పాలిస్తున్నది బీజేపీ కాబట్టి… లీడ్ చేస్తున్నది మోడీ కాబట్టి… ఇక తను ఏం చేసినా వ్యతిరేకించాలా..? బీజేపీ అవకతవక పాలన విధానాలపై ఏ స్థాయి పోరాటమైనా సరే మద్దతునివ్వండి… పాత్రికేయ విశ్లేషణల్లో ఎండగట్టండి… మోడీ దేనికీ అతీతుడు ఏమీ కాదు… కానీ దేశ సమగ్రతకు, భద్రతకు థ్రెట్‌గా మారే శక్తులకు, అదీ జర్నలిజం ముసుగులో జరిగే యాక్టివిటీస్‌కు మద్దతునివ్వాలా..? ఇదొక పెద్ద ప్రశ్న…
న్యూస్‌క్లిక్ అనేది ఓ వెబ్‌సైట్… దానికి ఏడాదిలో చైనా 20 కోట్లు ఇచ్చిందట… అది కేంద్రంగా భారత వ్యతిరేక శక్తులు ఒక్కచోట పనిచేస్తున్నాయనేది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల తాజా ఆరోపణ… ఒకేసారి 30 చోట్ల సోదాలు చేశారు… న్యూస్‌క్లిక్ ఆఫీస్ సీజ్ చేశారు… ఈ సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్‌కాయస్థతోపాటు హెచ్‌ఆర్ హెడ్ అమిత్‌ను కూడా అరెస్టు చేశారు… చాలామంది సోకాల్డ్ జర్నలిస్టుల జాతకాలన్నీ స్వాధీనం చేసుకున్నారు…
ఉపా చట్టం పెట్టడం అంటే చాలా తీవ్రమైన నేరారోపణే… సోదాల్లో సీతారాం ఏచూరి ఆఫీసును కూడా వదల్లేదు… తన స్టాఫ్ బంధువు కూడా న్యూస్‌క్లిక్ అనబడే చైనా ప్రాయోజిత దేశవ్యతిరేక కుట్రలో భాగస్వామి అట… సోవాట్, సీతారాం ఏచూరి అయితేనేం, తనకు ఇమ్యూనిటీ, మినహాయింపులు ఏమీ ఉండవు కదా… భారత దేశ ప్రత్యర్థి దేశమైన చైనాకు తొత్తు పార్టీకి హెడ్ కదా… మోడీ ప్రభుత్వం చర్య కాబట్టి వెంటనే ఇండియా అనబడే విపక్ష కూటమి ఖండించింది… అంటే చైనా ప్రాయోజిత కుట్రలకు భారతీయ విపక్షం గుడ్డిగా మద్దతునిస్తోందా..? మోడీ యాక్షన్ కాబట్టి అది దేశవ్యతిరేక కుట్ర అయినా సరే సమర్థించాలా..?
Ads
మోడీలు వస్తారు, పోతారు… కానీ దేశం ముఖ్యం కాదా..? చాలా కీలకమైన ప్రశ్న ఏమిటంటే… దాదాపు అన్ని పాత్రికేయ సంఘాలూ తీవ్రంగా ఖండించాయి… ఎందుకు..? అది పత్రికా సంస్థ కాబట్టి, ప్రభుత్వం విరుచుకుపడుతోంది కాబట్టి ఖండించాలా..? జర్నలిస్టు ముసుగు ఉంటే చాలు, వాళ్లు ఏం చేసినా పాత్రికేయ సంఘాలు సమర్థించాలా..? అసలు పాత్రికేయ సంఘాలే వామపక్షాల ఆధీనంలో ఉన్నాయి కదా… ఎడిటర్స్ గిల్డ్ సహా అన్ని సంఘాలూ ఆ ఎర్రబాటలోనే ప్రయాణించాలా..?
గుర్తుందా..? ఆమధ్య ఉత్తరప్రదేశ్‌లో ఓ అత్యాచార సంఘటనను గోకి రెచ్చగొట్టడానికి చాలామంది ప్రయత్నించారు… ఢిల్లీలో ఉండే ఓ కేరళ జర్నలిస్టు తన తోటి పీఎఫ్ఐ కార్యకర్తలతో కలిసి యూపీ వెళ్తే యోగి ప్రభుత్వం పట్టుకుపోయి జైలులో పారేసింది… దాని మీద ఎడిటర్స్ గిల్డ్ సహా జర్నలిస్టు సంఘాలు గగ్గోలు పెట్టాయి… తీరా చూస్తే తను యాక్టివ్ జర్నలిస్టే కాదు, ఢిల్లీలో పీఎఫ్ఐ యాక్టివిస్టు… ముసుగు జర్నలిజం… సో, జర్నలిస్టు అనే ముసుగు ఉంటే చాలు, ఇక జర్నలిస్టులందరూ నెత్తిన మోయాలా..? జర్నలిస్టులకు ఈ దేశ చట్టాల నుంచి ఏమైనా మినహాయింపు ఉందా..?
ఆమధ్య ది హిందూ పత్రికలో పెద్ద పెద్ద ఫుల్ పేజీ ఆర్టికల్స్ కనిపించాయి… అవి చైనా ఇచ్చింది… అంత డబ్బు మన ప్రత్యర్థి దేశం నుంచి వస్తే అంతటి పత్రిక ఎందుకు యాక్సెప్ట్ చేయాలి..? మన దేశం అనే సోయి, బుర్ర లేకపోతే ఎలా..? అదీ సీపీఎం బాపతు పత్రికే కదా… కళ్లుమూసుకుని ఆ డబ్బు తీసుకుంది… చాలా మీడియా సంస్థలు మోడీకి, బీజేపీకి, ఎన్‌డీయేకు వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి… వాటన్నింటినీ మూసేయడం లేదు కదా మోడీ సర్కారు… ఈ న్యూస్‌క్లిక్‌పైనే ఎందుకు..? అది కదా ఆలోచించాల్సింది…
ఏమైనా ఆధారాలున్నాయా..? పత్రికా స్వేచ్ఛపై గొడ్డలిపెట్టు వంటి పడికట్టు పదాలు చాలా మాట్లాడతారు… వీళ్లు ప్రేమించి, భజనలు చేసే ఆ చైనాలో పత్రికల పరిస్థితి ఏమిటో చెబుతారా..? ప్రజాస్వామిక పోకడలు అంటేనే చైనా ప్రభుత్వానికి ఏవగింపు… ఇక్కడ మాత్రం నీతులు చెప్పిస్తుంది తన తొత్తు శక్తులతో… ప్రశ్నించే ప్రతివాడూ చైనాలో మాయమైతాడు… మనవాళ్లు గుడ్డిగా తలలూపుతారు… మరి మన చైనా కదా… ఏది చేసినా ముద్దే… ఎటొచ్చీ మనవే బానిస బుద్ధులు…
ఒక వెబ్‌సైట్‌కు ఏడాదిలో చైనా 20 కోట్లు ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు… చైనా నుంచి ఇదోరకం పరోక్ష యుద్ధం… ఈరోజుల్లో యుద్ధం అంటే సరిహద్దుల్లో జవాన్లు పోరాడటం కాదు… కరోనా వంటి జీవాయుధాలు, వెదర్ మోడిఫికేషన్లు, అంతరిక్ష యుద్దాలు, వెబ్ హ్యాకింగులు, ఆర్థిక యుద్దాలు, తీవ్రవాదానికి మద్దతు… ఇలా యుద్దాల స్వరూపమే మారిపోతోంది… ఇలాంటి మీడియాతో మన దేశం మీద వ్యతిరేకతను పెంచడం కూడా చైనా సాగించే యుద్ధంలో ఓ భాగం… ఇక్కడ అశాంతి రేగాలి… అదే లక్ష్యం… సోకాల్డ్ కమ్యూనిస్టు లింక్‌డ్ పార్టీలు, తీవ్రవాద గ్రూపులన్నీ అందుకే న్యూస్‌క్లిక్‌కు మద్దతుగా వెంటనే రంగంలోకి దిగారు… (ఈ వెబ్‌సైట్ మీద గతంలోనే ఈడీ దాడులు జరిగాయి… ప్రస్తుత దాడులు దానికి ఫాలోఅప్ యాక్షన్ మాత్రమే…)
Share this Article