.
చాలాచోట్ల చూసిందే… ప్లేట్లలో ఇడ్లీ పెట్టి, పైన సాంబారు పోసేస్తాడు సర్వరుడు… కస్టమరుడు కసకసా పిసికేసి, అదోరకం ఘన ద్రావణంలా చేసి తింటాడు, కాదు, జుర్రుకుంటాడు… బ్రేవ్…
అవును, ఇడ్లీ అంటే మెత్తగా కడుపులోకి జారిపోవాలి… అంతే కదా… చట్నీలు, కారం పొడి, నెయ్యి గట్రా ఆధరువులు చాలామందికి అవసరం లేదు అసలు… జస్ట్, విత్ సాంబార్… ఈరోజు ప్రపంచ ఇడ్లీ దినం… ఇదెవడు పెట్టాడు అంటారా..? ఐనా ఇడ్లీకి ఓ దినం ఏమిటి..? ప్రతి రోజూ ఇడ్లీ దినమే కదా…
తన పేరు ఎం.ఎనియవన్ … కోయంబత్తూరులో పుట్టాడు… 8వ తరగతి డ్రాపవుట్… రకరకాల ఉద్యోగాలు చేశాడు… ఆటో కూడా నడిపాడు… ఒక మహిళ ఇంట్లో ఇడ్లీలు చేసి హోటళ్లకు సప్లయ్ చేసేది… దాన్ని చూసి స్పూర్తి పొంది తనూ అలాగే చేశాడు… తరువాత చెన్నై చేరాడు ‘మల్లిపూ ఇడ్లీ’ అని ఓ రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు…
Ads
ఇక ప్రయోగాలు… అనేక సైజులు, అనేక రంగులు, అనేక రూపాలు, అనేక తయారీ పదార్థాలు, కలిపే సరుకులు… 2547 రకాలతో రికార్డు తనది… వ్యక్తుల మొహాల ఇడ్లీలు కూడా… తనే మార్చి 30 ని ప్రపంచ ఇడ్లీ దినంగా ప్రకటించాడు…
ఇక నిజానికొద్దాం… అవన్నీ అంకెలు… అంకెల కోసమే ప్రయోగాలు… అవి తినడానికి కాదు, అంకెకు జతకావడానికి… 124.8 కిలోల ఇడ్లీ తయారు చేశాడు ఓసారి… ఇడ్లీ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు తనను…
అసలు ఈ కృత్రిమ రికార్డులు, ప్రయోగాల మాటెలా ఉన్నా… తెలుగు రాష్ట్రాల్లో ఆకుల్లో వండే పొట్టెక్కలు, ఆవిరి కుడుములు, బటన్ ఇడ్లీ, తట్టే ఇడ్లీ ఎన్నాళ్లుగానో చూస్తున్న రకాలు… ఇప్పుడు మిల్లెట్స్ ప్రాధాన్యం పెరిగింది కదా… రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ అని కొత్తరకాలు వచ్చాయి… పలురకాల చట్నీలు, పొడులు సరేసరి…
నిజానికి ఇడ్లీ అంటే… తెల్లగా, మృదువుగా ఉంటేనే అది ఇడ్లీ… సంప్రదాయికంగా బియ్యం, మినప్పప్పు… పులిసిన పిండితో చేయబడే వంటల్లో టాప్ ఇడ్లీయే… ప్రపంచంలోనే ఇంత పాపులర్ ఫర్మెంటెడ్ రెసిపీ మరొకటి లేదు… ఆయిల్ లేదు, ఫ్యాట్ లేదు… ప్రొటీన్స్, కార్బ్స్… రోగులకు, బాలింతలకు కూడా ఇడ్లీయే ఆహారం…
కొందరికి ఆ ఇడ్లీని వేడిగా అలాగే ‘రా’, అంటే కచ్చా తినేయడం ఓ అలవాటు… వాళ్లు ఇడ్లీల్లో ప్రయోగాల్ని అసహ్యించుకుంటారు కూడా… ఈమధ్య ఇడ్లీలను ముక్కలు చేసి, తవ్వపై పెట్టి, నూనె వేసి, టమాట, ఉల్లి, అల్లం వెల్లుల్లి ఎట్సెట్రా చేతికందిన ఏవేవో సరుకులు, మసాలాలన్నీ వేసేసి, తవ్వ ఇడ్లీ అని అమ్ముతున్నారు స్ట్రీట్ డిష్‌గా… సరే, ఎవరి టేస్ట్ వాళ్లది…
పెద్ద హోటళ్లలో ఇడ్లీ సైజు పెద్దది, గట్టిది… అందుకే చాలామంది పాకల్లో, చిన్న హోటళ్లలో, వీథుల్లో అమ్మే చిన్న ఇడ్లీలను ఇష్టపడతారు… ఇప్పుడు ప్రతి ఇంటి వంట అయిపోయింది గానీ గతంలో తెలంగాణలో ఇడ్లీ చాలా అరుదు… అయితే అంబలి, లేదంటే గట్క లేదా జొన్న రొట్టె… ఇప్పుడు అందరూ దోస, ఇడ్లీ స్రవంతిలోకి వచ్చేశారు… అది వేరే కథ…
ఇడ్లీలు మిగిలిపోతే ఏం చేయాలి అనేది పెద్ద ప్రశ్న చాలామందికి… పారేయబుద్ది కాదు… చల్లగా అయిపోయాక తినబుద్ది కాదు… అందుకే తెలంగాణలోని చాలా ఇళ్లల్లో గృహిణులు పోపు ఇడ్లీ చేసేస్తుంటారు… ఇడ్లీలను పొడి పొడి చేసి, ఫ్రైడ్ రైస్‌లాగే ఫ్రైడ్ ఇడ్లీ చేసుకోవడమే… ఎక్కువగా పెసరపప్పు యాడ్ చేస్తుంటారు… ఇడ్లీ గురించి రాస్తూపోతే ఒడవదు, తెగదు… అంతే…
అవునూ, ప్రపంచవ్యాప్తంగా వంటకాలకు ర్యాంకులు ఇచ్చే ఆ టేస్ట్ అట్లాస్ గాడి కంటికి ఈరోజుకూ ఇడ్లి ఎందుకు ఆనలేదు..?!
చక్రాకారం ధవళమృదులం చారురూపం సుభక్ష్యం
చట్నీయుక్తం ఘృతవిరచితం క్షారచుర్ణాట్ విభూష్యం
సుపే సిక్తం రసభరమిదం సర్వదా సంప్రయుక్తం
ఇడ్లీ నామ్నాయం ఉదరశుభదం పూర్ణతః భోక్తుమీడే
.
దీని అర్థం నన్నడగొద్దు… ఇడ్లీ చాలామందిలో అలా కవిత్వాన్ని సునామీలా ఉప్పొంగిస్తుంది… అంతే…
Share this Article