.
పారా గ్లయిడింగ్ తో పరీక్ష కేంద్రానికి… వర్క్ ఫ్రమ్ కార్
సమస్యకు దూరంగా పరిగెత్తితే… పరిష్కారానికి కూడా దూరంగా పరుగెడుతున్నట్లు- Running away from any problem only increases the distance from the solution- అని ఇంగ్లీషులో ఒక సామెత. అంటే సమస్య ఉన్న దగ్గరే పరిష్కారం కూడా దొరుకుతుంది.
Ads
సంక్షోభాల్లోనే పరిష్కారాలు కూడా దొరుకుతూ ఉంటాయి. కరోనా వేళ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉద్యోగాలు పోయాయి. జీతాలు తగ్గాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ లు పెరిగాయి. ఆఫీసులు ఖాళీ అయ్యాయి. ఇళ్లు ఆఫీసులు అయ్యాయి.
వర్క్ ఫ్రమ్ హోమ్ లు మొదట మెట్రో నగరాలకే పరిమితం. నెమ్మదిగా పల్లెల్లో కూడా కరెంట్, ఇంటర్నెట్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లు పెరిగాయి. పిల్లలు హోమ్ వర్క్ లు చేసుకుంటూ ఉంటే…పెద్దలు వర్క్ ఫ్రమ్ హోమ్ లు చేసుకుంటున్నారు.
ఫార్మల్ డ్రస్ బాధ లేదు. టైమ్ కు బయలుదేరాలన్న హడావుడి లేదు. లంచ్ బాక్స్ గొడవ లేదు. పైన ఏదో ఒక టాప్ వేసుకుని ల్యాప్ టాప్ లేదా డెస్క్ టాప్ ముందు కూర్చుంటే చాలు. పని జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉండి ప్రతి అరగంటకు వంటింట్లో చిరు తిళ్ళు తిని తిని బరువులు పెరిగి కొండల్లా తయారుకావడం తప్ప… వర్క్ ఫ్రమ్ హోమ్ లు సాఫీగానే సాగుతున్నాయి. ఆఫీసు చికాకులన్నీ ఇళ్లల్లో ప్రదర్శించడం లాంటి సమస్యలు వర్క్ ఫ్రమ్ హోమ్ లలో పెరిగాయి. అది వేరే విషయం.
కరోనా వేళ వర్క్ ఫ్రం హోమ్ పని విధానం ఉద్యోగులకు వెసులుబాటు కలిగించడం మాటెలా ఉన్నా… కంపెనీలకు ఖర్చు తగ్గించుకోవడానికి అద్భుతమైన ఐడియాగా పనిచేసింది. పెద్ద పెద్ద ఆఫీసులు, కరెంటు, ఏసి, రానుపోను రవాణా, క్యాంటీన్… ఇలా నానా నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రం హోమ్ లను ఒక పాలసీగా కొనసాగిస్తున్నారు.
ఉద్యోగి కార్యాలయానికి తప్పనిసరిగా రావాల్సిన పనులు తప్ప… మిగతావాటిని ఇళ్ళ నుండే చేయించుకుంటున్నారు. కొన్ని రోజులు ఇంట్లో, కొన్ని రోజులు ఆఫీసులో పనిచేయించుకునే హైబ్రిడ్/డ్యూయల్ పద్ధతులు కూడా అలవాటయ్యాయి.
ఏదైనా అలవాటయ్యాక చాలా మామూలు విషయం అయిపోతుంది. అలా వర్క్ ఫ్రం హోమ్ చేసి చేసి… ఎంతగా అలవాటయ్యిందోకానీ… బెంగళూరులో ఒక మహిళా ఉద్యోగి ఆఫీస్ నుండి ఇంటికెళుతూ… వర్క్ ఫ్రమ్ కార్ ఓవర్ టైమ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసుల కంట్లో పడింది.
బెంగళూరు మహానగరం ట్రాఫిక్ కష్టాలు జగద్విదితం. “రెండు నిముషాల్లో హోటల్ నుండి ఇంటికి ఫుడ్ పార్సెల్ డెలివరి అయ్యే యాప్ ను భారత సిలికాన్ వ్యాలీ బెంగళూరు ఆవిష్కరించి… లక్ష కోట్ల ఈక్విటీని, ఐపిఓ ల్లో జనం పెట్టుబడిని ఆకర్షించగలదు కానీ… ట్రాఫిక్ లో ఇరుక్కున్న ఆ ఫుడ్ పార్సెల్ ను రెండు గంటలైనా ఆ యాప్ బయటికి తెచ్చుకోలేదు”
…. అని బెంగళూరు మీద పాపులర్ జోక్. బెంగళూరు ట్రాఫిక్ అంత నరకం. హైదరాబాద్ ట్రాఫిక్ ను విసుక్కునేవారు రెండ్రోజులు బెంగళూరు ట్రాఫిక్ లో తిరిగి వస్తే… హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ జామే కాదని ఒప్పుకుంటారు.
ఆ ఉద్యోగి కారు డ్రైవ్ చేస్తూ, స్టీరింగ్ మీద ల్యాప్ టాప్ ఓపెన్ చేసి హాయిగా పనిచేసుకోవడం మొదలుపెట్టింది. ఎప్పుడూ ఇలాగే చేస్తోందో! లేక అదే తొలిసారో! తెలియదు కానీ… ఎవరో పక్కనుండి సెల్ ఫోన్లతో షూట్ చేసి… సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దాంతో పోలీసులు పెనాల్టీ వేసి… ఇంకోసారి చేస్తే.. .డ్రయివింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు.
ఏమాటకామాట. ఇంటికెళితే ఇంటిపనులు ఎలాగూ ఎదురుచూస్తూ ఉంటాయి. గంటసేపు అంగుళం కూడా కదలని ట్రాఫిక్ లో ఎంత వీలైతే అంతపని పూర్తి చేసేస్తే మంచిది కదా! అనుకున్న ఆ యువతి ఆరాటం కూడా అర్థం చేసుకోదగ్గదే. మహానగరాల్లో ప్రాణాన్ని పణంగా పెట్టి బతుకుపోరును ఈదే సగటు ఉద్యోగి కోణంలో ఈ “వర్క్ ఫ్రం కార్” దృశ్యాన్ని చూడాలి.
కొస మెరుపు:- మహారాష్ట్రలో ఒక విద్యార్థి పరీక్షకు వేళవుతోంది. సతారా జిల్లా వాయి- పంచగని రోడ్డులో ట్రాఫిక్ కదలట్లేదు. కిలోమీటర్ల మేర భారీ వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. తనకు తెలిసిన పారా గ్లైడింగ్ శిక్షకుడికి ఫోన్ చేశాడు. ఆయన సకల సరంజామాతో వచ్చాడు. ఇద్దరూ పారా గ్లైడింగ్ లో ఆకాశమార్గాన మేఘాలలో తేలుతూ పరీక్ష కేంద్రానికి వేళకు చేరుకున్నారు.
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాల్లో కంటికి కనిపించిన రెండు దృశ్యాలివి. మనకు కనపడనివి, కనపడినా పట్టించుకోనివి, పట్టించుకున్నా ఏమీ చేయలేనివి ప్రతిక్షణం ఎన్నో? ఎన్నెన్నో?
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article