పార్ధసారధి పోట్లూరి……. మీరు రష్యా వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ! అది అంత మంచిది కాదేమో ? ఇది కొంతమంది మిత్రుల మరియు శ్రేయోభిలాషుల కామెంట్స్ ! ఎప్పుడూ ఏక ద్రువ ప్రపంచం ఉండడం మంచిది కాదు. భిన్న ధ్రువ ప్రపంచం ఉండడం అందరికీ మేలు చేస్తుంది. ఒక దేశం అపారమయిన సంపదతో పాటు అధునాతన ఆయుధాలు కలిగి ఉంటే ఎంతటి వినాశనానికి దారి తీస్తుందో హిట్లర్ చెప్పాడు… ఆర్యులు మాత్రమే ఈ ప్రపంచాన్ని శాసించాలి అనే మూర్ఖ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చావుకి కారణం అయిన సంగతి మరిచిపోకూడదు.
హిట్లర్ నేతృత్వంలో జెర్మనీ అప్పట్లో అధునాతన ఆయుధాలు తయారుచేసి అన్ని దేశాలని సవాల్ చేసింది. రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, పోలాండ్ తో సహా ప్రపంచంలోని అన్ని దేశాలు జెర్మనీకి వ్యతిరేకంగా యుద్ధం చేశాయి. అప్పట్లో అమెరికా తటస్థంగా ఉంది. ఎప్పుడయితే జపాన్ అమెరికాలోని పెరల్ హార్బర్ మీద దాడి చేసి, అమెరికన్ నౌకా దళాన్ని ధ్వంసం చేసిందో అప్పుడు మాత్రమే అమెరికా మిగతా దేశాలతో జత కట్టింది జెర్మనీ మీద … అప్పటి వరకు అమెరికా చేసింది ఏమిటీ ? జెర్మనీతో సహా అన్ని దేశాలకి ఆయుధాలు అమ్ముతూ లాభాలు మూటగట్టుకుంది.
Ads
అప్పట్లో ప్రపంచానికి పెద్దన్న అంటూ ఎవరూ లేరు. కానీ జపాన్ చేసిన పనికి అమెరికా అణుబాంబు వేసి తాను పెద్దన్న స్థానంలో కూర్చుంది. గల్ఫ్ దేశాల రక్షణ బాధ్యత తనదే అని హామీ ఇచ్చి దానికి బదులుగా ఆయిల్ వ్యాపారం మొత్తం డాలర్లతోనే జరగాలి అనే ఒప్పందం చేసుకుంది. దాంతో తనకి ఇష్టం అయిన దేశాలకి సహకరిస్తూ, ఇష్టం కాని దేశాల మీద ఆయిల్ కొనడానికి వీలు లేకుండా ఆంక్షలు విధిస్తూ వచ్చింది. వర్ణ వివక్షకి వ్యతిరేకం అంటూనే తనతో పాటు యూరోపియన్ దేశాలని అక్కున చేర్చుకుంది. అసలు అమెరికన్స్ అంటూ ఎవరూ లేరు. యూరోపు నుండి వివిధ జాతుల, భాషల ప్రజలు వెళ్లి అమెరికాని ఆక్రమించుకున్నారు కాబట్టి యూరోప్ కి అమెరికాకి పెద్ద తేడా లేదు. అమెరికా, యూరోపియన్ యూనియన్, నాటో దేశాలు అంతా ఒక తానులోని ముక్కలే !
అసలు వైరం ఎక్కడ నుండి పుట్టింది ? రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలు యూదులని గాస్ చాంబర్లలో పెట్టి చంపుతుంటే భయంతో పారిపోయిన యూదు సైంటిస్టులు మొదట ఇంగ్లాండ్ కి పారిపోయి, తరువాత అమెరికా వెళ్ళారు. జీవ, రసాయన, ఎలెక్ట్రికల్, ఎలెక్ట్రానిక్స్, సివిల్ ఇంజినీరింగ్ సైంటిస్టులు బోలెడు మంది అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు అప్పట్లో. కొన్ని కీలకమయిన రంగాలలో అమెరికా సాధించిన ప్రగతిని చూసి వాటి తాలూకు రహస్యాల కోసం సోవియట్ గూఢచార సంస్థ KGB అమెరికా నుండి బ్లూ ప్రింట్స్ ని దొంగిలించింది. మొదట వైరం ఇక్కడ మొదలయ్యింది.
ముఖ్యంగా రాకెట్ ఇంజిన్ విషయంలో అప్పటికే హిట్లర్ గణనీయమయిన ప్రగతిని సాధించాడు… అలాగే జెట్ ఇంజిన్ ని కూడా మొదట అభివృద్ధి చేసింది జెర్మనీనే ! సోవియట్ యూనియన్ ఉద్దేశ్యం ఏమిటంటే జెర్మనీని అణిచివేయడంలో మా పాత్ర ఎక్కువ కాబట్టి సింహభాగం జర్మన్ టెక్నాలజీ మాకు కూడా దక్కాల్సిందే అని… నిజం కూడా అదే ! అదే సమయంలో CIA సోవియట్ సైంటిస్టులని డాలర్లతో ప్రలోభపెట్టి లొంగదీసుకొని మరీ టెక్నాలజీ చౌర్యానికి పాల్పడింది. మరో వైపు KGB అమెరికాలో పనిచేస్తున్న జర్మన్ సైంటిస్టులని కిడ్నాప్ చేసి మరీ మాస్కో తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర రహస్యాలని రాబట్టేది…
పోటీ పెరిగే కొద్దీ కిడ్నాపులు, హత్యలు జరిగాయి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత రాడార్ టెక్నాలజీలో మొదట అమెరికా పైచేయి సాధిస్తే తరువాత సోవియట్ యూనియన్ పైచేయి సాధించింది… అలాగే యుద్ధ విమానాల జెట్ ఇంజిన్ల విషయంలో మొదట్లో సోవియట్ యూనియన్ పైచేయి సాధిస్తే తరువాత అమెరికా , యూరోప్ లు పైచేయి సాధించాయి. సోవియట్ యూనియన్ కాలం నాడు MIG-21 యుద్ధ విమానాలు 10 వేలకి పైగా అమ్ముడుపోయి రికార్డ్ సృష్టించింది. మళ్ళీ ఆ రికార్డ్ ని తిరిగ వ్రాసింది అమెరికన్ F-16… ఇక అదే రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత అనతోలీ కలష్నికొవ్ అనే రష్యన్ మొదటి సారిగా AK-47 ని ఆవిష్కరించాడు… ఇందులో 47 అనేది 1947 సంవత్సరం ని సూచిస్తుంది. ఇప్పటి వరకు ఈ గన్ వాడుకలో ఉంది…
ఇలా ఆయుధ పోటీ రెండు దేశాల మధ్య వైరానికి దారి తీసింది. 1991 లో సోవియట్ విచ్చిన్నం వెనుక CIA హస్తం ఉంది అంటారు… కానీ ఇంకో వాదన కూడా ఉంది… అది స్వయంకృతాపారాధం అని. సోవియట్ విచ్చిన్నం తరువాత రష్యా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. మరో వైపు అమెరికా దాని మిత్రపక్షాలు మాత్రం తమకి అనుకూలంగా లేని దేశాల మీదకి దాడికి దిగి వాటిని సర్వ నాశనం చేసాయి. మరీ ముఖ్యంగా భారత్ కి కాశ్మీర్ విషయంలో బేషరతుగా మద్దతు ఇస్తూ వస్తున్న ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ని విచారణ పేరుతో ఉరి తీసి మరీ చంపింది. ఇప్పటికీ ఇరాక్ కోలుకోలేదు.
అమెరికా చెప్పిన కారణం ఇరాక్ దగ్గర జనహనన జీవ రసాయన ఆయుధాలు ఉన్నాయని. కానీ అమెరికన్ దళాలు ఇరాక్ మొత్తం జల్లెడ పట్టినా ఎలాంటి ఆయుధాలు దొరకలేదు… కానీ లక్షల్లో అమాయక ప్రజలు చనిపోయారు. ఇరాక్ ఒకప్పుడు అమెరికాకి మిత్ర దేశం. ఇరాన్, ఇరాక్ మధ్య 10 ఏళ్ల పాటు జరిగిన యుద్ధంలో అమెరికా ఇరాన్ కి వ్యతిరేకంగా ఇరాక్ కి ఆయుధాలు ఇచ్చి మరీ సహకరించింది. అంటే అమెరికాతో అంట కాగితే తరువాత ఆ దేశానికే నష్టం అన్నమాట.
లిబియా అధక్షుడు మోమ్మార్ గడ్డాఫీ చేసిన నేరం ఏమిటీ ? ఒక సర్వ సత్తాక దేశం మీద అమెరికా దాని మిత్ర దేశాలు ఎందుకు దాడి చేసి నాశనం చేసాయి ? మోమ్మార్ గడ్డాఫీ అమెరికన్ డాలర్ కి ప్రత్యామ్నాయంగా ఒక నూతన కరెన్సీ ఏర్పాటు చేయాలని ప్రయత్నించడమే ! ఇది సహించలేని అమెరికా మోమ్మార్ గడ్డాఫి నియంత అంటూ దాడి చేసి క్రూరంగా లిబియా ప్రజల చేతనే చంపించింది. ఇరాక్, లిబియా రెండు దేశాలు కూడా రష్యా నుండి ఆయుధాలు కొన్నాయి. లిబియా అధ్యక్షుడు మోమ్మార్ గడ్డాఫి, ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ లు ఇద్దరు కూడా డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసిన వాళ్ళే. అందుకే ఎదో ఒక నేరం మోపి ఇద్దరినీ చంపేసింది అమెరికా.
మనకి స్వాతంత్ర్యం వచ్చిననప్పటి నుండి అమెరికా, బ్రిటన్ లు పాకిస్థాన్ కి అండగా ఉంటూ వచ్చాయి. కాశ్మీర్ విషయంలో ఒక్క రష్యా మాత్రమే ఐక్యరాజ్యసమితిలో పెట్టిన ప్రతీ తీర్నానాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. రెండుసార్లు మన దేశం అణు పరీక్షలు జరిపినప్పుడు అమెరికా బ్రిటన్ లు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మన మీద ఆంక్షలు విధించాలి అంటూ తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించి వాటిని అడ్డుకుంది. ఫ్రాన్స్ దేశం మాత్రం వోటింగ్ కి దూరంగా ఉండిపోయింది అన్ని సార్లు.
అంతెందుకు, చైనా మన మీద 1962 లో దాడి చేసినప్పుడు అమెరికా మనకి మద్దతుగా భద్రతా మండలిలో తీర్మానం ఎందుకు పెట్టలేకపోయింది? ప్రస్తుతం లడాక్ లో చైనా తన సైన్యాన్ని మొహరించినపుడు చైనా మీద ఎందుకు ఆంక్షలు విధించలేదు ? కార్గిల్ యుద్ధ సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రాత్రి పూట మన ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ గారికి ఫోన్ చేసి పాకిస్థాన్ అసహనంతో ఉంది, అణు దాడి చేస్తాను అంటున్నది అంటూ పరోక్షంగా హెచ్చరించాడు…
దానికి వాజపేయీ గారు సమాధానం ఇస్తూ, పాకిస్థాన్ మొదట అణు దాడి చేస్తే భారత్ లో కొంత భాగం దెబ్బతింటుంది, కానీ రెండో బాంబు మేము వేస్తే తెల్లారికల్లా పాకిస్థాన్ అనే దేశం ప్రపంచ పటంలో ఉండదు అంటూ సున్నితంగా చెప్పాడు… దాంతో ఫోన్ పెట్టేసాడు. ఇది నిజంగా పాకిస్థాన్ అమెరికాతో అన్నదా? లేక అమెరికానే సొంత పైత్యంతో మనల్ని హెచ్చరించిందా ?
ఈ వ్యాసరచయిత రష్యాని సమర్దిస్తున్నాడు అనే వాళ్లకి ఒకటే ప్రశ్న. రష్యా ఇతర దేశాల మీద దాడి చేసి లక్షల మంది ప్రాణాలు తీసిందా తన ఆయుధాలని అమ్ముకోవడానికి ? మీరు చరిత్రని తవ్వాల్సి వస్తే, అంటే జార్ చక్రవర్తుల దండయాత్రలు మాట్లాడితే, నేను యూరోపు వాళ్ళు అమెరికాని ఆక్రమించి, అక్కడ వేల సంవత్సరాలుగా ఉంటున్న రెడ్ ఇండియన్స్ ని సమూలంగా నాశనం చేసి ఆక్రమించుకున్న సంగతిని ప్రస్తావించాల్సి ఉంటుంది…
ఇప్పుడు అసలు మూలవాసులు అయిన రెడ్ ఇండియన్స్ ఏమయిపోయారు ? జస్ట్, వాళ్ళని మేము మరిచిపోలేదు అంతే… అమెరికన్ ఎటాక్ హెలికాప్టర్ కి ’’అపాచీ ‘’ అనే రెడ్ ఇండియాన్స్ పేరు పెట్టి చేతులు దులుపుకుంది అంటాను… నిత్యం మన కాశ్మీర్ లో చిచ్చు పెడుతున్న పాకిస్తాన్ మీద మనం సర్జికల్ స్త్రైక్స్ చేసినట్లు తన పక్కలో బల్లెం మాదిరిగా తయారు అవుతున్న ఉక్రెయిన్ మీద దాడి చేసింది రష్యా…
రేప్పొద్దున మన దేశం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేసుకుంటే, ఇదే అమెరికా, బ్రిటన్ లు మోడీని హిట్లర్ తో పోల్చవని గ్యారంటీ ఉందా ? మనకి మాత్రం మన కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోవాలి, అదే పని రష్యా చేస్తే దురాక్రమణదారు ఎలా అవుతుంది ? మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేసుకుంటే మళ్ళీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనకి అండగా నిలబడేది రష్యా మాత్రమే ! తీర్మానం అంటూ ప్రవేశ పెడితే తనకి ఉన్న వీటో అధికారాన్ని ప్రయోగించే ఏకైక దేశం రష్యా మాత్రమే ! మనకి మన ప్రయోజనాలు ముఖ్యం అంతే !
Share this Article