.
నాకు నమస్తే తెలంగాణ స్టోరీ చదవగానే ఏదో తేడా కొడుతోంది అనిపించింది… వాళ్లు నిజాలు తప్ప మరొకటి రాయరు కదా… ఇదీ నిజమే అని ఫిక్స్… నీళ్లను కూడా నిప్పులతో పుటం పెట్టే పాత్రికేయం కదా…
సరే, ఆ వార్త ఏమిటయ్యా అంటే… డెమొక్రాట్స్ పార్టీ, మొన్నమొన్నటిదాకా అమెరికా సెకండ్ లేడీ, మన చెన్నై సాంబర్ ఇడ్లీ రూట్స్ కమలా హారిస్ ఉంది కదా… ఆమె ఒక తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఎఐసీసీకి ఓ సిఫార్సు లేఖ రాసిందట…
Ads
వోకే, రాసిందనే గాసిప్స్ చర్చనీయాంశం అయ్యాయట… వాళ్లు పేరు చెప్పలేదు గానీ, జగ్గారెడ్డి కోసమే అయి ఉంటుంది… ఎక్కడ కమలక్కకు జగ్గారెడ్డి మీద ప్రేమ కుదిరిందో తెలియదు గానీ… ఓడిపోయిన డెమోక్రాట్సే జోక్యం చేసుకుంటూ ఉంటే అధికారంలోకి వచ్చిన రిపబ్లికన్స్ ఊరుకుంటారా..? ఐనా రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే అంటున్నారు కదా, బహుశా జగ్గన్న కాకపోవచ్చు కూడా…
అదే ఆలోచిస్తుంటే ఓ వార్త కనిపించింది… జగ్గారెడ్డి భార్య నిర్మల, టీజీఐఐసీ కాన్వాయ్ సీఎం కాన్వాయ్‌ను మించి ఉందంటూ ఎవరో ఓ ఫోటో కూడా పబ్లిష్ చేశారు… అవును మరి, వాళ్లకేం తక్కువ..? జగ్గన్నకు మంత్రి పదవి ఇవ్వకతప్పదని ఫిక్సయిపోయారో, సీఎంకన్నా మనకేం తక్కువ అని ఫీలయ్యారో గానీ ఆ ఫోటో చూడండి…
పైగా సినిమా హీరో అవుతున్నాడు… మినిమం బన్నీ రేంజ్ అయినా మెయింటెయిన్ చేయాలి కదా… లేకపోతే ఫ్యాన్స్ హర్టవుతారు… హఠాత్తుగా మరో వార్త… బహుశా అదీ లింకే అయి ఉంటుంది… అదేమిటంటే..?
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, తన సతీమణి ఉషతో కలిసి ఇండియా వస్తున్నాడట… ఈరోజే రాక… ఆగ్రా, ఢిల్లీ, జైపూర్ సందర్శనతోపాటు మోడీతో భేటీ ఉంటుందట… తెలుగింటి అల్లుడు కదా, ఆంధ్రాకు వచ్చి చంద్రబాబును కలవాలి కదా, ఆయన ఆశీస్సులు తీసుకోవాలి కదా… మర్యాద లేదు వాన్స్‌కు…
ఐతే కమలా హారిస్ లేఖ గురించి తెలిశాకే అర్జెంటుగా వాన్స్ ఇండియా పర్యటన పెట్టుకున్నట్టున్నాడు… అసలే టారిఫ్ వార్, కీలక నిర్ణయాలతో అమెరికా ప్రభుత్వం అత్యంత బిజీగా ఉన్న ఈ తరుణంలో వాన్స్ రావడం వెనుక కమలా హారిస్‌కు కౌంటర్ పెట్టే పనిలో వస్తున్నట్టున్నాడు…
అసలే ప్రపంచ రాజకీయాలను ఓ మలుపు తిప్పగల తెలంగాణ మంత్రి పదవి… అంత సీన్ లేకపోతే పాపం కమలా హారిస్ లేఖ రాయదు కదా… సో, బయటికి చెప్పడం లేదు గానీ వాన్స్ అదే పని మీద వస్తున్నట్టున్నాడు… ఈ లేఖలతో పనికాదు గానీ తనే స్వయంగా వచ్చేస్తున్నాడేమో…
పేరుకు ఉష పుట్టిల్లు, వాన్స్ అత్తిల్లు అంటున్నారు, కేవలం మోడీతో భేటీ అంటున్నారు గానీ… రాహుల్‌ను గానీ, డీకే శివకుమార్‌ను గానీ కలిసి… మరో ఎమ్మెల్యే పేరు చెప్పి, ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే, లేకపోతే మరిన్ని రివెంజ్ టారిఫ్‌లు తప్పవు అని మెడ మీద కత్తులు పెట్టడానికే వస్తున్నాడేమో…
చూడాలిక… ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా మారిన తెలంగాణ మంత్రి పదవి విషయంలో కమలక్క గెలుస్తుందా..? ఉషక్క గెలుస్తుందా..? ఈ రాజకీయ పోరాటం అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయిపోయిందట… ఆంధ్రజ్యోతి ఏవేవో పొలిటికల్ స్కూప్స్ రాస్తుంటాడు గానీ, ఈ కీలక పరిణామాలు ఎందుకు, ఎలా మిస్సయ్యాడబ్బా..!!
Share this Article