చాలామందికి అర్థం కావడం లేదు… హఠాత్తుగా కరెంటు బిల్లుల్ని పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, ఏ యూపీఐ ద్వారా గానీ, బ్యాంకుల యాప్స్ ద్వారా కూడా చెల్లించడానికి వీల్లేదనే వాట్సప్ వార్తలు… ఇన్నాళ్లూ రకరకాల పేమెంట్ యాప్స్ ద్వారా బిల్లులు పే చేసేవాళ్లు వినియోగదారులు…
కొత్త బిల్లు జనరేట్ కాగానే అలర్ట్ చేసేవి అవి… డ్యూ డేట్స్ చెప్పేవి… అంతెందుకు..? చాలామంది బిల్లులు సమయానికి పే చేయకపోతే ఇబ్బందులు ఎదురవుతాయనే భావనతో ఆటో పే ఆప్షన్ పెట్టుకునేవాళ్లు… అంటే కొత్త బిల్లు జనరేట్ కాగానే ఆటోమేటిక్‌గా మన వ్యాలెట్ నుంచి లేదా లింకై ఉన్న బ్యాంకు అకౌంట్ నుంచి చెల్లించబడేవి…
లేకపోతే మనం మరిచిపోవడం, లైన్‌మెన్ నిర్దాక్షిణ్యంగా కనెక్షన్ కట్ చేయడం, తరువాత వాళ్ల చుట్టూ తిరగడం… ఈ బాధలు లేకుండా ఆటో పే ఆప్షన్ బెటర్… చాలామంది ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ఛార్జీలు, టెలికాం బిల్లులు గట్రా చాలా యుటిలిటీలకు బిల్లుల్ని తమ బ్యాంకు ఖాతాలకు లింక్ చేసి లేదా పేమెంట్ యాప్స్‌కు లింక్ చేసి ఆటో పే పెట్టేస్తుంటారు…
Ads
ఆటో పే గాకుండా గడువు తేదీ రాగానే ఎస్ఎంఎస్ రాగానే లేదా ఆ పేమెంట్ యాప్స్‌లో పాపప్ కనిపించగానే పే చేసేవాళ్లూ బోలెడు మంది… మరిప్పుడు తెలంగాణ డిస్కమ్స్ (TGSPDCL ప్రత్యేకించి…) బిల్లులను ఈ పేమెంట్ యాప్స్ ద్వారా తీసుకోబడవని చెబుతున్నాయి… అదీ ఎప్పుడు చెప్పాయి..? జూలై ఒకటిన… అంటే కొత్త బిల్లులు జనరేట్ కావడం స్టార్టయ్యే టైమ్‌కు… ఎక్కడ చెప్పాయి..?
ట్వీట్ చేసి, చేతులు దులుపుకున్నాయి… ఎందరు రెగ్యులర్‌గా ఎక్స్ పోస్టులు చదువుతారు..? చదివినా ఈ కరెంటు డిస్కమ్ పోస్టులు అందరికీ ఎందుకు కనిపిస్తాయి..? ఈ సోయి కరెంటు ఉన్నతాధికారులకు ఎందుకు లోపించింది..? కనీసం పత్రిక ప్రకటనలు ఎందుకు ఇవ్వలేదు..? పైగా ఆర్బీఐ ఆదేశాల మేరకు అని రాస్తున్నారు…
అంటే… ఇందులో మా నిర్ణయమేమీ లేదు, మా ప్రమేయం ఏమీ లేదు… అంతా ఆర్బీఐదే అని తోసేయడం… నిజానికి ఆర్బీఐ ఏం చెప్పింది..? భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అని కొత్తగా తీసుకొచ్చింది… ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు యుటిలిటీని ఒక్క ప్లాట్‌ఫారమ్ మీదకు తీసుకురావడం దాని ఉద్దేశం…
మనం బిల్లు పే చేయగానే డబ్బు ఒక సెంట్రల్ యూనిట్‌కు వెళ్లి, అక్కడి నుంచి సదరు యుటిలిటీకి వెళ్తుంది… మనకు కన్‌ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది… ఈ బిల్లుల చెల్లింపు యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ పరిధిలోకి బ్యాంకులు, పేమెంట్ యాప్స్, అనేక పబ్లిక్ సర్వీస్ యుటిలిటీలు, కస్టమర్లు వస్తారు… ఆ బీబీపీఎస్ పరిధిలోకి దేశంలోని 94 పవర్ యుటిలిటీలు చేరాయి ఎప్పుడో… కానీ తెలంగాణ సదరన్ డిస్కమ్ ఉన్నతాధికారులు నిద్రలేవలేదు… అందులో చేరలేదు…
సింపుల్‌గా… నో పేటీఎం, నో ఫోన్‌పే, నో గూగుల్‌పే, నో బ్యాంక్స్… మా వెబ్‌సైట్‌కు వచ్చి పే చేయండి, మా అఫిషియల్ యాప్ ద్వారా పే చేయండి, లేదా మా కలెక్షన్ సెంటర్లలో పే చేయండి అని ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ పారేసి చేతులు దులుపుకుంది… దీన్ని నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం అని కూడా అంటారు… ఈ కరెంటోళ్లు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముంచేస్తారు..!! ఇప్పటికే కరెంటు లభ్యత, కోతలు, సర్వీస్ మీద జనంలో అసంతృప్తి బాగా పెరిగిపోయిందని ప్రభుత్వంలో ఎవరైనా గమనిస్తున్నారా అసలు..!!
Share this Article