ఏమైంది ఈ టీవీ9 కి?
ఒకవైపు దిగజారుతున్న రేటింగ్స్
దెబ్బతింటున్న బ్రాండ్
ఇంకోవైపు అస్తవ్యస్తమైన వ్యవస్థ
మరోవైపు పసలేని నాసిరకం వార్తలు
అవును… టీవీ9 ఒకప్పుడు ఒక బ్రాండ్.. న్యూస్ అంటే టీవీ9 ఛానెల్ పెట్టండిరా అనేవాళ్లు.. చాలా విషయాల్లో అతి చేసినా అదే టీవీ చూసేవాళ్లు.. తిట్టుకుంటూ కూడా టీవీ9 మాత్రమే చూసేవాళ్లు.. ఎన్ని చానెళ్లు ఉన్నా తెలుగునాట న్యూస్ అంటే టీవీ9 మాత్రమే.. ఇదంతా గతించిన కాలంలో.. రవిప్రకాష్ అనే వ్యక్తి న్యూస్ కి బ్రాండ్ అంబాసిడర్.. జనాల పల్స్ తెలిసినోడు.. ఎప్పుడూ స్క్రీన్ మీద ఏదో ఒక మ్యాజిక్ చేసేవాడు.. ఏదో ఒక విషయాన్ని పట్టుకుని రాద్దాంతం చేసేవాడు.. అతివాదమో.. వితండవాదమో స్క్రీన్ మీద రచ్చ చేసేవాడు..
చివరికి జనాలు ఆఫీస్ ముందుకు ధర్నాలు చేసేంతగా ఆ వార్తని చింపి చాట చేసేవాడు.. చెప్పిందే చెప్పి చూపిందే చూపి అప్పుడప్పుడు విసుగెత్తించినా సరే అందులోంచి రేటింగ్స్ పుట్టించేవాడు.. రేటింగ్ తగ్గిందంటే ఆఖరికి శ్రీరెడ్డి లాంటి వారి వివాదాన్ని కెలికి మరీ జనాన్ని టీవీ ముందు కూర్చునేలా చేసేవాడు.. నిత్యం ఏదో ఒక రచ్చ.. ఎన్ని బండబూతులు తిట్టినా రవిప్రకాష్ ఉన్నప్పటి టీవీ9 ను చూసేవారు.. మిగిలిన ఛానెళ్లలో అదే వార్త వచ్చినా టీవీ9 లో ప్రెజెంటేషన్ వేరుగా ఉండేది.. సెన్సేషన్ అంటే టీవీ9.. టీవీ9 అంటే సెన్సేషన్.. ఇదంతా గతం.. ఒకప్పటి టీవీ9 ఇది..
Ads
కానీ ఇప్పుడు అదే టీవీ9 ఏమైంది? రేటింగ్ పడిపోయి.. నాసిరకం వార్తలు, భజన వార్తలు, చప్పిడి వార్తలు.. అన్ని ఛానెళ్లలో ఏ వార్తలు వస్తున్నాయో దీనిలోనూ అంతే.. ఏ కొత్తదనం లేదు.. హడావిడి లేదు.. అందుకే నాడు తిట్టుకుని మరీ చూసే జనం కూడా ఇప్పుడు టీవీ9 ముఖం చూసేవాళ్లు లేరు.. పైగా కొన్ని పార్టీలు అయితే టీవీ9 నీ పూర్తిగా బ్యాన్ చేశాయి.. కనీసం వాట్సాప్ లో ఆ ఛానెల్ యూట్యూబ్ లింక్ షేర్ చేస్తే దానికి వ్యూస్ ఎక్కడ పెరుగుతాయోనని మానేశారు..
ఒకవిధంగా టీవీ9 హెడ్ లైన్ సౌండ్ కూడా జనాలకి నచ్చడం లేదు.. దీనివల్ల ఛానెల్ బ్రాండింగ్ పడిపోయింది.. ఇప్పటికీ రవిప్రకాష్ పుణ్యమా అని వచ్చిన బ్రాండింగ్ వల్ల ఆదాయం వస్తోంది.. ఇంకొన్నాళ్ళకు ఛానెల్ యాడ్ రెవెన్యూ పడిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.. ఆదాయం వస్తోంది కాబట్టి ఛానెల్ లో ఎలాంటి నాసిరకం కంటెంట్ వచ్చినా యాజమాన్యం పెద్దగా పట్టించుకోవడం లేదు.. ఛానెల్ రేటింగ్ తగ్గిపోయినా ప్రస్తుతానికి యాజమాన్యం ఏమీ పట్టనట్టే ఉంది..
ఒకప్పుడు టీవీ9 ఇలా ఉండేది అని చెప్పుకోవాల్సి వస్తుందేమో.. రవిప్రకాష్ వెళ్లగొట్టబడినాక .. అటాప్సీని అటో స్పై అని, పోస్కో అని పలికే అపర సబ్జెక్టు మేధావుల్ని ఎడిటర్లుగా నియమించింది.. అలాంటి ఎడిటర్ల చేతిలో పడ్డాక వాళ్ల సముపార్జన మీద పెట్టిన దృష్టి ఛానెల్ రేటింగ్ మీద పెడుతున్నట్టు లేదు.. జనాల పల్స్ పట్టుకునే విధంగా వార్తలు ఇచ్చే జర్నలిస్టులు కూడా పెద్దగా అక్కడ ఉన్నట్టు లేరు.. కొంతమంది వదిలేసి వెళ్లిపోయారు…
మరోవైపు ఛానెల్ NTV రేటింగ్స్ లో మాత్రం దూసుకుపోతోంది.. అసలు ఆ ఛానెల్లో ఏమాత్రం హడావిడి ఉండదు.. ప్లెయిన్ వార్తలు మాత్రమే ఇస్తారు.. అయినా జనాలు ఆదరిస్తున్నారు.. ఇప్పుడు ఏదో ఒక వారం టీవీ9 పాయింట్ ఫైవ్.. రేటింగ్ పెరిగితే చాలు అదే బంగారం అంటూ సంబరాలు చేసుకుని, కేకులు కట్ చేసుకుని వ్యక్తిగత భజన చేసుకునే పరిస్థితి.. లేదా పక్క ఛానెల్ కి రేటింగ్ పెరిగితే కుట్ర, దగా, మోసం అంటూ కోట్లు ఖర్చు పెట్టి హోర్డింగులు పెట్టుకునేంత దీన పరిస్థితి దాపురించింది.. కోట్లు హోర్డింగులకు పెట్టే బదులు ఆ డబ్బులు ఉద్యోగుల జీతాలు పెంచితే సరిపోతుంది కదా..
నిజానికి ఆ ఛానెల్ మేనేజ్మెంట్ మంచిదే.. మైహోమ్ లాంటి సక్సెస్ ఫుల్ సంస్థని నడుపుతున్న జూపల్లి రామేశ్వరరావుకు ఏ వ్యాపారమైనా పట్టిందల్లా బంగారమే.. సిమెంట్ కంపెనీ పెట్టినా కోట్లు కురిపించింది.. కానీ వాళ్లు అడుగుపెట్టిన మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎందుకో కలిసి రాలేదు.. మొదట నిమ్మగడ్డ ప్రసాద్ తో కలిసి 10 టీవీ కొన్నారు..
ఆ తర్వాత మేఘా కృష్ణారెడ్డి పుణ్యమా అని టీవీ9 నీ వందల కోట్లు పెట్టి కొన్నారు.. వాళ్ల చేతుల్లోకి వచ్చిన దగ్గర నుంచి నష్టాల్లోనే ఉంది. గ్రూపులో ఏవో ఒకటో రెండో సంస్థలు తప్ప అన్నీ నష్టాలే.. కనీసం రేటింగ్ కూడా లేదు.. తెలుగు టీవీ9 ఇలా రెండో స్థానంలో ఉంటే ఇన్నాళ్లు నంబర్ వన్ గా ఉన్న కన్నడ టీవీ నైన్ కూడా అక్కడ పబ్లిక్ టీవీ దెబ్బకి వెనక్కి వెళ్ళిపోయింది .. రేపోమాపో రిపబ్లిక్ కన్నడ పుంజుకుంటే మూడో స్థానానికి వెళ్లిపోతుంది.. ఇక భారత్ వర్ష్ లాంటి నేషనల్ ఛానెల్ ఆరో, ఏడో నంబర్ లో ఫిక్స్ అయిపోయింది.. ప్రతి నెలా కోట్లకు కోట్లు ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది.
ఇక తెలుగులో ఒక ఓటిటిలో పెట్టారు.. అది మొదట్లో జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర్ ఉన్నపుడు బాగానే నడిచింది.. అ తర్వాత టీవీ నైన్ బిల్డింగ్ కు వచ్చినప్పటి నుంచి అది కూడా పూర్తిగా వెనుకబడిపోయింది.. పెట్టిన పెట్టుబడి కూడా రాక నెలనెలా ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది.. ఇక శ్రీకర ప్రొడక్షన్స్ పేరుతో సినిమా రంగంలోకి ప్రవేశించారు.. అది కూడా కలిసిరాలేదు.. కోట్లు పోయాయి.. విజయ దేవరకొండతో ప్రారంభించిన సినిమా కూడా వద్దనుకున్నారు.. మొత్తం మీద శ్రీకర ప్రొడక్షన్ కూడా అటకెక్కింది.. పెడదామనుకున్న భక్తి ఛానెల్ కూడా వాయిదా వేసుకున్నారు..
చివరికి ఇలాగే కొనసాగితే ఈ ఛానెల్స్ ని చివరికి మళ్ళీ రవి ప్రకాష్ చేతిలో పెట్టడమో.. లేక ఏ ఆదానిలాంటోళ్ళకి అమ్మేయడమో తప్పనిసరి పరిస్థితి అయిపోతుందేమో.. కాస్త మీ సంస్థలో ఏమి జరుగుతుందో.. ఎందుకు ఛానెల్స్ వెనుకపడుతున్నాయో కాస్త లుక్కేయండి రామేశ్వరరావు గారూ.. ఆటోస్పైల చేతిలో పూర్తిగా పెట్టి వదిలేయకుండా… కాస్త మీరే ఒక కన్నేసి సంస్థల్ని కాపాడుకోండి…
Share this Article