అత్యంత భారీ, భారీ బిల్డప్పుల హీరోల సినిమాలకేమో… అవెంత చెత్తగా ఉన్నా సరే ఫ్యాన్స్‌కు భయపడి సానుకూల రివ్యూలే రాస్తుంటారు… థియేటర్ వెళ్లే ప్రేక్షకుడు వాడి చావు వాడు చస్తాడు, మనదేం పోయింది అన్నట్టుగా… ఆ వసూళ్లు, ఇతర భజన వార్తల్ని కుమ్మేస్తుంటారు… కానీ చిన్న సినిమాలను ఎందుకు ఎంకరేజ్ చేయరు, పైగా ఎప్పుడూ చిన్న, చౌక సినిమాలే ఇండస్ట్రీకి శ్రేయస్కరం అని నీతులు చెబుతారు……
…. ఇదీ ఓ మిత్రుడి విమర్శ…రాజు యాదవ్ సినిమా మీద వచ్చిన నెగెటివ్ రివ్యూల మీద ఆయన స్పందన అది… నిజంగా ఆ సినిమా మీకు నచ్చిందా అనడిగితే, మొదట్లోనే అందరూ నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంకన్నా కాస్త పాజిటివ్ పుష్ చేయొచ్చు కదా, పది మందీ బతుకుతారు, ఇండస్ట్రీలో నిలబడతారు అన్నాడు తను సినిమా ఎలా ఉందో చెప్పకుండా… పైగా తను కేరళ ఇండస్ట్రీలో జరుగుతున్న రివ్యూ బాంబింగ్ అనే పదాన్ని వాడాడు…
స్థూలంగా చూస్తే సినిమా మీద తక్షణం నెెగెటివ్ రివ్యూలు ఉద్దేశపూర్వకంగా వస్తే దాన్ని రివ్యూ బాంబింగ్ అన్నారంటే అర్థముంది… కానీ ఇలాంటి సినిమాల మీద తక్షణం ‘రియలిస్టిక్ రివ్యూలు’ వస్తే వేలాది మంది ప్రేక్షకుల్ని చాలా కోణాల్లో కాపాడినట్టే అవుతుంది కదా… అది ప్రజోపయోగమే కదా…
Ads
ఎవరో నిలబడటానికి ప్రేక్షకులు థియేటర్లు అనబడే నిలువు దోపిడీ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు… సినిమాలో దమ్ముంటే ఎవడేం రాసినా జనం పట్టించుకోరు… ఇదీ రియాలిటీ… కాకపోతే అతను చెప్పింది నిజం… అత్యంత భారీ చెత్తా సోకాల్డ్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే, ఆ బిల్డప్పుల హీరోలకు వందల కోట్లు సమర్పించుకోవడంకంటే చిన్న సినిమాలను పుష్ చేయడం మంచిదే కానీ..,
ఇష్టమొచ్చినట్టుగా… తీసేవాడికి చూసేవాడు లోకువ అన్నట్టుగా తీస్తే, ఎందుకు ఎంకరేజ్ చేయాలి..? ఇదీ ప్రశ్న… ఒక బలగం, ఒక షరతులు వర్తిస్తాయి వంటి సినిమాలకు మంచి టాక్ ఎవరు ఆపగలిగారు..? చిన్న సినిమాలే కదా… కాంతారా కూడా బిజినెస్‌పరంగా తెలుగులోకి డబ్ చేయబడిన చాలా చిన్న సినిమా… దుమ్మురేపింది కదా… పోనీ, మన చిన్న- కొత్త సినిమాల టీమ్స్ మలయాళ ప్రయోగాల్లాగా ఏమైనా కొత్త ప్రయత్నాలు చేస్తున్నారా..? అదీ లేదు…
సినిమా అనేది చాలా బలమైన మాస్ కమ్యూనికేషన్… కానీ అది కనెక్టయ్యేలా ఉండాలి… రాజు యాదవ్ సినిమాకే వస్తే, జనం హీరో మొహాన్ని కొన్ని కోట్ల సార్లు జబర్దస్త్, ఇతర టీవీషోలలో చూసీ చూసీ ఉన్నారు కదా… మళ్లీ ఏదో కొత్త లాంచింగ్ వారస హీరోలాగా గ్రూపు సాంగ్స్, మాస్ మసాలాలు, స్టెప్పులు అవసరమా గెటప్ శ్రీనుకు… పోనీ, సుడిగాలి సుధీర్ మంచి డాన్సర్, తనకు నప్పుతాయి డాన్సులు… సినిమాలో ఒక్కటంటే ఒక్క సీనూ ప్రేక్షకుడికి కనెక్టయ్యేలా లేదు…
సరే, కథకొస్తే క్లైమాక్స్ దాకా పళ్లికిలిస్తూ కనిపించడమే కదా హీరో వేషం… పైగా అక్కడక్కడా ఆ బాపతు శృంగార సీన్లు… బేబీ సినిమాల్లో హీరోయిన్ పాత్రలాంటి హీరోయిన్… అప్పటిదాకా ఛిఛీ అని ఛీత్కరించి, పదే పదే వెంటపడితే ఓసారి అన్నీ సమర్పించుకుంటుంది… అదేమిటో మరి..? నిజానికి హీరో కేరక్టరైజేషన్ ప్రకారం ఏ ఆడ పాత్రా తనను అంగీకరించకూడదు… పైగా బాల్ తగిలి, కుట్లు సరిగ్గా వేయకపోతే ఈ వింత జబ్బు వస్తుందా..? అందుకే జనం చూసి నవ్వుకున్నారు… కామెడీ నవ్వు కాదు, ఫాఫం అనుకుని..!
హీరో కేరక్టరైజేషన్ చూస్తే, చదువు సంధ్యల్లేవు, తండ్రంటే గౌరవం లేదు, పైగా ఓ వింత రోగం… ఎందుకు ఎవతైనా ప్రేమించాలి తనను… అసలు ప్రేమించినట్టు చూపిస్తేనే దర్శకుడికి ఏమాత్రం సోయి లేనట్టు లెక్క… పైగా హీరోను ఓ ప్రేమ బాధితుడిగా చూపించే పిచ్చి ప్రయత్నం… హీరోయిన్ కేరక్టరైజేషన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది… తండ్రి ఆనంద చక్రపాణి మాత్రమే కాస్త గుర్తుంటాడు సినిమా మొత్తంలో…
జబర్దస్త్ షోలో ఒకటి కాకపోతే మరో స్కిట్ ఉంటుంది… పేరడీలుంటయ్, కామెడీ ఎపిసోడ్లుంటయ్, ఏవో సరదాగా నాలుగైదు నిమిషాల బిట్లు… కానీ సినిమా అలా కాదు, ప్రేక్షకుడు తన పర్సును తనే కత్తిరించుకుని మరీ థియేటర్ రావల్సి వస్తోంది… అలాంటప్పుడు ఒక చిన్న సినిమా ఎంత శ్రమతో, ఎంత మథనంతో, ఎంత క్రియేటివిటీతో రావాలి… అదుగో అదే లోపించింది… పైగా పేరున్న ప్రముఖులు ఈ సినిమాకు ప్రమోషన్ ఆర్టిస్టులు, వాళ్లదేం పోయింది..? ఊడ్చి పెట్టేది ప్రేక్షకుడు కదా..!!
చివరగా… ఈ సినిమాకు వెళ్లడంకన్నా ఇదే గెటప్ శ్రీను పలు స్కిట్లలో చేసిన బిల్డప్ బాబాయ్ స్కిట్లు టీవీల్లో, యూట్యూబులో చూసేస్తే మనసుకు హాయి, పర్సుకు అంతకుమించిన హాయి, సేఫ్టీ..!!
Share this Article