సీనియర్లు ఏమంటారంటే..? ఏ జర్నలిస్టూ ఏ రంగంలోనూ నిపుణుడు కాదు, కానీ కామన్ సెన్స్ వాడాలి… అన్నింటికీ మించి ఓపిక, సంయమనం అవసరం అంటారు… పూర్తి వివరాలు వచ్చేవరకు ఆగాలంటారు… కానీ ఇప్పుడంత టైమ్ ఎక్కడుందని… ఏదైనా పరిణామం తెలిసిందంటే చాలు, మనకు అర్థమైనకాడికి ఏదో ఒకటి రాసిపడేయడమే… దురుద్దేశంతో కాకపోవచ్చు… కానీ అందరికన్నా వేగంగా, ముందుండాలనే తాపత్రయంతో…
పార్లమెంటులో మహిళా బిల్లు మీద చాలామంది సోషల్ మీడియాలో ఎడాపెడా రాసిపడేశారు… పడేస్తున్నారు కూడా… డిజిటల్ పేపర్లు కూడా సోషల్ మీడియా బాటే… మహిళా బిల్లు అనగానే ఎక్కడెక్కడ తెలంగాణలో మహిళ ఓట్లు ఎక్కువున్నాయో లెక్కలు తీసి ఎవరెవరి సీట్లు గల్లంతవుతాయో లిస్టులు రాసేశారు… ఎవరి దాకో ఎందుకు..? ఏకంగా కేసీయార్, కేటీయార్, హరీష్ స్థానాలకు కూడా ఎసరు పెట్టేశారు…
ఆలూ లేదు, చూలూ లేదు అన్నట్టుగా ఉంది… అదుగో కేసీయార్ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించేశాడు గానీ… ఇప్పుడు తలపట్టుకున్నట్టే… కనీసం 35 మంది అభ్యర్థిత్వాలు మార్చేయాల్సిందే… ఆల్‌రెడీ కేసీయార్ మహిళా అభ్యర్థుల కసరత్తు స్టార్ట్ చేసేశాడు… సతీమణులు, కోడళ్లు, బిడ్డలు పోటీకి ఇష్టపడని చోట్ల, కనీసం 15 మంది బీఆర్ఎస్ నుంచి జంప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని కూడా విశ్లేషణలు వచ్చాయి… అక్కడికి వీళ్లే డీలిమిటేషన్లు చేసేసి, వీళ్లే రిజర్వేషన్ల సీట్లను ఖరారు చేసేసి, వీళ్లే ఎన్నికల సంఘం ప్రతినిధులు అయిపోయారు… కొందరైతే ఏకంగా తెలంగాణలోని 119 సీట్లలోని 63 సీట్ల వోట్ల వివరాలు రాసేసి, అన్నీ రిజర్వ్ అయిపోయినట్టే అని రాసిపడేశారు…
Ads
నిజానికి విషయం ఏమిటంటే… ఇప్పుడు లోకసభలో, రాజ్యసభలో బిల్లు పాస్ కాగానే అది చట్టం అవుతుంది నిజమే… కానీ తక్షణం ఆ రిజర్వేషన్లు అమల్లోకి రావు… జనగణన జరిగిన తరువాత, అంటే 2027 తరువాతే అమల్లోకి వస్తాయని కేంద్రం చెబుతోంది… అంటే తెలంగాణలో వచ్చే ఎన్నికలకు అవి వర్తించవు అన్నమాటే కదా… అసలు జనగణన 2021లోనే జరగాల్సి ఉంది… కరోనా కారణంగా వాయిదా పడింది… అదెప్పుడు జరుగుతుందో ఎవరికీ క్లారిటీ లేదు…
ఈలోపు డీలిమిటేషన్ గడువు ముందుకొస్తుంది… అదెన్నాళ్లో ఎవరూ అంచనా వేయలేరు… వెరసి 2029 లోకసభ ఎన్నికల నాటికి గానీ ఈ ప్రక్రియలన్నీ ఓ కొలిక్కి రావచ్చునని రఫ్ అంచనా… ఈలోపు ఎన్ని రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు వచ్చినా పాత రిజర్వేషన్లే ఉంటాయి… పైగా మహిళల వోట్లు ఎక్కువగా ఉన్న సీట్లనే రిజర్వ్ చేస్తారనేది కూడా ఓ ఊహ మాత్రమే… లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు కావచ్చు తొలిసారి… తరువాత ప్రతి అయిదేళ్లకు ఓసారి రొటేట్ చేస్తారు… అంటే అన్ని సీట్లకూ ఒక్కసారి రిజర్వేషన్ వర్తించాలంటే 15 ఏళ్లు పడుతుంది…
ఇదుగో ఇన్నిరకాల అడ్డంకులున్నయ్… కేంద్రం ఇచ్చిన క్లారిటీ చదివి, విని, నాలుక కర్చుకుని పోస్టులు మడతేస్తున్నారు చాలామంది… అబ్బే, ఇప్పుడే కాదట అని సన్నాయినొక్కులు స్టార్ట్ చేశారు… వేరే కథనాలను పబ్లిష్ చేస్తున్నారు… టీవీలయితే మరీ అరాచకం… గంట గంట బులెటిన్‌కూ మార్పు… ఐనా టీవీ చానెళ్లకు క్రెడిబులిటీ సమస్యేముంది..? వాటిని ఎవరైనా నమ్ముతుంటే కదా… హలో… కేసీయార్, కేటీయార్, హరీష్ స్థానాాలకు వచ్చిన రిజర్వేషన్ల ముప్పేమీ లేదు ఇప్పుడు… నిక్షేపంగా పోటీచేస్తారు… వాళ్ల సొంత స్థానాల్లోనే…!! ప్లస్ కామారెడ్డి వంటి అదనపు సీట్లలో సహా..!!
Share this Article