కాశీ క్షేత్ర యాత్ర…. జీవితమే ఒక యాత్ర ! ఉత్కృష్టమైన మానవజన్మలో జీవితం ఇహ పరములకు వారధిగా మార్చుకునే ఒక గొప్ప అవకాశం జీవికి !
ఆ యాత్ర సంకల్పమనే మంత్రంతో, జ్ఞాన శోధన -అభ్యాసం – గురు అనుగ్రహమనే తంత్రంతో , తన అస్తిత్వం, జీవన పరమార్థం తెలుసుకునే “ఆధ్యాత్మిక “ పూజా పుష్పమై , వెళ్లి వాలిపోయే యంత్రమే “తన క్షేత్రం “!!!
పరమశివుడు స్థితి కారకుడైన , శ్రీదేవి భూదేవి పతి అయిన విష్ణుమూర్తిని , భూలోకంలో ప్రథమ నగరం కావాలని అడిగితె ఏర్పడిన క్షేత్రమే “వారణ” “ఆసి “ అనే నదుల మధ్య , త్రివేణి సంగమం నుండి వచ్చిన గంగానదీ తీరం పైన “వారణాసి “ అయ్యింది !
Ads
విష్ణువిచ్చిన స్థలంలో కొంత తిరిగి ఆయనకే ఇవ్వగా అది విష్ణు కాశి శివ కాశి గా ఏర్పడిన అద్వైత తీర్థ క్షేత్రం ! ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక రూపమైన కాశీ విశ్వేశ్వరుడు , అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిసిన అమ్మ “సతి “ ముఖ భాగం “విశాలాక్షి “ ఇద్దరూ స్థిరపడ్డ నగరి ఇది !
ఒక పాప పుట్టిన క్షణం తల్లి స్పర్శ, ఆ వాసన, పొత్తిళ్లపైనా, అమ్మ పాలతో పెంచుకున్న మోహం, కనపడే ఎన్నో వస్తువులు, ఇల్లు, భర్త /ఇల్లాలు, పిల్లలు, డబ్బు, పేరు , తిండి, బంధుమిత్రులు ఇలా వేలసంఖ్యలో మోహబంధాల్లో చిక్కుకుని , ఈ భూమి మీదే ఉండాలి , ఇవన్నీ నావే, నాకోసమే అనే పిచ్చిలో పడుతుంది.
మనిషిగా పెంచుకున్న మోహం పోకుండా ఉండేందుకు , ఈ ఇత్తడి బిందె (శరీరం ) కు ఎన్ని అతుకులు, ఎన్ని బొంతలు కొట్టించుకుంటుంది? గుండెకు స్టెంట్లు , కళ్ళకు జోళ్ళు , తొంటికి రాడ్ , కృత్రిమ దంతాలు ,ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ , తలకు విగ్గు, ఎన్నో …
కోప, తాపాలు, నిరాశ, ఉద్రేకాలు వంటి మంటల్లో ఎప్పుడు ఈ “ఇత్తడి చిత్తడి “ డొల్ల “బిందె “ లాంటి శరీరం , మంటల వేడికి కాలుతూనే ఉంటుంది !
ప్రేమ, ఆనందం , దానం, స్నేహం, ఆస్తులు అందరికి పంచుతూ ఆ చన్నీళ్ళ చల్లదనమూ పొందుతుంది
కానీ ఆ వేడి , ఈ చల్లదనం రెండూ తాత్కాలికమైన తాపాలే , మోహాలే అని మరుస్తుంది!
రాయైనా, చెట్టైనా, పక్షి , చేప , జంతు , బాక్టీరియా , నుండి మనిషి వరకు అందరం ఎదో ఒక మోహంలో ఇరుక్కునే వాళ్ళమే !
సనాతన ధర్మం 84 లక్షల ఎన్నో జన్మల తర్వాత , విచక్షణా, వివేకం , బుద్ధి , మనో వికాసం గల మానవ జన్మ జీవి పొందుతాడంటుంది !
ఇక్కడే కాశి (ప్రకాశించేది , ప్రకాశం ఇచ్చేది ) జీవిత పరమార్థపు ఉన్నత మార్గాలు చూపుతుంది !
వారణ , ఆసి అనే ఉత్తర దక్షిణ ఉపనదుల మధ్య , 84 ఘాట్లతో అత్యంత ప్రాచీన , ప్రథమ నగరిగా వెలిసింది కాశి !
దక్షిణ (South)దిశ జీవి ప్రారబ్ధ శేషం (అప్పులు తీర్చుటకు అక్కడ ఇక్కడ ఉద్యోగం చేసి , బిజినెస్ చేసి తీర్చే లాంటి ఒక ఋణం జీవికి ఇచ్చే ఇంకో జన్మ దక్షిణం !) – అది ఆసి నది !
ఉత్తర (north) దిశగా వెళ్తే వచ్చేది ఈశాన్యం (నార్త్ ఈస్ట్ ).
ఈశాన్యం అంటే ఈశ్వరుడుండే చోటు !
జన్మకు – జన్మలే లేని జన్మ రాహిత్యానికి మధ్యలోనే కదా ప్రతి జీవి ప్రారబ్ధ కర్మల పోరాటం !
కాశీ నగరం జీవి తాపత్రయ నివారిణి !
శివుడు పాతిన త్రిశూలంతో భూమి చీల్చి ఉబికిన నీరే “జ్ఞానవాపి “ (జ్ఞ్యానపు బావి )
అక్కడ ఏర్పడ్డ నగరం, కాశీ , వచ్చిన గంగ , వెలసిన విశ్వనాథుడు ముగ్గురు త్రిమూర్తితత్వం చూపి , మోక్షం వైపు నడిపిస్తారు !
ఈ మోక్ష ప్రయాణం 84 ఘాట్లలో నదీస్నానం గా మారి ,
చివరకు , కట్టె కాలెందుకు కూడా ఇదే పరమార్థం అవుతుంది !!!
84 Ghats:
12×7=84
(12 signs, 7 chakras)
ప్రతి జీవికి సప్తచక్రాలు (మూలాధారం నుండి సహస్రారం వరకు ) ఉంటాయి. కొన్నిటి ఉద్దీపన కొన్ని జన్మల్లో ఉండదు , అందుకే కేవలం రెండు చక్రాల ఉద్దీపనతో చెట్టై , 3-4 చక్రాల ఉద్దీపనతో జంతువై , ఇలా ఎన్నో జన్మల తర్వాత ,
అన్ని చక్రాల ఉద్దీపన (activation) చేసుకునే అర్హత ఉన్న మానవ జన్మ వస్తుంది.
ప్రపంచంలో ఏ జీవి ఏ రూపంలో ఎప్పుడు పుట్టినా 12 రాశుల్లో ఎదో ఒక రాశిలో , ఏడు చక్రాల్లో పుడుతుంది. ఏ జీవికైనా మోక్షం వచ్చే ఏకైక స్థలం కాశీ క్షేత్రం !!!
అందుకే ఇది 84 ఘాట్లతో ఏర్పడింది ( తర్వాత తర్వాత కొన్ని ఘాట్లు వివిధ రాజుల కాలంలో కొత్తగా ఏర్పరచారు )
84 Lakhs lives:
84 ghats =84×1,00,000
లక్ష జన్మలకొకటి చొప్పున 84 లక్షల జన్మల ప్రారబ్ధ కర్మలను నిర్మూలించి ముక్తినిచ్చే క్షేత్రం కాశీ !
కాశి నగరమంతా వేలమంది జనంతో , ఇరుకు సందులతో , వేల సంఖ్యల్లో ఉన్న ఎవరికీ హాని చెయ్యని కుక్కలతో (కాలభైరవుడి వాహనం కదా ) నిండి ఉంటుంది.
కాశీపట్టణమంతా నడుస్తుంటే , అన్ని శబ్దాల మధ్యలో ఒక ప్రశాంతమైన నిశ్శబ్దం !
అందరి మధ్యలో ఉన్నా , ఒంటరిగా ఉన్న అనుభూతి, వెంటనే నేను ఒంటరియా కాదు వెంట పరమాత్మ ఉన్నాడు కదా అని పెనవేసుకునే అంతులేని ధైర్యం !
కాశీలో కాలాతీతుడు శివాంశగా ఉన్న కాలభైరవుడున్నాడు , అందుకేనేమో , కాలం , పగలు, రాత్రి , గడియారం గుర్తుకురావు !
ఈ నగరాన్ని ఆకాశంలోనుండి చూస్తే రెండు సున్నాలు కలిపినట్టు ఉంటుంది . (శివ కేశవుల వైదిక క్షేత్రం కదా )
ఉత్తరగంగ హిమాలయాల నుండి వడివడిగా దక్షిణదిశగా వెళ్తూ ఉన్నట్టుండి వెనుకకురికి ఉత్తరముఖియై , కాశీనగరాన్ని యంత్రాన్ని అలంకరించిన పూదండలా పెనవేసుకుని తిరిగి ఏమీ ఎరగనట్టు గడుసుగా దక్షిణం వైపు వెళ్తుంది !!!
ఎన్నో దేశాలకు చెందిన పౌరులెప్పుడు కాశీలో తిరుగుతూ కనపడతారు !
గంగా హారతి , శయన హారతి ,
మాఘమాసంలో భస్మ హొలీ ,
అందరికి అన్నివేళలా కడుపు నింపుతూ ఎవ్వరినీ ఆకలితో ఉంచని అన్నపూర్ణ సత్రం ,
అడుగడుగునా శివ లింగాలు ( కాశి నగరంలో మొత్తం 6 కోట్ల శివలింగాలున్నాయని కలియుగంలో రెండు కోట్లే కనపడుతున్నాయని అక్కడి నివాసులంటారు !
కాశీ విశ్వనాథుడు ,
జ్ఞానవాపి ,
విశాలాక్షి, అన్నపూర్ణ ,
బింధుమాధవుడు ,
డుండి గణపతి , సాక్షి గణపతి ,
దండపాణి (సుబ్రమణ్య స్వామి ),
కాలభైరవ,
ఆత్మ వీరేశ్వర ,
మహా మృత్యుంజయ ,
ధన్వంతరి కూపం
రక్తేశ్వర
సంకట మోచన హనుమాన్ ,
దుర్గ
పంచగంగేశ్వర
వారాహి దేవి
అముక్తేశ్వర
నవగ్రహేశ్వర
తారకేశ్వర
తులసీదాసుకు రామలక్ష్మణ సాక్షాత్కారం జరిగిన రామచరిత మానస్ మందిర్
ఇవన్నీ మేము దర్శించుకున్న స్థలాలు !!!
ఇంకా దర్శించలేకపోయినవి ఎన్నెన్నో …
క్షేత్ర దర్శనం చేసుకుంటేనే బ్రహ్మ మన తలరాత తిరిగి రాసే నగరం నాసికా త్రయంబకేశ్వరం !
అలాంటి తలరాతలు రాసే బ్రహ్మ కపాలం విమోచనకోసం “భిక్షామ్ దేహీ !” అని అన్నపూర్ణాదేవినడిగిన నగరం కాశీ !
కాశీ క్షేత్ర, తీర్థ, దేవతా దర్శనాల వల్ల ఎన్నో జన్మల కర్మక్షయమ్ జరిగి , అంతులేని ఆత్మసంతృప్తితో , మోక్షం పొందుతామని పురాణాలు ఘోషిస్తున్నాయి !
ఒక్కసారి వెళ్తే అది మనకే పూర్తి నిజమని తెలుస్తుంది !!!
ఇంకెందుకు ఆలస్యం ? (మళ్ళీ ) వెళదామా కాశీ ???
ఆది దంపతులు అన్నపూర్ణ , విశ్వనాథులు , కాలాతీతులైన కాళీ కాలభైరవులు , బింధుమాధవుడు,నిలయమైన ఈ
వైదిక అద్వైత క్షేత్రం నేలపైన అడుగుపెట్టే యోగ్యతా , అదృష్టం రావాలంటే రోజూ ఈ రెండు శ్లోకాలు ఒకసారైనా పారాయణం చెయ్యాలి అంటారు!
సానందమానందవనే వసంతం….
ఆనందకందం హతపాప బృందం
వారాణసీనాథమనాథనాథమ్
శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే
విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం, వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం,
PS: ప్రధాని నరేంద్ర మోడీ చేసిన renovation వల్ల దేవాలయ ప్రాంగణం అద్భుతంగా తీర్చి దిద్దటమే కాకుండా , పట్టణమంతా శుచి శుభ్రతతో , టెంపుల్ కు ఒక కిలోమీటర్ వరకు వాహనాల కాలుష్యం లేకుండా అందంగా తీర్చి దిద్దబడింది . గుడిని అనుకుని గేట్ నెంబర్ 3, 4 మధ్యలో 300 మీటర్ల దూరంలోనే కారిడార్ (ధర్మశాల లాంటి వసతి గృహం ) పెద్దవాళ్లకు , నడవలేని వాళ్లకు వీల్ చైర్ సపోర్ట్ తో , సౌకర్యాలెన్నో మెరుగుపడ్డాయి ! https://www.southerngrandkashi.com ఓం నమః శివాయ !!! [[ By… madhav kashojjula … ]]
Share this Article