కాస్త వెనక్కి పోదాం… ఓ మూర్ఖ నియంత జయలలిత తత్వాన్ని, పాలననూ కాసేపు విస్మరిద్దాం… అతిరథ మహారథుల పీచమణిచిన ఆమె టెంపర్‌ను కాసేపు పక్కనపెడదాం…. కానీ అన్యాయంగా ఆమె ప్రాణాలు తీశారు… అరెరె, కోట్ల మంది తమిళజనమే కాదు, దేశమంతా నమ్ముతోంది… ఆమె హాస్పిటల్‌లో ఉన్నన్నిరోజులూ నడిచిన డ్రామాలు అందరూ చూశారు కదా… అసలు ఎవరు ఆమె ఉసురుపోసుకున్నది..,? తన దేహంలో ఓ భాగమని నమ్మి, చేరదీసిన నెచ్చెలి శశికళా..? తన విశ్వాసపాత్రుడు అని నమ్మి ఏకంగా సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టిన పన్నీర్ సెల్వమా..? లేక ఇంకేదైనా గ్యాంగు ఉందా..? ఉంటే వాళ్లెవరు..? అసలు వేల కోట్ల రూపాయల ఆమె ఆస్తులు ఏమయ్యాయి..? ఎవడికి దక్కినంత వాడు దోచుకుని, దాచుకుని, బయటికి శుద్ధపూసల్లా నటిస్తున్నారా..? నిజానికి ఆమె ఆస్తులు ఏవేవి..? ఎక్కడెక్కడ ఉన్నాయి..? ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నాయి..? ఆమె కనిపిస్తే దూరం నుంచే సాగిలబడి, ఆమె కనుచూపు తగిలితే చాలు జన్మ ధన్యమని ఏడ్చిన అన్నాడీఎంకే అకశేరుకాలు ఇవేమైనా పట్టించుకున్నాయా..? కాదు, కాదు, అసలు వాళ్లే ఆస్తుల్ని కాజేశారా..? వీటికి జవాబులు ఇక ఎప్పటికీ దొరకవు..? ఆమె మహారాణిలా బతకొచ్చుగాక… జీవనాంతమున ఓ అనాథ… దిక్కుమాలిన మరణం… అది నిజం… అయితే..?
ఆమె సంపాదించి పెట్టిన అధికారాన్ని సొమ్ము చేసుకుని, బతికిన ఒక పన్నీర్ సెల్వమో, ఒక ఎడప్పాడి పళినిస్వామో… ఆమె మరణం మిస్టరీని ఎందుకు తేల్చలేదు..? ఆమె ఆస్తులన్నీ ఓ కొలిక్కి ఎందుకు తీసుకురాలేదు..? అసలు శశికళ ఎందుకు పట్టించుకోవడం లేదు ఇప్పుడు..? అంతా అంతఃపుర రహస్యం… ఇప్పుడు మళ్లీ ఇది తమిళ రాజకీయ తెరమీదకు వచ్చిందీ, ఎందుకు జనంలో చర్చనీయాంశమైందీ అంటే… నిన్న అసెంబ్లీలో అన్నాడీఎంకే, డీఎంకే సభ్యుల నడుమ హాట్ హాట్ వాదనలు, విమర్శలు సాగాయి… అన్నాడీఎంకే వాకౌట్ చేసింది… వాళ్ల ఆరోపణ ఏమిటయ్యా అంటే..? ‘‘జయలలిత చనిపోయాక, ఆమెకు చెందిన కొడనాడు ఎస్టేట్ ఇంట్లో దోపిడీలు సాగాయి… వాచ్‌మెన్‌ను చంపేశారు… ఆ కేసులో పళనిస్వామిని, ఇతర అన్నాడీఎంకే నేతల్ని ఫిక్స్ చేసేందుకు స్టాలిన్ ప్రయత్నిస్తున్నాడు…’’ ఇదీ ఆరోపణ… అసలు ఈ కేసు గుర్తుందా మీకు..? పైన కనిపిస్తున్న ఫోటోయే జయలలితకు చెందిన 945 ఎకరాల పెద్ద ఎస్టేట్… ఆమె ఆస్తుల వ్యవహారాలు గట్రా అక్కడే ఉంటాయని అనేవాళ్లు… ఆమె మరణించాక దోపిడీ జరిగింది… ఏం పోయిందో ఎవరికీ తెలియదు… నీలగిరి పోలీసులు పేరుకు దర్యాప్తు చేస్తున్నారు కానీ అడుగు కదిలింది లేదు… ఒక యాక్సిడెంట్ జరిగింది, ప్రధాన నిందితుడి భార్య, బిడ్డ చచ్చిపోయారు… తరువాత సేమ్, అలాగే మరో ప్రమాదం… మరో నిందితుడు మరణించాడు… అంటే ఏదో పెద్ద గ్యాంగే వాళ్ల వెనుక ఉన్నట్టే కదా… నాలుగేళ్ల తరువాత ఈనెల 27న ట్రయల్ కోర్టులో విచారణ కీలకదశకు రానుంది… ఇదీ నేపథ్యం…
Ads
ఈ చార్ట్ అప్పట్లో ది వీక్ పత్రిక ఉజ్జాయింపుగా క్రోడీకరించిన జయలలిత ఆస్తులు… లెక్కకు రానివి, బినామీవి, శశికళ చేతుల్లో ఉన్నవీ గట్రా వేరే ఉండవచ్చు… ఇప్పుడు శాయన్ అనే నంబర్ టు నిందితుడికి నోటీసులు జారీ అయ్యాయ్… స్టేట్‌మెంట్లు తీసుకున్నారు పోలీసులు… కావాలని స్టాలిన్ ముఖ్య అన్నాడీఎంకే నేతల్ని బుక్ చేస్తాడనేది ఆ పార్టీ ఆందోళన… నిజానికి స్టాలిన్ రాజకీయ ప్రతీకారాలు, కక్షల జోలికి పోవడం లేదు కానీ, ఒకవేళ నిజంగానే జయలలిత కేసులో ఈపీఎస్ (పళని), ఓపీఎస్ (పన్నీర్)లను బుక్ చేస్తే తనకు రాజకీయంగా చాలా ఫాయిదా… ప్రస్తుతం రాష్ట్రంలో తనకు బలమైన ప్రతిపక్షం లేదు, దాన్ని కూడా కేసీయార్ తరహాలో తొక్కేస్తే మరింత సేఫ్, స్టెబిలిటీ… నాకు అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవనీ, ఈ కొడనాడు కేసు సంగతి తేలుస్తానని ఎన్నికల ప్రణాళికలో చెప్పాను కాబట్టి నేను జనానికి జవాబు చెప్పాల్సి ఉందనీ స్టాలిన్ అంటున్నాడు… రెండేళ్ల క్రితం తెహెల్కా మాజీ ఎడిటర్ ఒకాయన ఓ వీడియో విడుదల చేస్తూ పళనిస్వామిని నిందితుడిగా ఆరోపించాడు… అప్పుడు స్టాలిన్ గవర్నర్‌ను కలిసి సమగ్ర విచారణ జరగాలనీ, ముందు సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు… సో, ఈ కేసుకు చాలా ఇంపార్టెన్స్ ఉంది… సరే, అది పక్కన పెడితే… నిజంగా ఆమె మరణం వెనుక మిస్టరీ తేలేదెలా..? వోకే, స్టాలిన్ కూడా ఫాఫం, ఆమె అనారోగ్యంతోనే మరణించిందని నమ్ముతున్నాడూ అనుకుందాం… మరి ఆమె ఆస్తుల సంగతేమిటి..?
(ఇది హైదరాబాద్, జీడిమెట్లలోని జయలలిత ఫామ్ హౌజ్ కమ్ ఎస్టేట్… అప్పట్లో వీక్ ప్రచురించిందే… ఇప్పుడు దీని గతి ఏమైంది అని అడక్కండి, కళ్లు పోతాయ్…) హిందూ వారసత్వ చట్టాల ప్రకారం… ఆమెకు భర్త లేడు, పిల్లల్లేరు… ఇక తండ్రి లేడు… తండ్రి వారసులు ఒకరిద్దరు ఉన్నారు, ఆస్తుల్లో వాటాల కోసం కొట్లాడుతున్నారు… ఆమె వీలునామా ఉందా, లేదా… అదేమైందో కూడా ఎవరూ చెప్పలేరు… శశికళకు అన్నీ తెలుసు, కానీ ఆమె నోరు విప్పదు, ఆమెతో నిజాలు చెప్పించాలనే సోయి, సంకల్పం, ఆలోచన, ప్రయత్నం డీఎంకే సర్కారుకు లేదు, అన్నాడీఎంకేకు అసలే లేదు… నిజంగానే స్టాలిన్ ఆమె ఆస్తులపై ఓ జుడీషియల్ ఎంక్వయిరీ వేసి, వారసులెవరూ లేకపోతే సర్కారే స్వాధీనం చేసుకోవచ్చు కదా… ఆమే లేనప్పుడు ఆమె ఆస్తుల్ని సర్కారు స్వాధీనం చేసుకున్నా ప్రజలు ఎవరూ వ్యతిరేకించరు కదా… మరెందుకు చేయడు..? నిజానికి అన్నాడీఎంకే ఆరోపిస్తున్నట్టు… ముందుగా జయలలిత బాపతు కేసుల్లో మెల్లిమెల్లిగా అన్నాడీఎంకే నేతల్ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడా..? ఆమె ఆస్తులతో అదే పోయెస్ గార్డెన్ భవనంలో ఓ ట్రస్టు పెట్టొచ్చుగా… జయలలిత ఆత్మ శాంతిస్తుంది…!!
Share this Article