ఎవరో అడిగారు… జర్నలిస్టులు కూడా వార్తల్లోని వ్యక్తులేనా అని..! దీనికి సమాధానం… అవును..! మీడియా సంస్థలు, వాటిల్లో పెట్టుబడులు, వాటి పొలిటికల్ ధోరణులు గట్రా ఎలాగైతే వార్తాంశాలు అవుతున్నాయో… తమ రాతల ద్వారా, తమ డిబేట్ల ద్వారా జర్నలిస్టులు కూడా వార్తల్లోని వ్యక్తులు అవుతున్నారు…! ఆ ఆర్నబ్ గోస్వామి దగ్గర నుంచి మన రవిప్రకాష్ దాకా… అంతెందుకు..? మన తెలుగు చానెళ్ల సంగతుల్ని కూడా ‘ముచ్చట’లో బోలెడు చెప్పుకున్నాం… తెలుగు న్యూస్ చానెళ్ల డిబేట్లు అనగానే కొమ్మినేని, అమర్, రవిప్రకాష్ తదితరులు ప్రధానంగా గుర్తుకొచ్చేవాళ్లు… తరువాత వెంకటకృష్ణ, టీవీ5 మూర్తి, సాంబశివరావు, రజినీకాంత్ తదితరులు తరచూ వార్తల్లోకి వస్తున్నారు… కారణాలు అనేకం ఉండొచ్చుగాక… మనం ఆ చర్చలోకి వెళ్లడం లేదు… ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వార్తల్లోకి వచ్చిన జర్నలిస్టు పర్వతనేని వెంకటకృష్ణ… తను ఏబీఎన్ చానెల్లో వర్క్ చేస్తున్నాడు ప్రస్తుతం… అది రాజకీయంగా తెలుగుదేశం అనుకూల చానెల్… సహజంగానే వెంకటకృష్ణ డిబేట్లలో కూడా ఆ ధోరణి కనిపిస్తుంది… యథా ఆర్కే తథా వీకే… దాంతో తెలుగుదేశాన్ని రాజకీయంగా వ్యతిరేకించే సెక్షన్స్ ద్వారా సోషల్ ట్రోలింగుకు తను గురవుతుంటాడు… ఈమధ్య ఏపీబీజేపీ కార్యదర్శి విష్ణుపై వెంకటకృష్ణ టీవీ లైవ్ డిబేట్లో ఒక అమరావతి ఉద్యమరైతు చెప్పును విసరడం కూడా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే కదా…
ఆయన ఏబీఎన్ చానెల్ నుంచి వెళ్లిపోయాడు అని ఓ వార్త నిన్నటి నుంచీ ప్రముఖంగా తెలుగు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది… అంతేకాదు… ‘‘ఎవరినో 50 లక్షలు బ్లాక్ మెయిల్ చేశాడు, దాంతో ఏబీఎన్ చానెలే తనను వెళ్లగొట్టింది… తను మొదటి నుంచీ ఏ టీవీ చానెల్లోనూ నిలకడగా ఉండడు… ఇప్పుడు ఇక మరో తెలుగుదేశం అనుకూల చానెల్ మహాన్యూస్లో చేరుతున్నాడు… ఆర్కే, వీకే ఆఫీసులో కొట్టుకోబోయారుట… స్టాఫ్ కష్టమ్మీద విడిపించాల్సి వచ్చిందట…’’ వంటి ప్రచారాలు జోరుగా సాగాయి… ఇవన్నీ బాగా వైరల్ అయ్యాయి కూడా… ఏపీ, తెలంగాణ పొలిటికల్, జర్నలిస్ట్ సర్కిళ్లలో ఇది చర్చనీయాంశమైన వార్త… పైగా ఈమధ్యకాలంలో ఒక జర్నలిస్టుపై ఈ రేంజ్ ట్రోలింగ్ చూడలేదు.., నిజంగా తను ఏబీఎన్ చానెల్ నుంచి వెళ్లిపోయాడా..? లేదా వెళ్లగొట్టబడ్డాడా..? నిజానికి ఏబీఎన్ తనకు పలు కోణాల్లో బాగా సెట్టయ్యే చానెల్… మరి దాన్ని ఎందుకు వీడాల్సి వచ్చింది… తను మహాన్యూస్లో చేరినమాట నిజమేనా..? వీకే అక్కడ చేరితే, వంశీ-వీకే ఒక ఒరలో ఇమడటం సాధ్యమేనా..? అసలు వాళ్లో వీళ్లో ఎందుకు..? తననే నేరుగా అడుగుదాం… తను ఏమంటాడంటే..?
Ads
‘‘మీడియాకు సంబంధించి కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తున్నయ్… ఒక ప్రాజెక్టుకు సంబంధించి రెండు నెలలుగా నన్ను అడుగుతున్నారు… నాకు ఇక్కడ బాగానే ఉంది కదా, ఏ నిర్ణయమూ తీసుకోలేక దాటేస్తూ వచ్చాను… ఈమధ్య వోకే చెప్పాను… ఇదే విషయాన్ని మొన్న మా బాస్ రాధాకృష్ణకూ చెప్పాను… తొందరపడకు, వెళ్లాలనుకుంటే నీ ఇష్టం, ఆలోచించి అడుగు వేయి అన్నాడు తను… అందుకని ప్రస్తుతానికి ఓ వారం రోజులు సెలవు పెట్టాను… ఇక కొత్త ప్రాజెక్టు ఏమిటంటే..? ఐటీ, ఫిల్మ్ ప్రొడక్షన్లో ఉన్న ఒక ఎన్ఆర్ఐ కంపెనీ… ముందు తెలుగు, కన్నడంలో మొదలుపెట్టి పలు భాషల్లో మీడియా చానెళ్లు స్టార్ట్ చేయాలని వాళ్ల ఆలోచన… వచ్చే అక్టోబరులో అవి స్టార్ట్ అయ్యేలోపు బ్రాండ్ ప్రమోషన్ కోసం తెలుగులో మహాటీవీలో రెండు గంటలు, 99టీవీలో రెండు గంటలు స్లాట్ తీసుకుని, తమ ప్రసారాలు బ్రాడ్ క్యాస్ట్ చేస్తారు… నా డిబేట్లు కూడా ఉంటాయి… ఇప్పుడు ఈటీవీలో బీబీసీ చేస్తున్నట్టుగా..! మహాన్యూస్ మొత్తం టేకోవర్ చేసుకుని, కొత్త పేరుతో రన్ చేసే ఆలోచన కూడా ఉంది… అదేసమయంలో డిజిటల్ మీడియాను కూడా డెవలప్ చేసుకోవడం ఈ కంపెనీ ప్లాన్… ఇదీ అసలు సంగతి… ఇక నాపై జరిగే ప్రచారాలా..? నాకు కొత్తేమీ కాదు…’’ (వెంకటకృష్ణ గతంలో ఈటీవీ, టీవీ5, 6టీవీ, హెచ్ఎంటీవీ, ఏపీ24/7 చానెళ్లలో పనిచేశాడు)
Share this Article