మొన్నామధ్య సోషల్ మీడియాలో బాగా విమర్శలు వినిపించాయి… కనిపించాయి… కర్నాటక ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం మీద..! అదేమిటయ్యా అంటే..? బెంగుళూరు ఎయిర్‌పోర్టులో ప్రభుత్వం చౌక ఆహారం కోసం ఇందిరా క్యాంటీన్ పెడుతుందట… 5 రూపాయలకు టిఫిన్, 10 రూపాయలకు మీల్స్… రెండు క్యాంటీన్లు పెడతారు…
ఠాట్, ఎయిర్‌పోర్టుకు వెళ్లేవాళ్లు, విమానాల్లో తిరిగేవాళ్లు ఏమైనా పేదవాళ్లా..? వాళ్లకు ఎందుకు చౌక ఆహారం..? నాన్సెన్స్, అన్ని రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో పెట్టండి, గుడ్, కానీ ఈ ఎయిర్‌పోర్టులో ఈ పథకం ఏమిటి…? సిగ్గూశరం లేదా ఈ కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి..? ఆయ్ఁ… ఇలా సాగిపోయాయి సోషల్ విమర్శలు…
ఒకటి… ఆహారం ఎవరికి ఎవరు పెట్టినా ఖండించకూడదు… దేశం ఆహారభద్రత కోసం ఏటా లక్షల కోట్లను వెచ్చిస్తోంది… కొంటోంది, పంపిణీ చేస్తోంది… ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టవద్దంటే నోటి కాడ బుక్క ఎత్తగొట్టినట్టే…
Ads
రెండు… ప్రస్తుతం తమిళనాడులో ఉన్న అమ్మ క్యాంటీన్లు గానీ, కర్నాటకలోని ఇందిరా క్యాంటీన్లు గానీ, తెలంగాణలోని ఫైవ్ రుపీస్ మీల్స్ గానీ కేవలం పేదలే వినియోగించుకోవడం లేదు… చాలాచోట్ల క్యూలలో నిలబడి మరీ మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజానీకం కూడా ఉపయోగించుకుంటోంది… ప్రత్యేకించి హాస్పిటల్స్ వద్ద అటెండెంట్లకు ఇదే ఆహార సౌకర్యం…
మూడు… ఏపీలో అన్న క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం మూసిపారేసింది… అది ఓ దుర్మార్గ నిర్ణయం… పేదల కడుపు కొట్టే చర్య… పోనీ, తను రాజన్న క్యాంటీన్లు ప్రారంభించాడా అంటే అదీ లేదు…
నాలుగు… హోటళ్లలో ఫుడ్ రేట్లు కరోనా అనంతరం విపరీతంగా పెరిగిపోయాయి… పైగా రుచీపచీ ఉండదు… తెలంగాణలో లేదు గానీ తమిళనాడు, కర్నాటకల్లో అల్పాహారం కూడా లభిస్తుంది…
అయిదు… మారిన జీవనవ్యయాలు, ఆదాయాలు, అవసరాలను సరిగ్గా లెక్కేస్తే దిగువ మధ్యతరగతి ఎప్పుడో పేద అనే కేటగిరీలోకి చేరిపోయింది… చౌక ఆహారాన్ని క్యూలో నిలుచుని తీసుకోవడానికి వాళ్లేమీ వెనుకాడటం లేదు… నామోషీ ఏమీ లేదు… కడుపు నిండాలి… సదరు క్యాంటీన్ ఎక్కడున్నా సరే.., అందుకే కేవలం పేదలే కనిపించడం లేదు అక్కడ…
ఆరు… ఎస్, రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో క్యాంటీన్లు పెట్టాలనే సూచన అభినందనీయం… వోట్ల కోసం ఏటా వేల కోట్లను ఉదారంగా బ్యాంకు ఖాతాల్లోకి పంపిణీ చేయడం కాదు, ఇలాంటి వాస్తవ ఉపయోగ పథకాల మీద దృష్టి పెట్టాలి… ఫుడ్ మీద ఎంత వ్యయమైనా సరే, ఏ పథకమైనా స్వాగతనీయం…
ఏడు… ఎప్పుడైనా ఓ మోస్తరు హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లలోని హోటళ్లకు వెళ్లి గమనించారా రేట్లు..? ఫుడ్ క్వాంటిటీ, ఫుడ్ టేస్ట్… కార్పొరేట్ బిల్లుల్లాగే దారుణంగా ఉంటయ్…
ఎనిమిది… ఎయిర్‌పోర్టులకు వద్దాం… పలు అవసరాల కోసం మధ్యతరగతి విమానాల్లో ప్రయాణించాల్సి వస్తోంది… వందే భారత్‌లు, సెకండ్ ఏసీల చార్జీలతో విమాన ప్రయాణ టికెట్లు దొరుకుతున్నయ్… పైగా కొన్నిసార్లు అవసరం రీత్యా విమాన ప్రయాణాలు తప్పడం లేదు… కానీ పోర్టుల్లో ఫుడ్ రేట్లు ఆకాశంలో ఉంటాయ్… బయట ఏడెనిమిది రూపాయలకు దొరికే చాయ్ అక్కడ 100… మొన్న మనమే ముంబై పోర్టులో దోశ 600 రూపాయలు అని ఫోటోలు పెట్టి మరీ పోస్టులు పెట్టాం కదా… అదే కాదు, మినీ మీల్ 1000 రూపాయలు… ఏ పసిపిల్లాడికో అర్జెంటుగా పాలు అవసరమైతే ఎయిర్‌పోర్టులో కప్పు పాలు అడిగి చూడండి…
ఇక మన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫుడ్ ధరలు చూడండి… ఇడ్లీ బయట 30 నుంచి 40… ఎంత చట్నీస్ వంటి హోటళ్లకు వెళ్లినా 70, 80 ఉంటుంది… ఇది చూడండి 260… ఎప్పుడైనా కాస్త పరిశీలనగా చూడండి, సాంబర్ మినీ ఇడ్లీ క్వాంటిటీ, సైజులను… సరిగ్గా రెండు బుక్కలకు సరిపోతాయి… రేటు 262…
దగ్గరలో 10 రూపాయల చాయ్ బదులు కాస్త దూరం వెళ్లయినా సరే 8 రూపాయల చాయ్ తాగడానికి ప్రిఫరెన్స్ ఇవ్వడమే మధ్యతరగతి మెంటాలిటీ… పైసా పైసా పొదుపు అనేది అలవాటు కాదు, ఇప్పుడు అవసరం… ఇక ఇడ్లీకి 260, దోశకు 640 పెట్టగలమా..? కనీసం చాయ్ కూడా తాగలేం… అంతెందుకు..? మంచినీళ్ల బాటిల్ 100 రూపాయలు… ఇక విమానాల్లో ఇచ్చే ఫుడ్ టేస్ట్, క్వాంటిటీ, వెరయిటీ, రేట్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది…
ఇండిగో వంటి దిక్కుమాలిన విమానయాన సంస్థలు వచ్చాక రెండుమూడు గంటల ముందే ఎయిర్‌పోర్టు వెళ్లాలి… సెక్యూరిటీ చెక్ నుంచి బోర్డింగ్ పాయింట్ వద్దకు వెళ్లడానికి ఓ కిలోమీటర్ నడవాలి… మధుమేహులో, ఆకలిగొన్నవాళ్లో అక్కడి దుకాణాల్లో రేట్ల బోర్డులు చదివితేనే హడలిపోతారు… సుగర్ ఆటోమేటిక్‌గా డౌన్ కావల్సిందే…
పర్ సపోజ్ అక్కడ ఇందిరా క్యాంటీనో, అమ్మ క్యాంటీనో పెడితే ఈ సోకాల్డ్ ధనిక ప్రయాణికులు కూడా అక్కడే తినటానికి ప్రయారిటీ ఇస్తారు… ష్యూర్.., రేటొక్కటే కాదు, రుచి కూడా ప్రధానమే… అన్నింటికీ మించి కడుపు నిండాలి… అది ప్రభుత్వం పెట్టినా సరే, ఏదైనా ధార్మిక సంస్థ పెట్టినా సరే..!! పోనీ, ఫుడ్ సంగతి తరువాత, కాస్త చాయ్ నీళ్లయినా చీప్‌గా పోయండర్రా..!!
Share this Article