.
భారతదేశంలో మహానగరాల్లో వాహనాల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. అలాగని చిన్న పట్టణాల్లో వాహనాలు పెరగడం లేదని కాదు. ఈ సమస్య మహానగరాల్లో మహానరకంలా తయారవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య ఇది. సింగపూర్, లండన్ లాంటి చోట్ల వ్యక్తిగత వాహనాల కొనుగోళ్ళను తగ్గించడానికి, బిజీవేళల్లో రోడ్లమీద రాకపోకలను నియంత్రించడానికి చాలా కఠినమైన నిబంధనలను దశాబ్దాలుగా అమలు చేస్తున్నారు. ఉన్నవారు, లేనివారు లండన్లో వందేళ్ళుగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అయిన ట్యూబ్ (భూ గర్భంలో తిరిగే రైలు) లోనే తిరుగుతున్నారు.
Ads
లండన్ ట్రేడ్ మార్క్ అయిన డబుల్ డెక్కర్ రెడ్ కలర్ సిటీ బస్సు ప్రతి అయిదు నిముషాల్లోపు ఒకటి దొరికేలా ప్రజారవాణా వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నారు. ట్యూబ్, సిటీ బస్ ఆగితే లండన్ కాలు కదలదు. వ్యక్తిగత వాహనాలు ఏయే వేళల్లో లండన్లో ఏయే జోన్లలో తిరగవచ్చో నిర్ణయించారు.
ఎలెక్ట్రిక్ వాహనాలు తప్ప మిగతా వ్యక్తిగత వాహనాలు సెంట్రల్ లండన్లోకి ప్రవేశించాలంటే వణుకు పుట్టేలా ఎంట్రీ చార్జీలను విధిస్తున్నారు. ట్యూబ్, డబుల్ డెక్కర్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కోసం వారి నగర ప్రణాళిక; రోడ్లు, పార్కింగ్ ప్లేస్ ల నిర్వహణ; మనముందుకు ఏ నంబర్ బస్సు ఎన్ని నిముషాల్లో వస్తుందో తెలిపే కచ్చితమైన యాప్; కార్డు ద్వారానే టికెట్ కు చెల్లింపులు అంతా వ్యవస్థీకృతంగా ఉంటుంది.
మన దగ్గర ఆటోలు తిరిగినట్లు అక్కడ డబుల్ డెక్కర్ బస్సులు సునాయాసంగా తిరుగుతున్నాయి. చేతిలో రెండు పెద్ద సూట్ కేసులున్నా… ట్యూబ్ లో, సిటీ బస్సులో ఇంకొకరి సాయం అవసరం లేకుండా హాయిగా ప్రయాణించడానికి వీలుగా ఎస్కలేటర్లు, లిఫ్ట్ లు, ఫుట్ పాత్ లు, బస్ స్టాపులు మొత్తం వ్యవస్థను తీర్చిదిద్దారు.
చివరికి లండన్ ఊరి మధ్యలో ప్రవహించే థేమ్స్ నదిలో ఉబర్ బోట్లను కూడా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ స్థాయిలో వాడుతున్నారు. రోడ్డు మీద సిటీ బస్సుతో పోలిస్తే… బోట్లోనే పది నిముషాలు ముందు వెళ్ళవచ్చు.
సింగపూర్లో వ్యక్తిగత వాహనాల కొనుగోళ్ళను నిరుత్సాహపరచడానికి కార్ల మీద పన్నులను విపరీతంగా పెంచారు. ఒక బెంజ్ కారు షో రూమ్ ధర కోటి రూపాయలైతే… దాని మీద పన్ను మరో కోటి కట్టాలి. ఇంతింత పన్నులు కట్టి కార్లు కొనడంకంటే హాయిగా పబ్లిక్ ట్రన్స్ పోర్ట్ లో వెళ్ళడం ఉత్తమం అనేలా చేశారు.
పార్కింగ్ ప్లేస్ చూపనిదే వాహనం కొనుగోలు చేయడానికి వీల్లేకుండా బాంబేలో కొత్త నిబంధనను తీసుకువచ్చారు. ప్రస్తుతానికి కొత్తగా కొనుగోలు చేయబోయే కార్లకే ఈ నియమం. భవిష్యత్తులో పాతవాటికి కూడా పార్కింగ్ చూపించుకోవడం యజమాని బాధ్యత కావచ్చట. మన ఇంటి రెంటల్ అగ్రిమెంట్లో, సేల్ డీడ్ లో మన పేరుతో కార్ పార్కింగ్ ప్లేస్ ఉన్నట్లు డాక్యుమెంట్ చూపితేనే కొత్త కారు మన పేరుతో రిజిస్ట్రేషన్ అవుతుంది.
ఈ పని ఎప్పుడో చేయాల్సింది. ఇప్పటికైనా చేస్తున్నారు. ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్ మహానగరాల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ నిబంధనను ప్రవేశపెట్టకతప్పదు. ఆచరణలో ఇది ఎంతవరకు అమలు చేయగలరో కానీ… మంచి ఆలోచన. జనానికి మించి కార్లు, బైకులు, ఆటోలు పెరుగుతుంటే ప్రభుత్వాలు మాత్రం ఏమి చేయగలవు?
ఒకవైపు కాలుష్యం. మరో వైపు గంటల తరబడి రోడ్ల మీద ఆగిపోయే జీవితాలు. ఎన్నెన్ని కోట్ల విలువైన పనిగంటలు ట్రాఫిక్ లో ఇరుక్కుని నిరుపయోగమవుతున్నాయో! ఎన్నెన్ని కోట్ల ట్యాంకర్ల డీజిల్, పెట్రోల్ రోడ్లమీద ట్రాఫిక్ లో ఇరుక్కుని మండిపోతోందో! ఎన్నెన్ని మెట్రిక్ టన్నుల కాలుష్యం ఒక్కో గంటకు ఒక్కో మహానగరం ఉత్పత్తి చేసి… మన ఊపిరితిత్తులకు సమానంగా పంచుతోందో! ఎన్నెన్ని రోగాలకు ఈ వాహన కాలుష్యం కారణమై… ఆసుపత్రులన్నీ మూడు బెడ్లు ఆరుగురు పేషంట్లుగా ఖాళీలేకుండా దినదినప్రవర్ధమానమవుతున్నాయో! మనకెందుకు?
ఢిల్లీలో ప్రతి ఏటా దీపావళినాటికి వాయుకాలుష్యం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా నమోదు అవుతోంది. ఊపిరితిత్తుల సమస్యలున్నవారికి నరకం కనపడుతోంది. ఆ సమస్యలు లేనివారికి కొత్తగా వస్తున్నాయి. రోడ్లమీద వాహనాల్లో ఉన్నా…ఇళ్లల్లో ఉన్నా పొగ పీలుస్తున్నట్లే ఉంటోంది.
రోజూ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరంలేని ప్రయివేటు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ తో కొంతవరకు వాయుకాలుష్యం నుండి తప్పించుకోగలుగుతున్నారు. మరికాస్త పై స్థాయి ఉద్యోగులు ఢిల్లీ కాలుష్యానికి దూరంగా హిమాచల్, ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల్లో నెలలతరబడి ఉంటూ “వర్క్ ఫ్రమ్ హిల్” అనే కొత్త కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టారు.
దీనితో ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆటవిడుపుకు ఆటవిడుపు. అన్నిటికీ మించి ఢిల్లీ కాలుష్యాన్ని తప్పించుకోవచ్చు. ఇంట్లో ఉండి చేసే పనిని హాయిగా కొండా కోనల్లో రిసార్ట్ లలో, హోమ్ స్టేల్లో ఉంటూ చేస్తున్నారు. ఇంటర్నెట్ ఉంటే చాలు- ఈరోజుల్లో చాలా పనులు ఎక్కడినుండి అయినా చేయవచ్చు. మా ఉన్నతోద్యోగుల ఆరోగ్యమే మా కంపెనీల మహా భాగ్యం అని చెప్పుకుంటూ ఢిల్లీలో చాలా కంపెనీలు “వర్క్ ఫ్రమ్ హిల్”ను ప్రోత్సహిస్తున్నాయి.
మన పక్కన కూడా మూసీ (ముచుకుంద) నది పుట్టిన అనంతగిరి (వికారాబాద్ దగ్గర) కొండలున్నాయి. హైదరాబాద్ కంపెనీలు కూడా కొండాకోనల నుండి ఉద్యోగులను పనిచేసుకోవడాన్ని ప్రోత్సహిస్తే వారి ఆరోగ్యాలకు, నగరప్రజల ఆరోగ్యాలకు భరోసా ఉంటుంది.
- పాతరాతియుగం అని మనిషి రాతిగుహల్లో, అడవుల్లో ఉన్న కాలాలను ఆంత్రోపాలజీ చక్కగా వివరిస్తుంది. భూమి గుండ్రంగా ఉంటుంది. మనిషి రాతిగుహల్లో; కొండాకోనల చెట్లల్లో, పుట్లల్లో; వాగుల పక్కన; రెల్లుగడ్డి పొదల్లో; ఇసుక తిన్నెల్లో; పున్నమి వెన్నెల్లో ఎక్కడ ఎలా ప్రయాణం మొదలుపెట్టాడో మళ్ళీ అక్కడికే వెళుతున్నాడు. వెళ్ళాలి కూడా. ఇదొక జీవన చక్రభ్రమణం. పైకి వెళ్ళింది కిందికి రాక తప్పదు.
సాక్షాత్తు అవతారపురుషుడైన రాముడే పద్నాలుగేళ్ళ అరణ్యవాసం చేశాడు. అందులో నాలుగు నెలలు ప్రస్రవణ పర్వతం రాతిగుహలో ఉన్నాడు. ఆయన వనవాసానికి కారణం వేరు కావచ్చు. మన వనవాసానికి, పర్వతవాసానికి మాత్రం మనమే కారణం.
“అండా దండా ఉండాలని…
కోదండ రాముని నమ్ముకుంటే
గుండే లేని మనిషల్లే…
నిను కొండా కోనలకొదిలేశాడా?”
అని సినారె ప్రశ్నించారు.
ఆయనే ఉండి ఉంటే ఈ చరణాన్ని సవరించుకుని…
“అండా దండా ఉండాలని…
కోదండ రాముని నమ్ముకుంటే
గుండెగల మనిషల్లే…
నిను కొండా కోనల్లో రక్షించాడే”
అని ప్రస్తుత వర్క్ ఫ్రమ్ హిల్ సందర్భానికి పాజిటివ్ చరణం తొడిగేవారేమో!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article