‘‘మీ అమ్మమీదొట్టు.. అయ్యమీదొట్టు.. అక్కమీదొట్టు.. చెల్లెమీదొట్టు….’’ పాట ఎలా ఉంది..? ఎవడ్రా రాసింది, ఎవడ్రా కూసింది అనాలనిపిస్తోందా..? పొరపాటున ఎదుట కనిపిస్తే కుమ్మేయాలని ఉందా..? అదే మీ అజ్ఞానం… ‘అమ్మో నీయమ్మ గొప్పదే, అందం పోగేసి కన్నదే’ అని చిరంజీవి అదేదో గ్రాఫిక్ సినిమాలో పాడితే ఆనందించారు కదా… మరి ఇదెందుకు నచ్చదు..? పోనీ… గుండిగెలాంటి గుండేదానా అని విక్రమ్ గొంతు చించుకుంటే ఎగిరి గంతేశారు కదా..! సినిమా పాటలకు అర్థాలేమిటి..? పరమార్థాలేమిటి… ఎవడో ట్యూన్ ఇస్తాడు, అందులో ఇంకెవడో పదాలు నింపుతాడు, హీరో హీరోయిన్లు ఎగుర్తారు… అంతే… విక్రమూర్కుడు, సారీ, విక్రమార్కుడు అనబడే విజయ్ సేతుపతి తాజా సినిమా చూశాక, ఈ పాట విన్నాక మొత్తం డిస్టర్బ్ అయిపోతాం… ఈ గా-ద కొడుకులకు (సారీ, పరుషపదమే) తెలుగును ఖూనీ చేయడం తప్ప ఇంకేమీ తెలియదు… మణిరత్నం దగ్గర్నుంచి పెద్ద పెద్ద తమిళ దర్శకుల వరకూ ఇదే తంతు…
అసలు ఈ మైండ్ బర్నింగ్ పాటల్ని వదిలేయండి… అది ఎలాగూ పరమ నాసిరకం కంటెంటుకు ప్రసిద్ధి గాంచిన ఆహా అనబడే ఓ దిక్కుమాలిన ఓటీటీలో విడుదలైంది… చూస్తున్నప్పుడు చరచరా పాటల్ని దాటేసేందుకు మౌసులున్నయ్… తిట్టుకోవడానికి బూతులున్నయ్… కనీసం ఆ సినిమా ఐనా చూడబుల్‌గా ఉందా..? అది మరీ ఘోరం… ఒక హీరో రోజుకో మెట్టు ఎక్కేవాడు, రోజురోజుకూ జాగ్రత్తగా ఉండాలి… మరో మెట్టు ఎక్కేలా సినిమాల్ని అంగీకరించాలి, పాత్రల్ని ఎంచుకోవాలి… మరి మనం మంచి నటుడిగా భావిస్తున్న ఈ విజయ్ సేతుపతికి ఏం పుట్టింది..? ఈ పాత్ర ఎలా అంగీకరించాడు..? మూడేళ్ల క్రితం జుంగా అని తమిళంలో విడుదలైంది ఈ సినిమా… రోజులు బాగుంటే థియేటర్లలో కూడా తెలుగు అనువాదాన్ని విడుదల చేసి చంపేసేవాళ్లు… చాన్స్ లేదు కదా, ఏదైనా సరే కొనుక్కునే ఆహా ఓటీటీ ఉంది కదాని అమ్మిపారేశారు… తెలుగు ప్రేక్షకులపై కనిపించని కసి ఏదో చూపించేశారు…
Ads
ఇంతకుముందు కూడా తెలుగులో విక్రమార్కుడు అనే సినిమా వచ్చింది… అప్పుడెప్పుడో… ది గ్రేట్ రాజమౌళి అనేక సినిమాల నుంచి కాపీ కొట్టిన సీన్లను కలిపి కుట్టేసి మన మీద వదిలేశాడు… కనీసం అందులో కామెడీ నవ్వించింది… ఈ సేతుపతి విక్రమార్కుడి కామెడీ నవ్వాలో ఏడవాలో తెలియని స్థితి… ఉదాహరణ కావాలా..? ఆ పాత్ర ఓ పనికిమాలిన డాన్ పాత్ర… డానిజం అనేది కూడా ఓ దందా కదా… తండ్రి, తాత అందులో దివాలా తీస్తారు, వీడేమో బస్ కండక్టర్‌గా బతుకుతుంటాడు… అనుకోకుండా తమ కుటుంబ ఘనత తెలుస్తుంది, నేనేం తక్కువ, నేనూ డాన్‌నే, కనీసం మేం కోల్పోయిన ఆ థియేటరైనా సంపాదించి, హాయిగా బతుకుదాం అనుకుంటాడు… మరి పేద డాన్ కదా… పిసినారితనం ఎక్కువ… అవి బాగా కామెడీని పండిస్తాయి అనుకున్నాడు దర్శకుడు… కానీ ఈ పాత్ర అటు సీరియస్ పాత్ర గాకుండా ఇటు కామెడీ పాత్ర గాకుండా పోయింది… జబర్దస్త్ టీవీషోను తిట్టుకుంటూనే భరిస్తుంటాం కదా, అలా భరించాలి ఈ పాత్ర కామెడీని… ఉదాహరణ కావాలా..?
మర్డర్ చేయడానికి సుమోలో వెళ్తుంటాడు హీరో.. దారిలో పాజింజర్లని ఎక్కించుకుంటాడు, వాళ్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు… డాన్‌ల సంఘం మీటింగ్ కి వెళ్తాడు, అక్కడ మిక్చర్ పొట్లాలని ఎత్తుకొస్తాడు… ఫ్టైట్ లో పులిహోర పొట్లాల్ని అమ్మి, అక్కడిచ్చే బన్నుల్ని పెట్టెలో దాచుకుని వచ్చేసే కేరెక్టర్… ఇలాంటివి బోలెడు… ఇవన్నీ ఇటు సెటైర్లు కావు, అటు సీరియసూ కావు… ఇలాంటి దిక్కుమాలిన కామెడీ మా అల్లరి నరేష్ ఎప్పుడో చేసేశాడు… ఎటొచ్చీ విజయ్ సేతుపతి ఆ పాత్ర చేయడమే పెద్ద మైనస్… తను చేయలేడని కాదు, తన టైమింగ్ సూపర్… కానీ తన ఇమేజీకి తగిన పాత్ర కాదు… పైగా దరిద్రమైన ఆహార్యం, వికారమైన మేకప్పు అదనం… దానికి అరవ అతి మరో తల్నొప్పి… ఓ రేంజుకు చేరుకున్నాక ఎవరైనా సరే పాత్రల ఎంపిక పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే పాఠమిది… అఫ్ కోర్స్, సినిమా చూస్తుంటే నవ్వొస్తుంది, అదే సమయంలో జాలేస్తుంది… అందుకే 96, ఉప్పెన హ్యాంగోవర్‌తో సేతుపతిని చూడాలని క్లిక్ చేశారో బుక్కయినట్టే… ఈ సినిమా గురించి ఇంకేం చెప్పుకున్నా సరే, రివ్యూ అనే పదానికే ద్రోహం చేసినట్టు… సెలవు…!! ((మరిచిపోయా… కర్ణన్, అసురన్ వంటి భిన్న పాత్రలతో ఇరగదీసిన ధనుష్ ఆమధ్య జగత్ తంత్రం అనే ఓ కంత్రీ సినిమా చేశాడు కదా, ఈ సినిమా చూస్తే అదే గుర్తొచ్చింది…))
Share this Article