.
సిరివెన్నెల కలం “ఎప్పుడూ ఒప్పుకోని ఓటమి”
కావ్యకన్య, కవితాకన్య అంటారు. ఏ కవికైనా తాను రాసిన కావ్యమో, కవిత్వమో నిజంగానే కన్న కూతురిలా ఉంటుంది. అలాంటిది సిరివెన్నెలలాంటివారికైతే నవమాసాలు మోసి…కన్న ప్రసవవేదన ఇంకా ఎక్కువ ఉంటుంది. సినిమా కథలో పాట సందర్భం ఆయనకొక అవకాశం- అంతే. తన తాత్విక దృక్పథంతో ఆ సందర్భమే ఆశ్చర్యపోయేలా, పొంగిపోయేలా, కలకాలం నిలిచిపోయేలా పాట రాస్తారాయన.
Ads
రాయడానికి ముందు తనలో తానే ఆలోచనల మథనంతో చాలా రగిలిపోతారు. నిద్రపోరు. తిండి తినరు. పరధ్యానంగా ఉంటారు. చివరికి వారానికో, రెండు వారాలకో ఆ మథనంలో నుండి అమృతగీతం ఆవిర్భవిస్తుంది. అలా రాసిన పదపదాన ఆయన ముద్ర ఉంటుంది. వాక్యాల మధ్య వాక్యాలు మోయలేనంత భావ సముద్రం ఉంటుంది.
ప్రతి భావం మీద ఆ వెన్నెల సంతకం సిరి ఉంటుంది. అలా రాసిన మాటలను సినిమావారు వారి పాపులర్ ప్రమాణాల ప్రకారమో, లేక వారి అజ్ఞానం మేరకో మారిస్తే ఎలా ఉంటుంది? గుండె రగిలిపోతుంది. ధర్మాగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇక్కడ సినిమావారిని తప్పుపట్టాల్సిన పనిలేదు. వారి మాస్ మసాలా పాతాళం అంచులు తాకిన కొలమానాలేవో ఉంటాయి.
చదువులేనివారికి కూడా టక్కున అర్థమయ్యేంత సరళంగా, సులభంగా ఉండాలన్న వారి కమర్షియల్ వ్యాపార సూత్రంతో చదువుకున్నవారు కూడా చదువులేనివారే అయ్యారు. అవుతున్నారు. ఇంకా ఇంకా అవుతారు.
“ఎప్పుడూ ఒప్పుకోవద్దురా…!” అన్న ప్రఖ్యాత గీతాన్ని పట్టుదల సినిమా కోసం 1992లో ఆయన రాశారు. సినిమా సరిగా ఆడలేదు. కానీ అందులో ఈ పాట మాత్రం గొప్పగా నిలిచి వెలుగుతూ ప్రచారం పొందింది. ఎందరికో స్ఫూర్తిగా, ఓదార్పుగా, దారి దీపంగా మారింది. మారాలి కూడా.
గొప్ప రచన. అనన్యసామాన్యమైన ఉదాహరణలు. సర్వం కోల్పోయినా పోరాడడానికి ప్రాణమొక్కటి మిగిలి ఉంటే చాలు- అని ధైర్యాన్ని నింపి… కర్తవ్యాన్ని బోధించే పాట. సిరివెన్నెల గీతాచార్యుడై జీవన కురుక్షేత్రంలో విషాదయోగంలో ఉన్నవారందరికీ ఉపదేశించిన పాట.
- అలాంటిపాటలో కొన్ని పంక్తులను సినిమావారు తీసేయడం ఆయనకు నచ్చలేదు. ఆ తీసేసిన పంక్తులకు తిరిగీ వారు కోరుకున్నట్లు రాసి ఇచ్చారే కానీ… అలాగే ఉండాలని వాదించలేదు. వారిని ఏమీ అనలేదు. తరువాత ఒక వీడియో సందేశంలో ఆ తీసేసిన పంక్తులంటే తనకెందుకంత ఇష్టమో సుదీర్ఘంగా వివరించారు. అది విన్న తరువాత సిరివెన్నెలలాంటివారిని కూడా సినిమా ఇలాగే చూస్తుందా అని బాధపడతాం.
నా మాటలకంటే ఆయన మాటలే పాటలా గొప్పగా ఉంటాయి కాబట్టి… ఆ వీడియోలో ఆయన ఏమన్నారో యథాతథంగా రాస్తాను. అది చదివితే మీకే అర్థమవుతుంది.
“పట్టుదల చిత్రం కమర్షియల్ గా విజయవంతం కాకపోవడంవల్ల అందులో నేను రాసిన “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా!” అనే పాటకు పురిట్లోనే సంధి కొట్టి పోయింది. ఎక్కువమంది జనానికి చేరలేదు. అంతేకాకుండా ఈపాటలో నేను ఒరిజినల్ గా రాసిన కొన్ని భావాలను వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళ బలవంతంమీద మార్చాల్సి వచ్చింది. కానీ నేను మొదట రాసిన మాటలేమిటో…ఆ భావమేమిటో మీకు తెలియాలని ఈ ప్రస్తావన.
ఇది మనిషిలో ఉండి ఉండిన, ఉండవలసిన , ఉండి తీరాల్సిన ఒకానొక దృక్పథాన్ని గురించి ప్రస్తావించే పాట. అది- ఆశావహ దృక్పథం. అది మనిషిలో ఎందుకుండాలి అంటే జీవితమనేది ప్రతిక్షణం పోరాటమే కాబట్టి. స్ట్రగుల్ ఫార్ ఎగ్జిస్టెన్స్. నీ ఉనికికోసం ప్రతిక్షణం ప్రకృతితోటి, సమాజంతోటి, కాలంతోటి పోరాడుతూనే బతకగలగాలి.
పుట్టినవాడు గిట్టకమానడు అనే ధర్మశాస్త్రాన్ని, మెట్టవేదాంతాన్ని పట్టుకుని ఏ క్షణంలో అయినా, ఏ రోజైనా చచ్చిపోతాం కాబట్టి ఇక ఏ పనీ చేయకుండా కూర్చోడు మనిషి. మనం ఈ క్షణాన, ఇప్పుడు పొవట్లేదు కదా!
మృత్యువు వచ్చినప్పుడు తరువాత చూసుకుందాం. కనుక ఇప్పుడు బతుకుదాం అన్న విచిత్రమైన ఆశ. ఆ ఆశే మనిషికి శ్వాస. ఒక చీమనుంచి, ఒక పిట్టనుంచి, ఒక చెట్టునుంచి, మట్టిని చీల్చుకుని వచ్చే ఒక విత్తునుంచి… వీటన్నిటినీ చూస్తూ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ పోరాడడమే జీవితం.
ఈ పోరాటంలో ఏ క్షణంలో కూడా ఓటమికి గాయంగానీ, అలసిపోవడంగానీ ఓటమికి చిహ్నం కాదు. అది కాసేపు విరామం తీసుకుని తిరిగీ ప్రారంభించడం. ప్రయత్నం వదలని సాలీడు కథ అందరికీ తెలిసిందే. అందువల్ల “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి…” అంటూ రాసిన ఈ పాట నాకు చాలా ఇష్టం. నేను రాసింది పరిపూర్ణంగా ఆ సినిమాలో లేకపోవడంవల్ల అదేమిటో తెలియడానికి నేనే పాడి వినిపిస్తున్నాను.
“ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా
నొప్పి లేని నిమిషమేది జననమైన
మరణమైన జీవితాన అడుగు అడుగునా
నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణా
దేహముంది ప్రాణముంది
నెత్తురుంది సత్తువుంది
ఇంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను
దీక్షకన్న సారధెవరురా
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా
నిన్ను మించి శక్తి ఏది
నీకె నువ్వు బాసటైతే
నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న
గువ్వపిల్ల రెక్కముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైనా ఈదుతున్న
చేపపిల్ల మొప్పముందు చిన్నదేనురా
పిడుగువంటి పిడికిలెత్తి ఉరుమువల్లె
హుంకరిస్తే దిక్కులన్ని పిక్కటిల్లురా
ఆశయాల అశ్వమెక్కి అదుపులేని
కదనుతొక్కి అవధులన్నీ అధిగమించరా
త్రివిక్రమా పరాక్రమించరా
విశాల విశ్వమాక్రమించరా
జలధి సైతం ఆపలేని
జ్వాల ఓలె ప్రజ్వలించరా”
అని సినిమాలో ఉన్నపాట. కానీ నేను మొదట రాసినవి, వారు తీసేసినవి ఈ పంక్తులు:-
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసురసంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా!
గుటకపడని అగ్గి ఉండ సాగారాలనీదుకుంటు తూరుపింట తేలుతుందిరా!
నిశావిలాసమెంతసేపురా? ఉషోదయాన్ని ఎవ్వడాపురా?
రగులుతున్న గుండెకూడ సూర్యగోళమంటిదేనురా!
(మొదటి చరణం చివర)
ఆయువంటు ఉన్నవరకు చావు కూడా నెగ్గలేక శవముపైన గెలుపు చాటురా!
(రెండో చరణం చివర)
లోకంలో ఫలానావాడు చచ్చిపోయాడు అని క్లెయిమ్ చేసేవాడు ఉంటాడు కానీ… నేను చచ్చిపోయాను అని క్లెయిమ్ చేసుకునేవాడు ఎవడూ ఉండడు. నేను పుట్టాను అని ఒకడు చెబితే విన్నాం. మన పుట్టుకను మనం అనుభవించలేదు. మన చావును కూడా మనం అనుభవించం. ఇప్పుడున్నదే జీవితం. చావనే మాటే లేదు ఈ క్షణాన. ఈ పర్టిక్యులర్ వాక్యాన్ని వాళ్ళు తిరస్కరించారు. కానీ నాకు ఈ పర్టిక్యులర్ వాక్యమే చాలా ఇష్టం.
ఎందుకంటే ఈ సత్యాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోగలిగితే, తలచుకోగలిగితే…ఔను కదా చచ్చిపోతానని భయమెందుకు? ఒకవేళ చచ్చిపోయామే అనుకుందాం. ఆ సంగతి నాకు తెలియనే తెలియదు కదా! నాకు తెలియనిదాని గురించి నాకెందుకు దిగులు?
నా చావు నాది కానప్పుడు… దానిగురించి నేనెందుకు ఇంతగా భయపడాలి? ఆ భయమే కదా నన్ను ఇన్ని విధాలుగా తరుముతున్నది! ఒక్కసారి నేను చావను అనుకోగలిగితే జీవించడంపట్ల దృక్పథం పెరుగుతుంది; చావుపట్ల భయం తగ్గుతుంది. ముగింపుపట్ల కాకుండా కొనసాగడంమీద మన దృష్టి కేంద్రీకరించేలా చేసే ఈ పర్టిక్యులర్ వాక్యమంటే నాకు చాలా ఇష్టం- ఆయువంటు ఉన్నవరకు చావు కూడా నెగ్గలేక శవముపైన గెలుపు చాటురా!
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి!”
సిరివెన్నెలగారూ!
మీరెంతో అదృష్టవంతులు. మొత్తం పాటలో ఒక్కో చరణంలో రెండేసి అర్థవంతమైన లైన్లనే తీసేసి మిగతాదాన్నైనా అలాగే ఉండనిచ్చారు. ఇప్పుడు అర్థరహితమైనదాన్ని మాత్రమే ఉంచి… అర్థవంతమైనదాన్ని మొత్తంగా తిరస్కరిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్లు స్వరాలకు రాసుకున్న డమ్మీ సాహిత్యమే నిజం సాహిత్యంగా విడుదల చేస్తున్నారు. ఏఐ చేత కూడా రాయిస్తున్నారు. మనుషులే యంత్రాల సాయంతో యాంత్రికంగా రాస్తున్నారు. మీ పాట పంచామృతం. మీరు పోయారు కాబట్టి బతికిపోయారు.
పాట భావమే-
ఓటమిని ఒప్పుకోకపోవడం;
ఓరిమిని కోల్పోకపోవడం;
నిరాశకే నిరాశ పుట్టించడం కాబట్టి ఆయన కలం ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోలేదు…
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article