.
ముందుగా తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ జారీ చేసిన ఓ నోటీసు చదవండి…
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం కావడంతో, ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Ads
ఈ నేపథ్యంలో, సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు మరియు సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహిళా కమిషన్ హెచ్చరిస్తోంది. మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్‌ను వెంటనే నిలిపివేయాలి. ఈ హెచ్చరికను పాటించకపోతే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము
సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించడం, మహిళల గౌరవాన్ని కాపాడటం అనేది నైతిక బాధ్యత. యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది.
ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయవచ్చు. ఈ విషయంపై నిశితంగా పరిశీలన కొనసాగిస్తూ, అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటాం.
చైర్‌పర్సన్
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్
మహిళలకు సంబంధించిన ఏ అంశమైనా కమిషన్ స్వీకరించవచ్చు… వోకే… కానీ కొన్ని ప్రశ్నలకు జవాబు దొరకాల్సి ఉంది… ఎందుకంటే..? రీసెంటుగా రెండు సినిమాల్లోని స్టెప్పుల మీద తీవ్రంగా విమర్శలు వచ్చాయి…
1. ఊర్వశి రౌతేలా పిరు-ల మీద బాలకృష్ణ గుద్దుతూ, దబిడిదిబిడి పాటలో ఓ అసభ్యకరమైన స్టెప్ చేశాడు… డాకూ మహారాజ్ సినిమా… సినిమా సక్సెస్ ప్రైవేటు పార్టీలో కూడా బాలకృష్ణ అవే స్టెప్పులు రిపీట్ చేయడానికి ప్రయత్నించాడు…
2. రాబిన్‌హుడ్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్… డాన్సర్ కేతిక శర్మ… అదిదా సర్‌ప్రైజ్ అనే పాట… ఆమె స్కర్టు ఎత్తి పట్టుకుంటూ అసభ్యమైన స్టెప్స్ వేసింది…
3. కన్నప్ప సినిమాలో ఓ పాట… సగమై చెరిసగమై పాటలో కథానాయిక ప్రీతి ముకుందన్ వస్త్రధారణ మీద విమర్శలొచ్చాయి… టూపీస్ బికినీ టైపులో రెండు బట్ట ముక్కలు కట్టారు… (అన్నమయ్యలో రక్తి పాటల్లేవా..? శ్రీరామదాసులో లేవా..? ఏ భక్తి సినిమాలో లేవు అంటూ సమర్థించినవాళ్లూ ఉన్నారు… అది వేరే సంగతి…)
తెలుగు సినిమాల్లో అసభ్యం, అశ్లీలం మోతాదు ఎక్కువే… ఈమధ్య బాగా వ్యతిరేకత మూటగట్టుకున్నవి ఈ రెండు… ఈ రెండు పాటలకూ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్… ఇది తన నీచాభిరుచే కావచ్చుగాక… కానీ ఆ స్టెప్పులు వేసిన హీరో, హీరోయిన్ లేదా డాన్సర్, నిర్మాత, దర్శకుడు… అందరూ బాధ్యులే అవుతారు కదా… పైగా నిర్మాత దర్శకుల టేస్టును బట్టే కదా కొరియోగ్రాఫర్ స్టెప్స్ కంపోజ్ చేసేది…
నిర్మాత, దర్శకుడు, కొరియోగ్రాఫర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అంటోంది కమిషన్… గుడ్… అయితే మరి ఆ స్టెప్పులు వేసే నటుల బాధ్యత లేదా..? అంటే నిజంగా కమిషన్ నోటీసులు జారీ చేయాలని అనుకుంటే బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా, కేతిక శర్మలనూ బాధ్యుల్ని చేస్తారా..?
బాలయ్య నటుడే కాదు, ఎమ్మెల్యే, సీఎంకు వియ్యంకుడు, డీఫాక్టో సీఎంకు మామ… సో వాట్ అనే ధోరణితో వెళ్లగలదానే ప్రశ్న పక్కన పెడితే… ఏది అసభ్యం..? ఈ నిర్వచనం కష్టం, క్లిష్టం… ఎందుకంటే ఈ రోజుల్లో ఆ స్టెప్పులు కామన్ కదా అని తేలికగా తీసుకునే ప్రేక్షకులూ ఉంటారు…
గతంలో ఎన్టీఆర్ కూడా దంచుడు పాటల్లో రెచ్చిపోయేవాడు… అయినా మీడియా, సినిమాల్లో స్వీయ నియంత్రణ అనేది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం… భ్రమ పదార్థం…
నో, నో, ఎక్కడో ఓచోట ఈ వెగటు ధోరణికి తెరపడాల్సిందే అనేవాళ్లూ ఉంటారు… ఇవన్నీ గాకుండా క్రియేటివ్ ఫ్రీడం అనే మాట ఓ అడ్డంకి… సో, వేచి చూడాలి… వోన్లీ హెచ్చరికలేనా..? నిజంగానే ఆ స్టెప్పులు తొలగించకపోతే కమిషన్ ఏ యాక్షన్ తీసుకుంటుందో..!!
Share this Article