Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కోపమొస్తే వోటరు నిర్దయగా మరీ కౄరంగానే శిక్షిస్తున్నాడు…

June 4, 2024 by M S R

2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలయ్యాక… ఫలితాలు వచ్చాక… మరీ 23 సీట్లకు కుదించుకుపోయాక చంద్రబాబు ఆవేదనగా ఓ మాటడిగాడు వోటర్లను… మరీ 23కు పరిమితం చేసేంత ద్రోహం చేశానా నేను ఈ రాష్ట్రానికి అని..! అప్పట్లో చాలామందికి అదే అనిపించింది…

పోలింగ్‌కు ముందు పసుపు కుంకుమ వంటి ఏవేవో పథకాలతో (ఖజానా నుంచే) జనానికి డబ్బులు పంచాడు… పోలవరం, అమరావతి పూర్తి చేయలేకపోయాడు గానీ ప్రోగ్రెస్ కనిపించింది… కానీ ఏం ఫలం..? వోటర్లు కొన్నిసార్లు క్రూరంగానే వ్యవహరిస్తారు…

సీన్ కట్ చేస్తే… 2024 ఫలితాలు… సీఎం జగన్మోహన్‌రెడ్డి సాధించిన సీట్ల సంఖ్య మరీ 11 మాత్రమే… అక్షరాల్లో పదకొండు మాత్రమే… చిన్నా చితకా పార్టీలు పొందే సీట్లు అవి… చివరకు ప్రస్తుతం ఒక్క సీటూ లేని జనసేన కూడా 21 సీట్లలో 100 శాతం స్ట్రయిక్ రేట్ సాధించింది… అదొక రికార్డు… చివరకు ఉండీలేనట్టు ఉనికి ఉన్న బీజేపీ కూడా 8 సీట్లు కొట్టింది… సరే, ఆ పార్టీలకూ అభ్యర్థుల్ని తెలుగుదేశమే సరఫరా చేయాల్సి వచ్చిందనే విమర్శ ఉన్నా సరే, అంతిమంగా మాట్లాడేవి ఫిగర్సే కదా…

Ads

మరి వైనాట్ 175 అనే ఓ మైండ్ గేమ్ నినాదంతో కదిలి, ఎందరో అభ్యర్థుల్ని మార్చి, వేల కోట్లు గుమ్మరించి… అయిదేళ్లపాటు లక్షల కోట్ల అప్పులు తెచ్చి మరీ డబ్బు పంచాడు కదా… మరీ 11 సీట్లా..? ఇప్పుడు జగన్ ఏమడగాలి..? చాన్నాళ్ల తరువాత మీడియాతో మాట్లాడుతూ తను ఎవరినీ నిందించలేదు… హుందాగానే స్పందించాడు… (2014 ఓటమి తరువాత అసలు తెరపైకే రాలేదు ఒకటీరెండు రోజులు)…

జగన్‌కు తెలుసు, ఫలితాలు నెగెటివ్‌గా రాబోతున్నాయని… పైకి ఏం చెబుతున్నా, గుంభనంగా వ్యవహరిస్తున్నా, తను మానసికంగా ఓటమికి సిద్ధమైపోయాడు… కాకపోతే ఈ రేంజ్ ఓటమి తనూ ఊహించలేదు… సో, ఒక్కటి మాత్రం నిజం… జనానికి వంద చేసినా సరే, ఇంతేనా అంటారు..? కర్నాటకలో చూడండి, ఆర్థిక పరిస్థితిని పణంగా పెట్టి, అలవిమాలిన హామీలిచ్చి, వాటి అమలుకు నానా కష్టాలు పడుతున్నా సరే, అక్కడ కాంగ్రెస్‌కు 9 మాత్రమే సీట్లు, బీజేపీకి 19 సీట్లు…

సో, లక్షల కోట్లు అప్పులు తెచ్చి, జనానికి పంచుతున్నాం కదా, కృతజ్ఞులై ఉంటారనుకుంటే అది భ్రమే… ఇది తెలంగాణ సర్కారు కూడా గుర్తుంచుకోవాలి… జనం చాలా కారణాలను పరిశీలిస్తుంటారు, టైమ్ వచ్చినప్పుడు తమ అభిప్రాయాన్ని ఎన్నికల్లో చెబుతారు… అసలు టీడీపీ పార్టీయే లేకుండా చేయాలని జగన్ ప్రయత్నించినా సరే, జనం అడ్డుకున్నారు ఇలా… కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ మోడీ నానా ప్రయత్నాలు చేసినా ఇప్పుడు కాంగ్రెస్‌కు మళ్లీ జీవగంజి పోశారు ప్రజలు…

సుపరిపాలన అనే అంశమూ ప్రజల్ని ఒక పార్టీ, ఒక నాయకుడి పట్ల నిబద్ధతతో ఉంచలేదు… నవీన్ పట్నాయక్ పాలన స్థూలంగా బాగుంటుందని ఆయన ప్రత్యర్థి పార్టీలు కూడా ఆఫ్ ది రికార్డ్ చెబుతుంటాయి… కానీ ప్రజలు పట్టించుకోలేదు… ఎంపీ ఎన్నికల్లో మరీ ఒక సీటుకే పరిమితం చేశారు… గత పదేళ్ల బీజేపీ పాలనలో అవినీతి కుంభకోణాలూ ఏమీ చోటుచేసుకోలేదు… సో, జనం మూడ్ అంచనా వేయడం కష్టం… పల్స్ పట్టుకోవడం చివరకు ఎగ్జిట్ పోల్స్ వల్ల కూడా సాధ్యం కాదు…

పోనీ, మతం, గుళ్లు వంటి ఉద్వేగాలేమైనా పనిచేస్తాయా..? నో, అయోధ్య గుడి కట్టిన ఫైజాబాద్ సీట్లోనే బీజేపీ ఓడిపోయింది… ఆ యూపీలోనే సగం సీట్లు కూడా సాధించలేకపోయింది… వారణాసి కారిడార్ డెవలప్ చేసిన మోడీ కష్టమ్మీద అక్కడ గట్టెక్కాడు… మతాన్నే ప్రధాన ఆయుధంగా దేశమంతా ప్రచారం చేసుకున్నా సరే, మ్యాజిక్ ఫిగర్ చేరలేక మూలుగుతోంది…

డబ్బు, మతం, పరిపాలన, సంక్షేమ పథకాలు, కులం… ఏది వోటర్లను ప్రభావితం చేస్తుంది అంటే… ఇతమిత్థంగా ఇదీ అని చెప్పలేం, ఏమో, జనం మూడ్ ఎటు, ఎందుకు మారుతుందో ఎవడూ చెప్పలేడు… ఈసారి ఎన్నికలే బలమైన ఉదాహరణ..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions