Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అల్లుకు అవార్డు… లైవ్ కుదరడం లేదు.., ఆ అవసరానికి ఓ అబద్ధం…

January 2, 2026 by M S R

.

Bhavanarayana Thota ….. అవసరానికి ఒక అబద్ధం – అనైతికత

జెమినీ టీవీ మొదలై రెండేళ్ళు దాటాక సగం వాటా సన్ టీవీకి అమ్ముకోవాల్సి వచ్చింది. శాటిలైట్ ట్రాన్స్ పాండర్ అప్పటికే సన్ టీవీ దగ్గర అద్దెకు తీసుకోవటంతో ఆ అద్దె తడిసి మోపెడయింది. మరోవైపు ఆదాయం కూడా అంతంత మాత్రంగా ఉండటంతో ఈ సగ భాగం అమ్మకపు సూచనకు జెమినీ తలొగ్గక తప్పలేదు.

Ads

పేరుకు సగం వాటా అయినా, ఆర్థిక లావాదేవీల పెత్తనం సన్ టీవీదే. అందువల్ల అన్ని విషయాల్లో సన్ టీవీ అజమాయిషీ సాగేది. కొద్ది రోజులు మాత్రం అర్థగంటకొకసారి జెమినీ లోగో, మరో అర్థగంటకు సన్ లోగో మార్చి మార్చి వేసేవారు. ఆ ముచ్చట కూడా ఏడాదికే ముగిసింది. ఆ తరువాత జెమినీకి తోడు తేజా టీవీ కూడా మొదలైంది.

అలాంటి సమయంలోనే ఒక ఘటన జరిగింది. బహుశా 2001 లో అనుకుంటా.. నంది అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్ నాంపల్లిలోని లలితకళాతోరణంలో ఏర్పాటైంది. ఆ సంవత్సరం అల్లు రామలింగయ్య గారికి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్ ఇస్తున్నారు. సాయంత్రం నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు మొదలుపెట్టి ఆ తరువాత అవార్డులు ఇవ్వటం ఆనవాయితీ.

అందువల్ల రాత్రి 9 గంటల దాకా కార్యక్రమం జరిగే అవకాశముంటుంది. కానీ 8 గంటలకు వార్తలు వస్తాయి. అంటే, ఆ ప్రోగ్రామ్ మధ్యలో న్యూస్ బులిటెన్ తప్పదు. పైగా, అవార్డులు ఇవ్వటం 8 గంటలకే మొదలయ్యే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ లో ఉన్న జెమినీ డైరెక్టర్ కిరణ్ గారు అంచనా వేశారు.

అందుకే ఆయన అదే విషయం సన్ టీవీ వాళ్ళకు చెప్పి ఎలాగైనా ఆరోజు న్యూస్ బులిటెన్ కాన్సిల్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. అయితే, సన్ టీవీ వాళ్ళు ఆరు నూరైనా న్యూస్ బులిటెన్ ఆపటం కుదరదని తేల్చి చెప్పేశారు. వాళ్ళు న్యూస్ కి ఇచ్చే ప్రాధాన్యం అలాంటిది.

కానీ సినిమా వాసనలున్న హైదరాబాద్ జెమినీ యాజమాన్యం ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్ కోణంలోనే ఆలోచిస్తుంది. ప్రసాద్ లాబ్ నడిపి ఉండటం, నిర్మాతలు కావటం, ఆనంద్ సినీ సర్వీసెస్ నిర్వహణ లాంటివి కారణాలు. అల్లు అరవింద్ తో, చిరంజీవితో ఉన్న అనుబంధం కూడా ప్రత్యేకంగా ఆ రోజు అల్లు రామలింగయ్య పురస్కారం అందుకోవటాన్ని లైవ్ చేయాలనుకోవటానికి కారణమై ఉండొచ్చు.

ఆ విషయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా, నిస్సహాయ పరిస్థితిలో ఉండిపోయారు. ఇంకేమీ చేసే అవకాశం లేదా అని నన్నడిగారు. సన్ టీవీ ఎండీ నిర్ణయం తీసుకున్న తరువాత నేను చేయగలిగేదేముంటుంది?
మొత్తానికి సాయంత్రం 7 గంటలనుంచి హైదరాబాద్ లలితకళాతోరణం నుంచి లైవ్ మొదలైంది.

మేం చెన్నైలో ఆ లైవ్ కంటిన్యూ చేస్తూ 8 గంటల బులిటెన్ కు సిద్ధమయ్యాం. 8 కాగానే లైవ్ ఇవ్వటం ఆపేసి బులిటెన్ మొదలు పెట్టాం. అంటే, అ లైవ్ మాదాకా వస్తున్నదే తప్ప గాల్లోకి వెళ్ళటం లేదు. అప్పుడే సినిమాటోగ్రఫీ శాఖామంత్రి హోదాలో దేవేందర్ గౌడ్ గారు మాట్లాడటం మొదలు పెట్టారు. ఆయన మాట్లాడటం పూర్తవగానే నంది అవార్డుల బహూకరణ మొదలవుతుంది.

ముందుగా ఇచ్చేది అల్లు రామలింగయ్య గారికి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్. అందువల్ల న్యూస్ బులిటెన్ పూర్తయ్యే లోపు.. అంటే 8.30 లోపే అవార్డు ఇవ్వటం కూడా పూర్తవుతుంది. ఆ తరువాత మిగతా వాళ్ళకు అవార్డులివ్వటం లైవ్ ఎలాగూ ఇస్తాం గాని, జెమినీ కిరణ్ గారు ఆశించినట్టు అల్లు రామలింగయ్య గారు అవార్డు తీసుకోవటం మాత్రం లైవ్ మిస్సవుతుంది.

సరిగ్గా అప్పుడే అక్కడున్న రిపోర్టర్ తో ఒక విషయం చెబితే ఒక స్లిప్ మీద రాసుకొని దేవేందర్ గౌడ్ గారికి ఇచ్చాడు. మా వరకూ వస్తున్న లైవ్ లో అదంతా కనిపిస్తూనే ఉంది. ఆ స్లిప్ చదువుకున్న దేవేందర్ గౌడ్ ముఖంలో సుముఖత కనిపించింది. ఆ పాచిక పారితే అల్లు రామలింగయ్య గారు అవార్డు తీసుకోవటం లైవ్ లో చూపించగలమనిపించింది.

అలా ఎదురు చూస్తూ ఉండగానే మా వార్తలు పూర్తయ్యాయి. దేవేందర్ గౌడ్ గారి ప్రసంగం కూడా బాగా సాగదీసి పూర్తి చేశారు. కానీ డాని వెనుక కుట్ర ఆయనకు తెలియదు పాపం! సన్ టీవీ వాళ్ళు అనుకున్నట్టుగా న్యూస్ బులెటిన్ ఆగలేదు. జెమినీ వాళ్ళు కోరుకున్నట్టు అల్లు రామలింగయ్య గారి అవార్డు ప్రదానోత్సవం లైవ్ కూడా వచ్చింది.

ఇంతకీ ఆ స్లిప్ లో రాసి ఉన్నది ఏంటంటే “ తేజా టీవీలో లైవ్ వస్తున్నది. ఎక్కువ సేపు మాట్లాడండి” అని. లైవ్ అంటే అప్పట్లో చాలా క్రేజ్. అందుకే దేవేందర్ గౌడ్ గారు ఎక్కువ సేపు మాట్లాడారు.

(ఆ రోజుల్లో లైవ్ చేయటమనేది జెమినీ/తేజా చానల్స్ కు నల్లేరు మీద నడకలా ఉండేది. రిస్క్ తీసుకోవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండటం వల్ల తప్పులు దొర్లినా పరవాలేదన్న అభిప్రాయం మేనేజ్ మెంట్ కి ఉండేది. దానివల్ల ఎప్పటికప్పుడు నేర్చుకోవటానికి వీలుండేది. కానీ, ఈటీవీ మాత్రం లైవ్ చేయటానికి చాలా వెనకాడేది. ఎప్పుడు ఏ పొరపాటు జరుగుతుందోనన్న అనుమానం వెంటాడేది. పైగా, అంతకు ఏడాది ముందు బిల్ క్లింటన్ పర్యటనను లైవ్ చేస్తూ ఉండగా కొన్ని పొరపాట్లు దొర్లాయి. బహుశా అందుకేనేమో చాలా కాలం పాటు అలాంటి సాహసం చేయలేదు. జెమినీ/ తేజా చానల్స్ ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉండేవి)

మొత్తానికి దేవేందర్ గౌడ్ గారి దగ్గర లైవ్ టెలికాస్ట్ అనే మంత్రం బాగానే పనిచేసింది. దానివలన అవార్డులిచ్చే కార్యక్రమం లైవ్ చేయగలిగాం. ఆయన మాటలు లైవ్ కాలేదన్న విషయం ఆయనకు తెలియదు. టీవీ చూడటం లేదు కాబట్టి ఆయనకు తెలిసే అవకాశం కూడా లేదు. ఆయన మాత్రం జనం చూస్తున్నారన్న నమ్మకంతోనే ప్రసంగం సాగదీశారు.

మరుసటి రోజు మా వాళ్ళు రికార్డ్ చేసిన ఆయన స్పీచ్ వీడియో అందజేసి, టెక్నికల్ ప్రాబ్లెం వలన లైవ్ టెలికాస్ట్ కాలేదని ఇంకో అబద్ధం చెప్పి వచ్చినట్టు తెలిసింది. 2005లో అనుకుంటా, ఆయనను కలిసిన సందర్భంలో మొత్తం జరిగిన సంగతంతా చెబితే నవ్వేశారు. కానీ, మా అవసరం కోసం అంత పెద్ద అబద్ధమాడామనే విషయం మాత్రం ఇప్పటికీ బాధపెడుతూనే ఉంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అల్లుకు అవార్డు… లైవ్ కుదరడం లేదు.., ఆ అవసరానికి ఓ అబద్ధం…
  • ఏ పార్టీ ప్రభుత్వం ఐతేనేం…? పాలకుల్ని నడిపించేది ఆ కంట్రాక్టర్లేనా…!!
  • సౌందర్య మరణానికి ముందురోజు… అనుకోకుండా రికార్డయిన ఓ ఫోన్ కాల్…
  • ‘పాలమూరు పాపం’లో కేసీయార్, హరీష్‌ ఫిక్స్…. రేవంత్‌ ‘సిట్’..!
  • తనికెళ్ల భరణి నోట పదే పదే ‘సామాన్లు’ మాట… బూతు కాదండీ బాబూ…
  • ‘రైడింగ్ ద టైగర్’..! సత్యం రామలింగ రాజు ‘డెస్టినీ’పై పర్‌ఫెక్ట్ చిత్రణ..!!
  • సనాతన స్వర గళాలు…. శివశ్రీ స్కంధప్రసాద్ Vs మైథిలి ఠాకూర్…
  • ఇటు సింధును ఆపినట్టే… అటు గంగనూ ఆపితే… బంగ్లాదేశ్ పని ఖతం…
  • చలాకీ మొగుడు- చాదస్తపు పెళ్లాం… నవ్వులతో పొట్టచెక్కలు…
  • ఈ కొత్త సంవత్సరంలో మీకు మెలకువ వచ్చినప్పుడే తెల్లవారుగాక..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions