.
తమిళనాడు ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థి లీమా రోజ్… తమిళనాడు ఎన్నికలు రసవత్తరంగా మారాయి. హీరో విజయ్ పెట్టిన కొత్త పార్టీ ఈసారి రంగంలో వుంది! యువ అభ్యర్థులు ఎక్కువ మంది పోటీపడుతున్నారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతున్న వారిలో అత్యంత ధనిక అభ్యర్థి మహిళ కావడం విశేషం!
ఆవిడే లీమా రోజ్. తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నా డిఎంకె పార్టీ నుంచి బరిలో వున్నారు. ఆమె కుటుంబ ఆస్థి విలువ అక్షరాలా ఐదు వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు. ఆమె వ్యక్తిగత ఆస్థి 1049 కోట్లు!
Ads
లాటరీ టికెట్ల విక్రయ సంస్థ అధినేత శాంటియాగో మార్టిన్ ఆమె భర్త. లీమా రోజ్ వయసు 58. ఇటీవలే ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. అన్నాడిఎంకె పార్టీలో చేరారు. పార్టీకి భారీ విరాళం కూడా ఇచ్చారు.
- నామినేషన్ అఫిడవిట్ లో ఆమె పేర్కొన్న ఆస్థుల వివరాల ప్రకారం చూస్తే… 19 కిలోల బంగారం, 1217 క్యారట్ల వజ్రాభరణాలు, 13 కిలోల వెండి, 33 గ్రాముల ప్లాటినం ఉన్నట్లు సమాచారం. 139.63 కోట్ల చరాస్థులు, 909.94 కోట్ల స్థిరాస్థులు ఉన్నాయి.
సహజంగా డబ్బున్నోళ్లకు కొన్ని అప్పులు ఎలాగూ ఉంటాయి కాబట్టి ఆమెకు కూడా 8.57 కోట్ల అప్పు ఉందట! భర్త మార్టిన్ పేరిట 4100 కోట్లు పైచిలుకు ఆస్థులు వున్నాయట! ఆయన పేరిట నగలు చూస్తే… 281 గ్రాములు బంగారం, 9.83 క్యారెట్ల వజ్రాలు, 21 కిలోల వెండి, 321 గ్రాములు ప్లాటినం ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు.
ఇంతా చేస్తే ఆమె చదివింది ఆరవ తరగతి మాత్రమే! పైగా ఆమెపై నాలుగు కేసులు కూడా వున్నాయట! లాల్గుడి ఓటర్లు ఆమెపై పెద్ద ఆశలే పెట్టుకున్నట్లు తెలుస్తోంది! ఓటుకు కనీసం మూడు నుంచి ఐదు వేల వరకు ఇస్తున్నదని బెట్టింగులు వేసుకుంటున్నారట! మొత్తానికి లీమా గెలుపు ఖాయం అంటున్నారు.
చట్టసభలోకి అడుగు పెట్టనివ్వండి. లాల్గుడి నియోజకవర్గం ఎలా అభివృద్ధి జరుగుతుందో చూడండి” అని లీమా రోజ్ అంటున్నారు. ఆమె ప్రచార పర్వంలో వేలాదిమంది యువతకు ఉపాధి లభించింది.
చదువు లేకున్నా డబ్బు వుంది కాబట్టి ఇలాంటి వారిని గెలిపిస్తే ఆ నియోజకవర్గం బాగుపడుతుంది. ఆమె మార్టిన్ చారిటీ ఫౌండేషన్ పేరిట ఎన్నో ఏళ్లుగా సేవ కూడా చేస్తుండటం విశేషం. – డా. మహ్మద్ రఫీ
(భార్య అన్నాడీఎంకే, కొడుకు బీజేపీ, అల్లుడు టీవీకే... మార్టిన్ లాటరీ కథే వేరు... విడిగా చెప్పుకుందాం)
Share this Article