సరిగ్గా నెల రోజుల క్రితం… పశ్చిమ ఆఫ్రికా నుంచి ఓ వార్త వచ్చింది… మాలీకి చెందిన హలిమా నిస్సే అనే పాతికేళ్ల యువతి ఒకే కాన్పులో తొమ్మిది మంది శిశువులకు జన్మనిచ్చింది… ఇది మానవచరిత్రలోనే రికార్డు… అసాధారణం, అసహజం అని కాదు… అత్యంత అరుదు… నిజానికి ఒకే కాన్పులో ముగ్గురు పుడితేనే అబ్బో అని అబ్బురపడతాం… అలాంటిది తొమ్మిది మంది, పైగా అందరూ బతికారు… మొదట ఏడుగురు అని స్కానింగులో కనిపించింది, తీరా పుట్టేసరికి తొమ్మది లెక్కతేలింది… ఇంతమందిని ఎలా మోసిందో… ఇకపై ఎలా మోస్తుందో, అంటే పోషిస్తుందో పక్కన పెడితే…. తాజాగా… దక్షిణాఫ్రికా నుంచి అలాంటిదే వార్త… గొసియామె థమారా సిథోలే అనే 37 ఏళ్ల మహిళ ఏకంగా పదిమందికి జన్మను ఇచ్చిందని వార్త…
తొమ్మిది మందిని కంటేనే కళ్లు తేలవేశాం, మరి పదిమందినీ కంటే..? ఇదే రికార్డు… బహుశా ఎవరూ చెరపలేరేమో… ఆ రేంజ్ కాన్పు… వార్త అనే కోణంలో ఆలోచిస్తే పాఠకాసక్తి బాగా ఉండే వార్త… అంతర్జాతీయ మీడియా కూడా ఎడాపెడా రాసేసింది… ఏవో బొమ్మలు పెట్టేశారు, పదిమందిని కన్న మహిళ (డెకాప్లెట్స్) అని హెడ్డింగులూ కొట్టేశారు… దాంతో మన మీడియా కూడా ఇక తప్పనిసరై రాయాల్సి వచ్చింది… నిర్ధారణ ఏమీ ఉండదు ఇలాంటి వార్తలకు… మనం రాయకపోతే, ఎదుటోడు రాస్తే మనకు వార్త మిస్… రాయాలంటే అది కరెక్టో కాదో కొన్నిసార్లు కన్‌ఫరమ్ కాదు… అందుకని లోపలి పేజీల్లో అవునో, కాదో అన్నట్టుగానే… సందేహిస్తున్నట్టుగానే… రాయాలా వద్దా అనే డైలమాను కనబరుస్తూనే మొత్తానికి అచ్చేశారు… అయితే..?
Ads
ఒకసారి ఈ అధిక పిల్లల కాన్పుల గురించి కాస్త చదువుకుందాం… ఇద్దరయితే twins, ముగ్గురయితే Triplets, నలుగురయితే Quadruplets, ఐదుగురయితే quintuplets, ఆరుగురయితే sixtuplets, ఏడుగురయితే septuplets, ఎనిమిది మందయితే octuplets, తొమ్మిది మందయితే nonuplets, ten offspring – decaplets… అంతే… అంతకుమించి ఎవరూ ఊహించలేరు… భారతంలో కౌరవులు వంద మంది పుట్టారు గానీ… వంద మందిగా ఒకే జననం కాదు… అది వేరే కథ… ముగ్గురు, నలుగురిని ఒకేసారి కనడం అంటేనే ఓ పెద్ద యజ్ఞం… కానీ ఐదుగురు, ఆరుగురు, ఇలా తొమ్మిది మంది వరకూ కన్నట్టు రికార్డులున్నయ్… ఒకేసారి పది మందిని కన్న ఉదాహరణ ఇప్పటివరకూ లేదు… తొమ్మిది మందిని ఒకేసారి కన్న ఉదాహరణలు రెండు ఉండేవి… 1) 1971లో సిడ్నీలో… ఐదుగురు మగ, నలుగురు ఆడ శిశువులు… కానీ ఏడుగురే బతికారు, తరువాత ఆరు రోజులకు మరో మగ శిశువు మరణించాడు… 2) 1999లో మలేషియాలో… సేమ్, ఐదుగురు మగ, నలుగురు ఆడ శిశువులు… కానీ ఎవరూ బతకలేదు… సో, ఈ పది మంది పుట్టుకకు ఇంపార్టెన్స్ ఉంది…
కానీ మీడియా ఎడాపెడా రాసేసింది తప్ప మాకు ఆధారాలు, రికార్డులు ఏమీ దొరకడం లేదు అని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేస్తున్నయ్… అన్ని హాస్పిటళ్ల రికార్డులూ వెరిఫై చేశాం, ఈ పది మంది శిశువుల కాన్పు వివరాలే దొరకలేదు అని తేల్చేస్తున్నయ్… సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డైరెక్టర్ జనరల్ ఫుల్మా విలియమ్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ… ‘‘ఒకే కాన్పులో పది మంది శిశువులు జన్మించారనే వార్త తెలియగానే మేము చాలా పరిశోధన చేశాం. అయితే దానికి సంబంధించిన ఏ ఆధారమూ మాకు లభించలేదు. ఏ ఆసుపత్రిలో పది మంది శిశువులు ఒకే కాన్పులో జన్మించారని నమోదు కాలేదు’’ అంటున్నాడు… అదండీ సంగతి…!! చెప్పనేలేదు కదూ… నిన్న ఈ ఫేక్ వార్తతో డబుల్ కాలమ్ నింపిన ఘనులు ఈరోజు అది నిజమో కాదో కాస్త క్లారిటీ అయినా ఇవ్వాలి కదా… ఇవ్వలేదు… భలేవారే, అంత బుద్దీజ్ఞానం ఉంటే దాన్ని మెయిన్ స్ట్రీమ్ అని ఎందుకంటారు..?!
Share this Article