మన మెయిన్ స్ట్రీమ్ మీడియాకు, మెజారిటీ యూట్యూబర్లకు, సైట్లకు…. భజన తప్ప ఇంకేమీ తెలియదు… హీరోల గురించి, సినిమా స్పాట్ వార్తల గురించి ఒకటే పిచ్చి మోత… క్రిటికల్‌గా వెళ్లడం సున్నా… నిన్నటి నుంచీ ఒకటే ఊదరగొడుతున్నారు… ‘‘సల్మాన్ కొత్త సినిమాలో బతుకమ్మ పాట పెట్టారు, తెలంగాణ కల్చర్‌కు పెద్దపీట వేశారు… మస్తు హిట్టయింది ఆ పాట… ఎక్కడ చూసినా ఆ పాటే… ఇప్పుడిక లుంగీ డాన్స్‌తో కొత్త జోష్ నింపారు, రాంచరణ్ కూడా వెంకటేశ్, సల్మాన్‌లతో కాలుకలిపి స్టెప్పులేయడం నభూతో, నభవిష్యతి… తెలుగు ప్రేక్షకలోకం పండుగ చేసుకుంటోంది…’’ ఇలా సాగిపోతున్నాయి వార్తలు…
అవన్నీ చదివాక ఫస్ట్ అనిపించింది ఫాఫం వెంకటేశ్‌కు ఏమైంది అని…! మొన్నమొన్న పరమ బూతు ఛండాలాన్ని తన అభిమానులకు రానానాయుడిగా పంచిపెట్టిన ఈ వెటరన్ ఫేస్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమాలో ఓ సైడ్ హీరో పాత్ర చేస్తున్నాడు… ఈ రానానాయుడు పాన్ ఇండియా కంటెంటు అట… ఇక దేశవ్యాప్తంగా వెంకటేశ్‌కు అభిమానులు పెరుగుతారట… దాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి సల్మాన్‌తో కలిసి లుంగీ డాన్స్ చేశాడట… సల్మాన్, వెంకటేశ్ ఇద్దరివీ పంచ్ లేని ముసలి స్టెప్పులే కాబట్టి రాంచరణ్‌కు తీసుకొచ్చి గెంతులు వేయించారట…
Ads
ఒకడు పంచెకట్టు అదిరిపోయింది అని రాస్తాడు… ఒరేయ నాన్నా, అది అది లుంగీరా బాబూ, పంచెకట్టుకూ, లుంగీ కట్టుకోవడానికి తేడా తెలియకుండా భజన చేస్తే ఎలా తండ్రీ…!! ఇంతమంది ఇలా రాస్తున్నారు కదాని యూట్యూబ్‌లో ఆ పాట ఓపెన్ చేస్తే హఠాత్తుగా ఓ ఇకారం… మొన్ననే బతుకమ్మ పాటను సల్మాన్ సినిమా టీం ఎలా ఖూనీ చేసిపడేసిందో చెప్పుకున్నాం కదా… బతుకమ్మలోకి గొబ్బెమ్మలను ప్రవేశపెట్టి, పూజా హెగ్డేతో చేతులతో ఏవో వెకిలి సైగల్ని చేసిన తీరును కూడా చెప్పుకున్నాం కదా…
అంటే ఆల్‌రెడీ సదరు సినిమా పైత్యం మీద మనకు ఓ అవగాహన ఆల్‌రెడీ ఏర్పడిపోయింది… ఏంటమ్మా అనే తెలుగు పదంతో స్టార్టయ్యే ఈ చిత్రవిచిత్రమైన కిలికిలి భాష పాట మొత్తం సినీసాహిత్యం మీదే వైరాగ్యానికి తావిస్తుంది… (లుంగీ డాన్స్ అంటే ఎలా ఉండాలో ఆల్‌రెడీ షారూక్ చేసి చూపించాడు, ఈ సల్మాన్ సినిమా టీం ఆ పాట చూసిందో లేదో మరి…)
ఇక ఈ పాటకొస్తే… అప్పుడే తెలుగు పదాలు, వెంటనే హిందీ పదాలు, రెండూ మిక్స్ చేసిన చరణాలు… మొత్తానికి సదరు లిరిక్స్ రైటర్ ఎవరో గానీ, ఆ సంగీత దర్శకుడు ఎవరో గానీ వాళ్ల జన్మలు ధన్యం… బహుశా ఆస్కార్ వాళ్లు 80 కోట్ల ఖర్చు కూడా అవసరం లేకుండా, ఈసారి వాళ్లే వచ్చి, నిర్మాత కాళ్లు పట్టుకుని మరీ అవార్డులు ఇస్తారేమో… నాటునాటు పాటకు ఆస్కార్ రాగా లేనిది ఈ పాటకు రావొద్దని ఏముంది..? అన్ని విధాలా అర్హమే…
తెలుగిందీ, హింతెలుగు పదాలు, వాక్యాల నడుమ ఏమైనా అర్థమవుతుందేమోనని పలుసార్లు రీవైండ్ చేసినా సరే, నా ప్రయత్నం అట్టర్ ఫ్లాయింది… తెలుగును హిందీలో పాడుతున్నాడు ఆ అద్భుత గాయకుడు ఎవరో గానీ… హిందీని తెలుగులా పాడుతున్నాడు మరెవరో… మధ్యలో పూజా హెగ్డే వచ్చిన లుంగీని నడుం సహా తెగ ఊపేస్తోంది… ఫాఫం రాంచరణ్… సల్మాన్, వెంకటేశ్‌ల నడుమ ఇరుక్కుని, ఇజ్జత్ పోగొట్టుకున్నాడు… గాడ్‌ఫాదర్ కోసం చిరంజీవి పక్కన తెగ కష్టపడి, బోలెడు ప్రయాసతో నటించి, సినిమాను దెబ్బతీసిన సల్మానుడికి రాంచరణ్ కాస్త రుణం చెల్లించుకున్నట్టున్నాడు ఈ పాట, ఈ లుంగీ డాన్స్‌తో…!!
మరి వెంకటేశుడు ఏం సాధించినట్టు… రానానాయుడితో వచ్చిన వెగటు ఇమేజీని ఈ లుంగీ స్టెప్పులతో మరింత బలపర్చుకున్నాడు… అంతేనా..?! అవునూ, చెడ్డీలు కనిపించేలా స్టెప్పులు వేస్తే యంగ్ జోష్ అంటారా… ఇప్పటిదాకా ఇలాంటి సాంగ్స్‌లో ఆడ నడుం ఊపులే చూశాం కదా, ఇప్పుడు మగ నడుంల ఊపులు కూడా…!!
Share this Article