బిగ్‌బాస్ పుణ్యమాని గంగవ్వకు ఇల్లొచ్చింది… బంగారం కొన్నది… సొహెల్‌కు మస్తు పైసలొచ్చినయ్… అభిజిత్‌కు పైసలతోపాటు కప్పొచ్చింది… అవినాష్, సొహెల్, మెహబూబ్, దివి, మోనాల్, అభిజిత్, అరియానా, అఖిల్… మస్తు సినిమా అవకాశాలు వస్తున్నట్టు ధూంధాం ప్రచారం సాగుతోంది… అయిదారు రోజులుగా మీడియా, సోషల్ మీడియా వీళ్లకొచ్చే అవకాశాలపైనే హోరెత్తిస్తున్నాయి… వాళ్లు కూడా ఈ పాపులారిటీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు… కానీ… హొవ్, హొవ్… డుర్ డుర్… కాస్త పగ్గాలు వేయండి… మబ్బుల్లో నుంచి కాస్త నేలమీదకు దిగిరండి… ఇందులో కూడా బిగ్‌బాస్ టీం తెలివితేటలున్నాయి…
మీకు గుర్తుందా..? బిగ్‌బాస్ నాలుగో సీజన్‌కు ముందు పత్రికల్లో, సైట్లలో విరివిగా వార్తలొచ్చేవి… ఒరేయ్, ఈ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు, విజేతలకు ఏం దక్కిందిరా..? ఉన్న ఇమేజ్ నాశనం చేసుకున్నారు అంటూ విశ్లేషణలు సాగేవి… అదంతా ఎరేజ్ కావడానికి, షో ఇమేజ్ పెంచడానికి నానా కథలు పడింది బిగ్‌బాస్ టీం… గంగవ్వను సెలెక్ట్ చేయడం దగ్గర్నుంచి… చిరంజీవి పది లక్షల వ్యవహారం దాకా… బిగ్‌బాస్ టీం భలే రక్తి కట్టించింది… ఈ సీజన్ నడిచినన్ని రోజులూ పెద్ద ఇంట్రస్టు క్రియేట్ చేయకపోయినా… ఫినాలే దగ్గరకొచ్చేసరికి బాగా హైప్, ఇంట్రస్టు క్రియేట్ చేయగలిగింది…
Ads
అన్నీ స్క్రిప్టెడే… అంతా వెల్ ప్లాన్డే… ఇక అయిదో సీజన్‌కు రంది లేదు… బోలెడంత పాజిటివ్ ప్రచారం వచ్చేసింది… ఇదే ఊపుతో అయిదో సీజన్ లాగించేయొచ్చు… అవునూ, ఈ సీజన్ కంటెస్టెంట్లకు మస్తు అవకాశాలు వస్తున్నాయి అని రాస్తున్నారు కదా… ఒకటీరెండు నెలలు ఆగండి… అప్పుడు ఓసారి రివ్యూ చేద్దాం… అంతెందుకు..? గత సీజన్ల కంటెస్టెంట్లకు ఏం దక్కింది..? హళ్లికిహళ్లి సున్నాకుసున్నా… నిజానికి బిగ్‌బాస్‌లోకి వెళ్లడం మైనస్… ఎస్, మైనస్…
శివబాలాజీ… విజేత… నో యూజ్… అర్చన, సమీర్, ముమైత్, మధుప్రియ, సంపూర్ణేష్, జ్యోతి… ప్చ్, నో యూజ్… కత్తి మహేష్‌కు బిగ్‌బాస్ ఉపయోగపడింది ఏమీ లేదు… తన దారి వేరు… హరితేజ కాస్త నయం… సింగర్ కల్పన నో యూజ్… మళ్లీ బుల్లితెర మీద కూడా కనిపించకుండా పోయింది… కత్తి కార్తీక మొన్నటి దుబ్బాక ఎన్నికప్పుడు కాస్త కనిపించింది… అంతే… ఆదర్శ్, ధనరాజ్, దీక్ష, నవదీప్… వీళ్లకూ ఏమీ యూజ్ కాలేదు…
గీతామాధురికి పాటల్లేవు… అమిత్ తివారీ అంతకుముందు చిన్నాచితకా పాత్రలు వచ్చేవి, ఇప్పుడు చాలారోజులైంది చూసి… దీప్తి జాబ్ పోయింది… గోగినేని బాబు అసలు ఈ దేశంలోనే లేడు… భానుశ్రీకి యాంకరింగు అవకాశాలు వస్తున్నాయి, పోతున్నాయి… తేజస్వికి అంతకుముందు సినిమా చాన్సులు వచ్చేవి, బిగ్‌బాస్ చేశాక అవీ పోయాయి… రోల్ రైడా, కిరీటి, దీప్తి సునయన, సంజనా అన్నే, నందిని మళ్లీ కంటికి కనిపించలేదు… ఎవరిదో గుండు గొరిగి నూతన్‌నాయుడు కేసుల్లో ఇరుక్కున్నాడు… గణేష్ పేరే మరిచిపోయారు అందరూ… కౌశల్ పేరు కొన్నాళ్లు వినిపించింది… డాక్టరేట్ల ప్రచారాలు, ప్రధాని ఆఫీసు నుంచి ఫోన్లు గట్రా మస్తు ఎత్తుకున్నారు… అదుగో సినిమా, ఇదుగో సినిమా అన్నారు… చివరకు తనకు ఉపయోగపడింది ఏమీలేదు…
రాహుల్ సిప్లిగంజ్ ఓ బెంజికారు కొన్నడు… మస్తు పార్టీలు చేసుకున్నడు… కానీ బిగ్‌బాస్ విజేతగా తన కెరీర్‌కు పెద్దగా అదనంగా వచ్చిన ఫాయిదా ఏమీలేదు… పునర్నవితో లవ్వాయణం బాపతు ప్రచారం తప్ప… అసలు ఆమెకూ పెద్ద ఫాయిదా లేదు… అంతెందుకు దాదాపు గెలిచినంత పనిచేసిన శోకముఖి… అదే శ్రీముఖికి కూడా పెద్దగా యూజ్ అయ్యింది లేదు… మస్తు పైసలొచ్చినయ్… తాజాగా జీటీవీలో యాంకర్… ఇక వేరే పనేమీ లేదు… శివజ్యోతి ఇల్లు కొనుక్కుని పద్ధతిగా టీవీలో తన కొలువు తాను చేసుకుంటోంది… జాఫర్ టీవీ మారాల్సి వచ్చింది…
బాబా భాష్కర్ అక్కడిక్కడా టీవీ షోలలో జడ్జిగా చేస్తున్నాడు… అదీ రెగ్యులర్ కాదు, టెంపరరీ… రవికృష్ణ అంతకుముందులాగే టీవీ సీరియళ్లలో యాక్ట్ చేస్తున్నాడు, కొత్తగా వచ్చిన ఫాయిదా ఏమీలేదు తనకు… మహేశ్ విట్టా, అలీ రెజా, హేమ, హిమజ, ఆషురెడ్డి అందరూ అంతే… వరుణ్ సందేశ్, వితికా షేరు పేర్లు జనం మరిచిపోయారు అప్పుడే… ఆమధ్య ఏదో టీవీషోలో కనిపించింది వితికా… రోహిణి అంతంతమాత్రమే…
ఈసారి కంటెస్టెంట్లకు కూడా పెద్దగా బిగ్‌బాస్ పాపులారిటీ ఉపయోగపడుతుందని చెప్పే సీన్ ఏమీ లేదు… కొద్దిరోజులు ఈ హడావుడి ఉంటుంది… మాల్దీవులు పర్యటనలు, పార్టీలు, ఇంటర్వ్యూలు అయిపోయాక… మొత్తం చల్లారిపోతుంది… ఈ పాపులారిటీ అమ్మా రాజశేఖర్, సూర్యకిరణ్, కల్యాణికి పెద్ద ఫాయిదా అవుతుందనే భ్రమలు ఎవరికీ లేవు… దేవి తన కొలువు చేసుకుంటుంది… సుజాతకూ అదే తప్పదు… గంగవ్వకు అదే టీవీ స్కిట్లు… అవినాష్, మోనాల్ తదితరులకు మాటీవీ చాన్సులు ఇస్తుంది… లాస్య సెకండ్ ఇన్నింగ్స్‌కు ఏమైనా లాభం ఉంటుందేమో చూడాల్సిందే… ఇక సినిమా చాన్సుల మీద ఆశలు పెట్టుకున్నవాళ్ల సంగతి అంటారా..? కాలం చెప్పబోతోంది…!!
Share this Article