మూడు వార్తలు… 1) హుందాగా వైదొలగిన కేసీయార్, ట్రెండ్ తెలియగానే రాజీనామా, సామాన్య పౌరుడిలా ట్రాఫిక్‌లో ఆగుతూ ఫామ్ హౌజ్‌కు ప్రయాణం, గన్‌మెన్ కూడా లేకుండానే ఒంటరిగా బయటకు… అని నమస్తే తెలంగాణలో ఓ వార్త…
2) కేసీయార్ సభకు వస్తారా..? సభలో రేవంత్ రెడ్డి మొహం చూస్తారా..? గెలిచిన స్థానానికీ రాజీనామా చేస్తారేమో..? అసలు రాజకీయాల్నే వదిలేస్తారేమో..? అని ఓ డిజిటల్ పత్రిక (దిశ కావచ్చు) లో ఓ వార్త…
3) కేటీయార్ పార్టీ ముఖ్యులతో భేటీ కాబోతున్నాడు… పార్టీ ఓటమిపై పోస్ట్ మార్టం నిర్వహించనున్నాడు… కామారెడ్డిలో కేసీయార్ ఓటమి, పలువురు మంత్రుల అపజయాలను కూడా సమీక్షిస్తాడు అని వే2న్యూస్ అనే షార్ట్ న్యూస్ యాప్ వార్త…
Ads
నిజంగా హుందాగా ఓటమిని స్వీకరించాడా కేసీయార్..? లేదు… ఫలితాలు వచ్చాక కేటీయార్ మాత్రమే స్పందించాడు… కేసీయార్ సైలెంట్… ప్రజాతీర్పును గౌరవిస్తున్నాననే ఓ మర్యాదపూర్వక ప్రకటన కేసీయార్ నోటి వెంట వచ్చి ఉండాల్సింది… ఇన్నేళ్ల రాజకీయాలు, వైభోగం ప్రజలు ఇచ్చినవి కావా..? వాటికి కృతజ్ఞతలు తెలుపుకునే పనిలేదా..? ప్రజల పట్ల అణకువ, విధేయతను కనబరచకపోతే ఇక రాజనీతిజ్ఞత ఏమున్నట్టు..?
అంతేకాదు… తను గవర్నర్ దగ్గరకు వెళ్లి స్వయంగా రాజీనామా ఇస్తే బాగుండేది… తను గవర్నర్‌ను నానారకాలుగా అవమానించాడు కరెక్టే… కానీ సందర్భానికి అనుగుణంగా వ్యవహరించాలి కదా… ఆ ఇద్దరూ వ్యక్తులు కారు, వ్యవస్థలు- పదవులు… అది మరిచిపోతే ఎలా..? ఓఎస్డీతో రాజీనామా పంపించాడు… 4న కేబినెట్ భేటీ అన్నాడు కదా మొన్న… సరే, కౌంటింగ్ ఏజెంట్లు అదే ఉత్సాహంతో పనిచేయడానికి ఇలాంటి మేకపోతు గాంభీర్యాలు ఉపయోగపడతాయేమో…
కేబినెట్ భేటీ ఉండదు, సరే… కనీసం అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యులతో భేటీ వేసి ఉండాల్సింది… ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిద్దాం, అదే సమయంలో ప్రజలు నిర్దేశించిన ప్రతిపక్ష పాత్రనూ సమర్థంగా పోషిద్దాం, ప్రజల్లో ఉందాం, ప్రజలతో ఉందాం అని చెప్పి ఉండాల్సింది… అదీ జరగలేదు… సరికదా, తనకు బదులు కేటీయార్ ఆ పాత్రను స్వీకరించాడు… గుడ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కాబట్టి తను ఆ పనిచేసినా తప్పులేదు… తప్పదు కూడా…
కానీ తను నిర్వికారంగా ఫామ్ హౌజ్‌కు వెళ్లిపోవడం, గవర్నర్ మొహం చూడకపోవడం, ప్రజలకు థాంక్స్ చెబుతూ ప్రకటన చేయకపోవడం, పార్టీ ముఖ్యులతో కేటీయార్ భేటీ… ఇవన్నీ గమనిస్తుంటే… తను అసెంబ్లీకి రాడేమో అనే సందేహాలు సహజం… తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సచివాలయానికి రాలేదు… ఇక అసెంబ్లీకి వస్తాడా..? అసలు రాజకీయాల్లో ఉంటాడా అనే సందేహాల్ని, సంకేతాల్ని ప్రజలకు పంపిస్తున్నాడా..? సీఎంగా రేవంత్ మొహం చూడాలని లేకపోవచ్చు, కానీ ప్రజలు నిర్దేశించిన ప్రతిపక్ష పాత్ర మాటేమిటి..? వైరాగ్యమా..?
సరే, అదీ కేటీయార్‌కే అప్పగిస్తాడా..? అంటే ఇక్కడా వారసత్వ ప్రకటన సైలెంటుగా జరిగిపోయిందా..? ఎన్నికల ప్రసంగాల్లో తనే అన్నాడు… ‘‘నాకేమీ కావాలి ఇంకా, తెలంగాణ తెచ్చిన ఘనత దక్కింది’’ అని… పదేళ్లు ముఖ్యమంత్రిగా అధికారమూ ఇచ్చారు… అపారమైన వైభోగాన్ని ఇచ్చింది తెలంగాణ సమాజం… గెలిస్తేనేమో నా తెలంగాణ, నా ప్రజలు… ఓడిస్తే ఇక మొహం చాటేయాలా..? ప్రతిపక్ష పాత్రలో ఉండి, ప్రభుత్వం గతి తప్పకుండా కాపలా కాయాలని కదా తెలంగాణ నిర్దేశించింది… ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటే ఎలా..? హేమిటో… కేసీయార్ అస్సలు అర్థం కాడు…!! (పైన ఫోటో అప్పుడెప్పుడో కేటీయార్, రేవంత్ సరదాగా మాట్లాడుకుంటున్నప్పటిది… ఏమో ఈ ఇద్దరే ఇప్పుడు సీఎం, ప్రతిపక్ష నేత అవుతారేమో…)
Share this Article