఆనందదాయకమే కదా… టీఎంసీ ప్రజాప్రతినిధులు అంటేనే దేశంలో ఓరకమైన అభిప్రాయం ఏర్పడి ఉంది… మరి ఓ అవకాశం వచ్చినప్పుడు వెంకయ్య కొరడా తీసుకుని చెళ్లుమనిపించవచ్చు కదా… ఓ రెండు సెషన్ల పాటు నిషేధం విధించవచ్చు కదా… మిగతా పక్షాలు వ్యతిరేకిస్తాయీ అంటారా..? జనం ఎదుట ఎక్స్‌పోజ్ చేసినట్టు ఉండేది కదా… ఎవరెటు వైపో తేల్చుకోవడానికి ఓ మార్గం ఏర్పాటు చేసినట్టు ఉండేది కదా… సుదీర్ఘమైన పొలిటికల్, పార్లమెంటరీ కెరీర్ ఉన్నవాళ్లే ఏడుస్తూ కూర్చుంటే… అడుగు పడేదెలా..? మమత పార్టీ పట్ల మీరెలాగూ కఠినంగా ఉండలేరు, మీ బీజేపీ కేడరే ఇల్లూవాకిళ్లు వదిలి, అత్యాచారాలతో సఫరవుతూ వలసపోతుంటే మీకు ఎలాగూ కనిపించదు… కనీసం సభలోనైనా కఠినంగా ఉండలేరా..? ప్రజలకు ఈ ఏడుపులు దేనికి సార్..?!
Share this Article