.
ఎంత దారుణం..? ఎంత పక్షపాతం..? ఉప్మా అంటే చేదా..? నిషిద్ధ ఆహారపదార్థమా..? బహుశా ఉప్మా మీద నెగెటివ్‌గా రాసినంత సాహిత్యం ప్రపంచంలోనే మరో ఆహారం మీద లేదేమో… మరీ సోషల్ మీడియా వచ్చాక అదొక ఉన్మాదంగా మారింది…
ఉప్మా మీద ఏవగింపు… పక్షపాతం… వివక్ష… చివరకు నాటి శ్రీనాథుడు కూడా పల్నాటి జొన్నకూడును ఆక్షేపించాడు గానీ ఉప్మా మీద పల్లెత్తు మాట అన్నాడా..? అసలు ఉప్మా అంటేనే ఓ విశిష్ట ఆహారం… ఎంత విషాన్ని కక్కుతున్నార్రా బాబూ…
Ads
అలాగని నేనేమీ ఉప్మా ప్రేమికుడిని కాను… కానీ ప్లస్ పాయింట్స్ తెలుసు… అర్జెంటుగా పెళ్లికో, ప్రభోజనానికో, ఇళ్లకు హఠాత్తుగా అతిథులు వస్తేనో… అప్పటికప్పుడు ఉప్మా తయారు చేసిపెట్టే గృహిణి ప్రపంచంలోకెల్లా బెస్ట్ గృహిణి… ఇన్‌స్టంట్ ఉప్మాలాగే… అఫ్‌కోర్స్, ఇప్పుడు ఇన్‌స్టంట్ ఉప్మా ప్యాకెట్లు కూడా దొరుకుతున్నాయి, కానీ వాటి ధరతో వీథి మొత్తానికి ఉప్మాదానం పెట్టొచ్చు… ఉప్పూ రుచీ పచీ ఎవడు చూసేడ్చాడు గనుక…
ఈ ఇడ్లీలు, వడలు, దోసెలు… శ్రమ, ప్రయాస… గతంలో ఎవరొచ్చినా ఎంచక్కా ఉప్మా… (తెలంగాణలో రవ్వ అంటారు)… నిజం చెప్పొద్దూ, ఈమధ్యే ఓసారి మా మేనత్త ఒకామె జస్ట్, అనుకోకుండా అతిథులొస్తే… ఏమాత్రం కంగారుపడకుండా… అలా రవ్వ, నాలుగు మిరపకాయలు, కాసింత ఉప్పు మాత్రమే వేసి… ప్లేట్లలో నిమ్మకాయ పచ్చడి ఆధరువుగా పెట్టి అందించింది… ఆత్మారాముడే కాదు, పరమాత్మారాముడు కూడా ఎంత ఖుషీయో… ఆ ఆకలి వేళకు అదే అమృతం…
ఐనా బ్రేక్ ఫాస్ట్‌లు రకరకాలు… ఫాస్ట్‌గా బ్రేక్ చేయగలిగేది కేవలం ఉప్మా…
చుట్టాలొస్తే నూనె వస్తువులు (మూకుట్లో గోలించేవి… ప్రధానంగా పూరీ) పెట్టాలనే ఆచారాన్ని కూడా బ్రేక్ చేసి భేష్ అనిపించింది… అప్పటికప్పుడు వేరే చట్నీ అవసరం లేదు, సాంబారు అసలే అవసరం లేదు… ఎంత పెద్ద పెళ్లయినా సరే, పొద్దున్నే భారీగా ఉప్మా వండేసి, పెట్టేస్తే… మళ్లీ మధ్యాహ్న విందుభోజనం దాకా ఇక ఎవరైనా ఇంకేమైనా అడిగితే ఒట్టు…
మరీ సుగర్ పేషెంట్ల కార్బ్ కంట్రోల్ మినహాయిస్తే… ఈజీ జీర్ణబుల్… కడుపులో ఏ గడబిడకూ నో చాన్స్… ఓ మిత్రుడు చెప్పాడు… ఒరేయ్, ఉప్మా వోకే, దానికి ఆధరవుగా ఏం తీసుకుంటున్నావనేదే ముఖ్యం… ఉదాహరణలు చెప్పాడు… తన బామ్మర్దిది ఇంటికి అకాలంలో వెళ్తే…
ఆమె రవ్వ ఉప్మాతోపాటు ఉల్లికారం (ఉల్లిపాయమిరం) ప్లస్ లేత చింతకాయ (ఒనగాయ) తొక్కు సర్వ్ చేసిందట… ప్లస్ మవుడు (కారప్పూస)… జస్ట్, పావుగంటలో… ఆహా… ఏం కాంబో అసలు..? వాడు అడిగి మరీ ‘మారు’ వేయించుకుని (అంటే, మళ్లీ మళ్లీ) ఉల్లికారం దంచేస్తే… తెల్లారేసరికి జలుబు దగ్గు పరార్ అన్నాడు…
ఎస్, ఉప్మాను దేంతో తింటున్నామనేదే ముఖ్యం… కొందరు మొత్తం దానిపై సాంబారు పోసుకుని కుమ్మేస్తారు… కొందరు పలుచటి నీళ్ల చట్నీని గుమ్మరిస్తారు… కొందరు కేవలం ఆవకాయతో… ఉప్మాకు బెస్ట్ కాంబో ఏమిటంటే… చింతకాయ పులుసు… అఫ్‌కోర్స్, పులిహోర కోసం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా..!
అంతేకాదు… ఉప్మా దేనితోనైనా కలిసిపోగలదు… దోసెలు, రకరకాల రైసుల్లాగే… అందులోకి ఏది వేస్తే ఆ ఉప్మా, ఉదాహరణ… జీడిపప్పు వేస్తే జీడిపప్పు ఉప్మా, కొత్తిమీర వేస్తే కొత్తిమీర ఉప్మా… దేన్నీ కాదనదు, చివరకు రకరకాల కూరగాయ ముక్కలు వేస్తే కిచిడీ ఉప్మా… వేరే టిఫినీలకు ఈ సౌలభ్యం కలదా మరి..?
ఈమధ్య బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ వంటి సంప్రదాయ రవ్వలు కాదు… కొత్తకొత్తగా ఉప్మాను అప్‌డేట్ చేస్తున్నారు చాలామంది…
సేమియా ఉప్మా, చౌ చౌ బాత్, రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, ఖారా బాత్, టమాట రవ్వ ఉప్మా, అటుకుల ఉప్మా, రవ్వ కిచిడీ, నిమ్మ ఉప్మా, పెప్పర్ ఉప్మా, సాబుదానా ఉప్మా, మరమరాల ఉప్మా, మూంగ్ దాల్ ఉప్మా, మిగిలిపోయిన ఇడ్లీతో ఉప్మా, చింతపండు ఉప్మా, బ్రెడ్ ఉప్మా, మసాలా పాస్తా ….. ఇప్పుడు రకరకాల మిలెట్స్ ఉప్మాలు…
అందుకే చెప్పేది… సకల సౌత్ అల్పాహార, ఉపాహారాల యందు ఉప్మాయే మేలు కదరా సుమతీ అని..!!
Share this Article