వేక్సిన్ వేసుకున్నా సరే, మా పక్కింటామెకు కరోనా వచ్చింది… వేక్సిన్ వేసుకుంటేనే మా చుట్టాలమ్మాయికి కరోనా వచ్చింది… కరోనా రాదనే గ్యారంటీ లేనప్పుడు వేక్సిన్ దేనికి మరి..?… ఇలా ఇప్పటికీ చాలామందిలో అపోహలు… చివరకు ప్రజలకు నిజాలు చెప్పాల్సిన వైద్య ఆరోగ్య సిబ్బందిలోనే బోలెడుమంది వేక్సిన్‌కు దూరంగా ఉన్నారు… అదుగో అక్కడ అలా, ఇదుగో ఇక్కడ ఇలా అంటూ ఇంకొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఈ అపోహల్ని మరింత ప్రచారం చేస్తున్నారు… కొందరైతే మందు మానేయాలట కదా, పొగ తాగొద్దట కదా అనే కారణాలతో కూడా వేక్సిన్‌కు దూరంగా ఉన్నారు… నిజానికి ఈ ప్రచారవ్యాప్తిని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది… దుర్మార్గమైన మీడియా ఎలాగూ చేయదు… వీలయినంతగా భయాన్ని పెంచి, అందులో పెట్రోల్ పోసి చలికాచుకునే రకం మీడియా… ఒక్కసారి ఆ చార్ట్ చూడండి…
వేక్సిన్ వేసుకున్నాక కూడా కరోనా వచ్చిన వారు ఎంత అత్యల్ప శాతమో అర్థమైంది కదా…. నిజానికి వేక్సిన్ వేసుకుంటే కరోనా రావొద్దని ఏమీ లేదు… వేక్సిన్ కరోనాను రానివ్వకుండా అడ్డుకోలేదు… కాకపోతే వచ్చాక ఆ కరోనాను తట్టుకునే శక్తిని ఇస్తుంది… మరీ ప్రాణాల మీదకు రాకుండా కాపాడుతుంది… కరోనాపై పోరాడే శక్తిని మన దేహంలోనే ఇంప్రూవ్ చేస్తుంది… బెడ్లు దొరక్క, మందులు దొరక్క, ఆక్సిజెన్ దొరక్క, ప్రాణాల మీదకు తెచ్చుకోవడం బెటరా..? వేక్సిన్ వేసుకుని, ప్రాణాలకైతే ఢోకా లేదు అనే ధీమాతో బతకడం బెటరా ఆలోచించుకోవాలి… ప్రత్యేకించి చదువుకున్నవాళ్లు మిగతావాళ్లకు చెప్పాల్సిన అవసరం ఉంది… పనికిమాలిన అడ్డమైన ప్రభుత్వ పథకాల డప్పు కోసం కోట్లకుకోట్లు తగలేసే మీడియా ప్రకటనలకన్నా ఇవి నయం… వేక్సిన్ శాస్త్రీయం… వేక్సిన్ నిరూపితం… వేక్సిన్ ఓ ముందుజాగ్రత్త… వాక్సిన్ వంద శాతం efficient కాదు… అయితేనేం ఉన్న దిక్కు అది ఒక్కటే కదా…
Ads
నిజమే… వేక్సిన్ ధరలు ఒక దందా… ధరల ఖరాారులో రాజకీయాలున్నయ్, వ్యాపారం ఉంది… నమ్మకద్రోహాలు, దోపిడీ ఉంటున్నయ్… కానీ వేక్సిన్ నమ్మదగిందే… అది ఏ బ్రాండ్ అయినా సరే… ఆ క్లారిటీ జనానికి కావాలిప్పుడు… ఉచిత వేక్సిన్ అయినా సరే, హాస్పిటల్ పెయిడ్ వేక్సిన్ అయినా సరే… ఏదో ఒకటి వేయిచుకోవడం అవసరం… సెకండ్ వేవ్ అనే సునామీ నుంచి ఓ రక్షణ అది… ఇప్పటికే బయట పరిస్థితులు చూస్తున్నాం కదా, ఇక థర్డ్ వేవ్ అంటూ మొదలైతే గత్తరే… వేక్సిన్ వేసుకున్నాక కూడా జాగ్రత్తగా ఉండాలట కదా, మాస్కు పెట్టాలట కదా, సోషల్ డిస్టెన్స్ పాటించాలట కదా అని కొందరు దీర్ఘాలు తీస్తున్నారు… ఐసీయూల్లో, వెంటిలేటర్ల మీద రోజుల తరబడీ పడుకుని… లక్షలకులక్షలు పోసి, చివరకు ప్రాణాలకే ఢోకా లేని పరిస్థితి బెటరా..? మాస్క్ బెటరా ఎవరికి వారు ఆలోచించుకోవాలి… ఏమో, చెప్పలేం… ఈ రెండు డోసులే కాదు, బహుశా దసరా తరువాత బూస్టర్ డోసులూ తప్పవేమో… ఫార్మా మాఫియాకు తలొంచాల్సిందే… ఎందుకంటే ప్రాణాలు మనవి కాబట్టి…!! ఇదేకాదు, వ్యాధి ఏదైనా సరే, చికిత్సకన్నా నివారణే మేలు కాబట్టి…!! చివరగా :: కోవాగ్జిన్‌తో పోయేదానికి రెమ్‌డెసివర్ అవసరమా..?!
Share this Article