నిజమే… పత్రికల ప్రమాణాలు పాతాళానికి పడిపోయాయని మీడియా సంస్థల యజమానులు కూడా అంగీకరించాల్సిన నిజం… సొసైటీలోని అన్ని రంగాల్లోనూ కనిపించే పతనమే పాత్రికేయంలోనూ ఉంది… సొసైటీలో భాగమే కదా..! ఐతే ఎలాగూ దిగజారుతున్నాం కదాని ఇక అన్ని విలువల్నీ, ప్రమాణాల్నీ మూసీలో కలిపేసుకోవాలా..? ప్రత్యేకించి డబ్బు కోసం సొసైటీకి హాని చేసే చర్యలకు పాల్పడినా సరేనా..? ఇక నైతికత అనే పదాన్ని బొందపెట్టడమేనా..? పొద్దున్నే ఈనాడు ఫుల్ పేజీ యాడ్ చూశాక ఇదే అనిపించింది… వేలకువేల కోట్ల సంపదను జాతి కట్టబెట్టింది కదా, ఇంకా ఈ గుట్కా చిల్లర పైసల కోసం ఈనాడు ఆర్థిక సామ్రాజ్యం ఆశపడాలా అనిపించింది… ఏవో చిన్నాచితకా పత్రికలు, యూట్యూబ్ సైట్లు కక్కుర్తి పడ్డాయంటే అది కడుపు కోసం… మరి ఈనాడుకు దేనికోసం ఈ ప్రచారప్రకటనలు, ఈ దిగజారడం..?! డర్టీ డైలాగులు, డర్టీ సీన్లతో నింపేసి కాసులు ఏరుకునే బూతు చిత్రాలకు ఇవి ఏం తక్కువ..? ఎలా సమర్థించుకోగలదు..? సార్, మీరు పద్మవిభూషణ్… మీ రేంజ్ మెయింటెయిన్ చేయండి…
ప్రచార ప్రకటనలు అందరూ చేస్తారు… నిన్నగాక మొన్న సెలబ్రిటీగా మారిన పిల్ల కాలువ దగ్గర్నుంచి అమితాబ్ దాకా అందరూ నటిస్తారు, అందరికీ డబ్బులు కావాలి… అయితే డబ్బిస్తే ఏ పనైనా చేయాలా..? మొన్నామధ్య అమితాబ్ ఇలాంటి దిక్కుమాలిన ప్రకటన నుంచి వైదొలిగాడు తెలుసు కదా… అఫ్‌కోర్స్, అది హృదయంలో నుంచి వచ్చిన మంచి నిర్ణయమా..? ఈ వయస్సులో కూడా ఈ చిల్లర పైసల కక్కుర్తి అవసరమా అని మండిపడిన నెటిజనం కారణమా..? లేక ఇలాంటి యాడ్స్ చేయడం సరికాదంటూ National Anti-Tobacco Organisation అక్షింతలు వేస్తూ లేఖ రాయడం కారణమా..? ఈ చర్చ వదిలేస్తే పాన్ మసాలా యాడ్ నుంచి తప్పుకోవడంతోపాటు తను తీసుకున్న రెమ్యునరేషన్ కూడా వాపస్ పంపించేశాడు, తప్పు కడుక్కున్నాడు… చివరకు సాయిపల్లవి వంటి హీరోయిన్లు కూడా ఈ చిల్లర సొమ్మును ఎడమకాలితో తన్నేస్తున్నారు, అది నైతికత…
Ads
మహేశ్ బాబు కూల్ డ్రింక్స్ యాడ్స్ చేస్తాడు, పాన్ బహర్ యాడ్స్ చేస్తాడు… తనకు డబ్బొస్తే చాలు… ఇలాంటివి నటించాలా వద్దా అనేది తన నైతిక ధోరణికి వదిలేద్దాం… ఇలాంటి ప్రకటనలను అచ్చేయడానికి పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా ఎందుకు సిద్ధపడాలి అనేది ప్రశ్న… ఇలాంటి యాడ్స్‌ను సరోగేట్ యాడ్స్ అంటారు… అంటే అసలును స్పురింపచేసే నకిలీలు అని..! సమాజానికి నష్టదాయకమైన పొగాకు ఉత్పత్తులు, మద్యం ప్రచారప్రకటనల్ని 1995లోనే ప్రభుత్వం నిషేధించింది… (అయితే సరిగ్గా అమలు చేసేవాడెవడు..?) 1975 నుంచే ఈ ప్రకటనలపై ‘‘ఆరోగ్యానికి హానికరం’’ అంటూ డిస్‌క్లెయిమర్లు, హెచ్చరికలు రాయాలనే నిబంధన ఉండేది… ప్రభుత్వం ఏకంగా బ్యాన్ పెట్టగానే ఈ సంస్థలు ఏం చేశాయంటే..? ఈ సరోగేట్ యాడ్స్ స్టార్ట్ చేశాయి… ఫస్ట్ ఆజాద్ బీడీ వాడు మొదలెట్టాడు… సరోగేట్ యాడ్స్ అంటే ఇంకా సరళంగా అర్థమయ్యేలా చెప్పాలంటే…?
సపోజ్, కింగ్ ఫిషర్ బీర్… ప్రచారం చేసుకోవడానికి వాళ్లు ఏ మినరల్ వాటర్ బాటిలో, సోడా సీసాయో అదే బ్రాండ్ పేరుతో, అదే డిజైన్‌తో, అదే లోగోతో మార్కెటింగ్ చేస్తున్నట్టు యాడ్స్ ఇస్తారు… పరోక్షంగా అది బీర్ బ్రాండ్ ప్రమోషనే… కాకపోతే లీగల్‌గా చిక్కు లేకుండా ఉండటం కోసం ఈ కొత్త వేషాలు అన్నమాట… సేమ్, ఆఫీసర్స్ చాయిస్ వాడు ప్లేయింగ్ కార్డ్స్ పేరిట, బ్యాగ్‌పైపర్ వాడు క్లబ్ సోడా పేరిట యాడ్స్ ఇస్తాడు… బకార్డి వాడు మ్యూజిక్ సీడీల పేరిట… కొన్ని కంపెనీలు టీషర్టులు, క్యాప్స్, కీచెయిన్లు, గ్లాసులు పంపిణీ చేస్తుంటాయి వాటి బ్రాండ్ ప్రమోషన్ కోసం… ఈమధ్య బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌తో ఈవెంట్లు ఆర్గనైజ్ చేస్తున్నారు… నిజానికి మీడియా ప్రచారమే కాదు, ఏరకమైన కమ్యూనికేషన్ ద్వారా ప్రచారం చేసుకున్నా నిషేధమే… పరోక్షమైనా, ప్రత్యక్షమైనా… సరోగేట్ యాడ్స్ మీద కోర్టులు కొరడా ఝలిపిస్తేనే కాస్త ప్రభుత్వంలో కదలిక రావచ్చునేమో… ఎందుకంటే..? కొన్ని సర్వేల ప్రకారం ప్రతి 50 మందిలో 42 మంది ఈ పరోక్ష ప్రచారం అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటున్నారు… ప్రభావం ఉంటోంది… మరి బ్యాన్లకు అర్థమేమున్నట్టు..? మరొక చిక్కు ప్రశ్న… మీడియాకు సామాజిక బాధ్యత అక్కర్లేదా..?! ఈనాడులో యాడ్‌ను ఉదాహరణగా తీసుకుంటున్నాం గానీ, నిజానికి ఈ కథనం ఈ డబ్బుల కోసం కక్కుర్తి పడే ప్రతి మెయిన్ స్ట్రీమ్ పత్రికకు, టీవీకి వర్తిస్తుంది…!!
Share this Article