Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కామెడీ షోయా..? డాన్స్ షోయా..? మ్యూజిక్ షోయా..? ఎవడుర భయ్ ప్లానర్..!!

May 22, 2022 by M S R

ఎందుకు రియాలిటీ షోలకు సంబంధించి స్టార్ మాటీవీ అడ్డంగా ఫెయిలైపోతోంది… ఏదో సీరియళ్ల రేటింగ్స్‌‌తోనో, ఇంకే కారణాలతోనో కథ నడిచిపోతోంది… టాప్‌లో ఉంటోంది కానీ… ఒక్కటంటే ఒక్క రియాలిటీ షోను కూడా సక్సెస్ చేసే తెలివిడి లేదు దాని క్రియేటివ్ టీంకు..! ఉదాహరణ తీసుకుందాం… తాజాగా సూపర్ సింగర్ జూనియర్ అని స్టార్ట్ చేశారు… ఆల్‌రెడీ ఈటీవీలో పాడుతా తీయగా ఉంది, స్వరాభిషేకం ఉంది… జీటీవీలో సరిగమప ఉంది… నాకేం తక్కువ అని సూపర్ సింగర్ స్టార్ట్ చేసింది మాటీవీ… ఇతర భాషల్లో స్టార్ గ్రూపు చేస్తున్న పనే… గతంలో తెలుగులోనూ చేసిందే… కానీ..?

ఆదివారం… అనగా ఈరోజు ఈ షో లాంచ్ చేసింది… అట్టహాసం, ఆడంబరం, కళ్లు చెదిరే రంగుల వెలుతురు… ఈటీవీ నుంచి అంతటి సుడిగాలి సుధీర్‌నే మాటీవీలోకి లాగిపారేశారు ఓ యాంకర్‌గా… మరో స్టార్ యాంకర్ అనసూయను తీసుకొచ్చారు… అత్యంత పాపులర్ గాయని చిత్ర, మనో, హేమచంద్ర, రాణినారెడ్డి జడ్జిలు… పాప్ స్టార్ ఉషా ఉతుప్… ఫుల్ ఆర్కెస్ట్రా, కోరస్ టీం… అరెరె, ఇంకేం కావాలి..? కానీ షో ఎంత దరిద్రంగా ఉందంటే… ఓ కామెడీ షో చేసేశారు… ఒక పెళ్లి ఈవెంట్ లా అనిపించింది… చివరికి ఆ పిల్ల గాయకులనూ కమెడియన్లుగా మార్చారు… పిచ్చి స్టెప్పులు వేయించారు… దీన్ని ఏదో వినోదపు ఈవెంట్‌లా మార్చిపారేశారు…

చివరకు పిల్లలు పాడుతుంటే వెనుక డాన్సర్ల పిచ్చి గెంతులు… అసలు ఇది మ్యూజిక్ కంపిటీషనా..? స్టార్ మాటీవీ క్రియేటివ్ టీం భావదారిద్య్రానికి ఓ ఘన నివాళి అర్జెంటుగా అర్పించాలి… ఆ హంగామాలో అసలు ఆ పిల్లలు కూడా ఏం పాడుతున్నారో వాళ్లకు కూడా అర్థమవుతుందో లేదో డౌటే… మధ్యలో మంగ్లీ వచ్చి పాడింది, చిత్ర పాడింది… (నిజానికి మంగ్లీని అనసూయకు బదులుగా హోస్ట్‌గా తీసుకుంటే బాగుండేది… అనసూయకు వయస్సు మీదపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి… పైగా ఆమెకు పాట అంటే ఏమీ తెలియదు…)

super singer

అనసూయకే కాదు… నిజానికి ఆ టీం అంతా అంతే… ఉషాఉతుప్‌కు తెలుగు రాదు… చిత్రకు కూడా రాదు… మనోకు తెలుసు, హేమచంద్రకు మాత్రం తెలుసు… రాణినారెడ్డికి చాన్నాళ్లుగా పాటల్లేవు… ఆమె తెలుగు ప్రేక్షకులకు పాపులర్ కాదు… ఆమె విద్వత్తును మనం ఇప్పుడే అంచనా వేయలేం… బహుశా ప్రచార ప్రోమోలను బట్టి చూస్తే ఉషా ఉతుప్ టెంపరరీ కావచ్చు… సరే, వ్యక్తులు ముఖ్యం కాదు, షో ప్లాన్ చేసిన తీరే దరిద్రం… సో, ఇవ్వాల్టి దినానికి జీటీవీ, ఈటీవీ, మాటీవీ మ్యూజిక్ షోలతో పోలిస్తే… ఆహాలో వచ్చే తెలుగు ఇండియన్ ఐడల్ చాలా చాలా నయం… జడ్జిమెంట్లలో గానీ, హోస్టింగులో గానీ..!!

జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ నుంచి అందరూ వెళ్లిపోతున్నా సరే… మాటీవీలోకి కామెడీ స్టార్స్ తీరం చేరుకుంటున్నా సరే… మంచి సీనియర్ కమెడియన్లను తీసుకుంటున్నా సరే… జబర్దస్త్‌ రేటింగ్స్‌తో పోలిస్తే కామెడీ స్టార్స్ సగం రేటింగ్స్ కూడా సంపాదించడం లేదు… (గత వారం జబర్దస్త్ 4 అయితే కామెడీ స్టార్స్ జస్ట్, 2 రేటింగ్స్…) ఎందుకు అని ఓసారి పరిశీలనగా చూస్తే… దాని ప్లానింగ్, ఆపరేషన్ కూడా దరిద్రంగానే అనిపించినయ్…

ఆర్పీ స్కిట్ ఒకటి చూస్తే నిజంగా మాటీవీ మీద జాలేసింది… తమ ఎఫ్3 ప్రమోషన్ కోసం వచ్చి జడ్జిగా కూర్చున్న అనిల్ రావిపూడి ఎందుకు నవ్వుతున్నాడో… నాగబాబు ఎందుకంతగా కుమిలి కుమిలి, అనగా పడీపడీ వికటాట్టహాసాలు చేస్తున్నాడో ఓపట్టాన అర్థం కాలేదు… ఎవరో కమెడియన్ హరి అట, బుల్లెట్ రైలు వేగంతో మాట్లాడేస్తున్నాడు… కామెడీ స్కిట్‌లో ప్రధానంగా కావల్సింది ఆ డైలాగ్, ఆ పంచ్ ప్రేక్షకులకు వినబడాలి, అర్థం కావాలి… ఆ సోయి కూడా కనిపించలేదు…

జబర్దస్త్‌లో ఉన్నన్నిరోజులూ అవినాష్ ఒళ్లు దగ్గర పెట్టుకుని కామెడీ చేసేవాడు… బిగ్‌బాస్‌లో చేరి, తరువాత మాటీవీలో చేరాక తనలో టైమింగ్ దెబ్బతిన్నట్టు అనిపిస్తోంది… అంత సీనియర్ ధనరాజ్ కూడా కామెడీ చేయడంలో కిందామీదా పడుతున్నాడు… వీళ్లందరూ ఒక్కసారి… జస్ట్, ఒక్క స్కిట్… జబర్దస్త్‌లో లేడీ కమెడియన్ ఫైమా చేసిన స్కిట్ చూడాలి… ఆ ఎనర్జీ, ఆ టైమింగ్ పరిశీలించాలి… సుధీర్‌ను ఎలా వాడుకోవాలో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి నేర్చుకోవాలి… ఒక కామెడీ షో చేతకాదు, ఒక మ్యూజిక్ షో చేతకాదు… మరి మాటీవీకి ఏ రియాలిటీ షో చేతనవుతుంది..?!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • ఉక్రెయిన్ సంక్షోభం..! రష్యాలో మన రిటెయిలర్లకు భలే చాన్సు..!!
  • గుప్తగామిని..! 18 ఏళ్ల క్రితమే పవిత్ర హైదరాబాద్‌కు చక్కర్లు కొట్టేది… ఎందుకు..?!
  • ఒకప్పుడు పొట్టతిప్పల చిరుద్యోగం… ఈ ‘‘యాక్టింగ్ సీఎం’’ ప్రస్థానం ఇంట్రస్టింగ్…
  • హబ్బ… మక్కీకిమక్కీ ఆ కథ మొత్తం ఏం కొట్టేశావు బాసూ…
  • నక్సలైట్ల గురించి తెలియకుండా ఈ సినిమాలు ఏమిట్రా నాయనా..?!
  • మోడీ మళ్లీ ప్రధాని కాగానే 50 రాష్ట్రాలు… 50 united states of India..!
  • ఈ ఆనందం పేరేమిటంటారు ఆంధ్రజ్యోతి మహాశయా..?
  • నిరోధ్ వాడితే కేసు..! పిల్స్ దొరికితే జైలు..! కాపర్ టీ వేసుకుంటే అరెస్టు..!!
  • ఆనంద్ దిఘే..! ఏకనాథ్ షిండేకు పదునుపెట్టిన ‘పెదరాయుడు’…!
  • అరివీర కంపర పాత్రికేయం..! లోలోతుల్లోకి ఇంకా వేగంగా తెలుగు జర్నలిజం…!!

Archives

Copyright © 2022 · Muchata.com · Technology Support by CultNerds IT Solutions