బీఆర్ఎస్ బీజేపీతో వచ్చే లోకసభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉంది… కేటీయార్ ఆసక్తిగా ఉన్నాడు, బీజేపీ-కాంగ్రెస్‌ల నుంచి పార్టీని రక్షించుకోవాలంటే బీజేపీతో కలిసి నడవకతప్పదు అని తన ఆలోచన… కానీ కేసీయార్ దానికి సుముఖంగా లేడు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లింల వోట్లు పోతాయి, ఇన్నేళ్లూ మనల్ని నిలబెట్టింది ఆ వోట్లే అని కేసీయార్ విముఖత… పొత్తు మాత్రమే కాదు, కేటీయార్ లోకసభకు పోటీచేస్తాడు అని ఊహాగానాలు సైతం స్టార్టయ్యాయి…
ఏమో, నా మొహం చూడటం ఇష్టం లేక, కేసీయారే లోకసభకు వెళ్తాడేమో అనేది రేవంత్ రెడ్డి సందేహం… కేసీయార్ విశ్లేషణలోనే లోపం ఉంది… ఒక ప్రశ్న.. యూపీలో ముస్లింలు లేరా..? డామినేటింగ్ పాపులేషన్ కదా, మరి అక్కడ బీజేపీ ఎలా గెలుస్తోంది..? కేసీయార్ ఆలోచనల్లో మరో లోపం ఏమిటంటే..? జాతీయ పార్టీ ఏర్పాటు, పార్టీ పేరు నుంచి తెలంగాణ పదం తొలగింపు… కేసీయార్ క్రెడిబులిటీ అన్ని పార్టీల అధినేతలకూ తెలుసు… ఎవరూ దగ్గరకు రానివ్వరు, పైగా తెలంగాణ ప్రజానీకం తనను తెలంగాణ కోసమే వర్క్ చేయాలని కోరుకుంటోంది… దాని బదులు ఆకాశంలోకి అడుగులు వేసే ప్రయత్నం చేశాడు…
తీరా చూస్తే అసలు పునాదే మేడిగడ్డ బరాజ్‌లాగా దస్కిపోయింది… అధికారం పోయింది… ప్రజలకు మొహం చూపే పరిస్థితి లేదు… ఇప్పటికిప్పుడు కేటీయార్ గానీ కేసీయార్ గానీ బీజేపీతో పొత్తు పెట్టుకుని, లోకసభకు పోటీచేసి, ఎన్డీయేలో చేరి, ఏదో ఓ కేంద్ర మంత్రి పదవి పొందితే… మరిక్కడ పార్టీని రోజూ నడిపించేదెవరు..? మొన్నటిదాకా బొందుగాళ్లు, శూర్పణఖ జన్మభూమి, అంతుచూస్తాం వంటి నానాతిట్లూ తిట్టి, మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మరింత నగుబాటు కాదా..? ఇప్పటిదాకా బీజేపీతో లోపాయికారీ దోస్తీనే జనం చీదరించారు… ఇప్పుడిక నేరుగా పొత్తు పెట్టుకుంటే..?
Ads
బీఆర్ఎస్ పరిస్థితి ఏమున్నా సరే, ఒకవేళ పొత్తు కుదిరితే అది బీజేపీకి చాలా నష్టం… మొన్నటి కేసీయార్ వ్యతిరేక గాలుల్లో మంచి సీట్లు సంపాదించి, తెలంగాణలో వేగంగా బలపడే పరిస్థితి ఏర్పడి ఉండేది… బీజేపీ చేజేతులా చెడగొట్టుకుంది… ఇప్పుడిక కేసీయార్‌తో నేరుగా దోస్తీ చేస్తే అది పార్టీ కి మరింత నష్టం… సొంతంగా ఎదిగే సీన్ లేకుండా పోతుంది… ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్ తోక, హైదరాబాదులో బీఆర్‌ఎస్‌కు బీజేపీ తోక… అవునూ, బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్‌గా పునఃనామకరణం చేసుకుని, తెలంగాణ చుట్టూ కట్టుదాటని గీతలు గీసుకుంటుందా బీఆర్ఎస్…!!
పోనీ, ఇది సాకారమైతే, మజ్లిస్ గనుక కాంగ్రెస్ వైపు మళ్లితే (వాళ్లకు అధికారంలో ఉన్నవాళ్లు దోస్తులు) అది రేవంత్ రెడ్డికే నయం… మెజారిటీకి అత్తెసరు సీట్లే ఎక్కువ ఉన్న నేపథ్యంలో మజ్లిస్ సీట్లు కూడా కలిస్తే అది అదనపు బలం, కాంగ్రెస్ అధికారం కాస్తయినా సుస్థిరం అవుతుంది… బీజేపీ ఇక్కడ ఓ షిండేను వెతికి, కేసీయార్ సపోర్టు కూడా తీసుకునే అవకాశాలకు తెరపడుతుంది… సో, ఒకవేళ కేసీయార్ గనుక బీజేపీ శిబిరంలో చొచ్చితే అది రెండు పార్టీలకూ నష్టమే… పైగా రేవంతుడికే నయం… ఐనా రాజకీయాల్లో ఒకటి ప్లస్ ఒకటి ఎప్పుడూ రెండే కానక్కర్లేదు… వేచి చూడాలిక…
అన్నట్టు… ఏపీలో బీజేపీ గనుక తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే అది తెలుగుదేశానికే నష్టం, ఐనా సరే బీజేపీ ఒత్తిడి చేస్తే తప్పదేమో అన్నట్టుగా ఆంధ్రజ్యోతి ఎండీ రాసుకొచ్చాడు ఈరోజు… అబ్బో, బీజేపీయే చంద్రబాబు దోస్తీ కోసం ఏదో వెంపర్లాడుతున్నట్టు..?! మరి ఇదే చంద్రబాబు అదే మోడీ చల్లనిచూపు కోసం ఇన్నేళ్లుగా ఎందుకు విశ్వప్రయత్నం చేస్తున్నట్టు..? బట్, ఈ చంద్రబాబు కోసం, ఈ పవన్ కోసం బీజేపీ గనుక వాళ్లతో దోస్తీ చేస్తే… అంతిమంగా అది బీజేపీకే నష్టం… ఇప్పటికే దాని ఉనికి ప్రశ్నార్థకం… ఈ పొత్తుకు గనుక సై అంటే..? ఏముంది..? యథా కాంగ్రెస్ తథా బీజేపీ…!! చివరగా… అప్పట్లో చంద్రబాబు మోడీ పట్ల అత్యంత అవమానకరంగా వ్యవహరించాడు… కేసీయార్ అంతకుమించి… మోడీకి మతిమరుపు లేదనే ప్రజల నమ్మకం…!!
Share this Article