టేస్ట్ అట్లాస్… పాపులర్ ఫుడ్ వెబ్‌సైట్… సూప్స్ దగ్గర నుంచి స్నాక్స్, మెయిన్ కోర్స్, కర్రీస్, డెజర్ట్‌ల దాకా రకరకాల కేటగిరీల్లో ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది… సరే, ఈ ర్యాంకుల ఖరారుకు పాటించే ప్రామాణికత ఏమిటో, శాస్త్రీయత ఏమిటో తెలియదు గానీ… ప్రపంచవ్యాప్తంగా ఫుడ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటుంది…
ఎటొచ్చీ… చాలా ర్యాంకుల్ని మనం అంగీకరించలేం… టాప్ ఫుడ్స్ మాత్రమే కాదు, వరస్ట్ ఫుడ్స్ ను కూడా అది వర్గీకరిస్తూ ఉంటుంది… అందులో మనం ఇష్టపడే ఐటమ్స్ ఉంటే చివ్వుమంటుంది… ఈ స్టోరీ అదే…
గజక్… పల్లీలు, నువ్వులు ప్లస్ బెల్లంతో చేసే పట్టీలు ఇవి… దేశవ్యాప్తంగా పిల్లలకు, పెద్దలకు బలవర్ధకమైన ఫుడ్ ఐటమ్… పలు రాష్ట్రాల్లో పిల్లలకు ప్రభుత్వమే పంపిణీ చేస్తుంటుంది కూడా… దీనికి టేస్ట్ అట్లాస్ మరీ 2.8 రేటింగ్ ఇచ్చింది… నిజానికి టేస్టులో గానీ, ఫుడ్ న్యూట్రిషన్‌లో గానీ దేనికీ తీసిపోదు… శ్రమ తక్కువ, ఖర్చు తక్కువ, చాన్నాళ్లు నిల్వ ఉంటుంది… తక్షణ శక్తిప్రదాయిని… మరి రేటింగులో ఈ అంశాలెందుకు పరిగణనలోకి రాలేదు..?
Ads
జల్ జీరా… ఇది వరస్ట్ పానీయం అట… నిజానికి నార్త్ ఇండియాలో విస్తృతంగా తాగబడే పానీయం ఇది… దీనికి మరీ 2.7 రేటింగ్స్ ఇచ్చి వరస్ట్ నంబర్ వన్ అనేసింది ఆ సైటు… ఈ పానీయం కడుపులో అలజడిని తగ్గించి, జీర్ణశక్తిని పెంచే చౌక పానీయం… తెంగై సదమ్ అని తమిళనాడు ఫుడ్ ఐటమ్… కొబ్బరితో చేస్తారు… దీనికి 3.0 రేటింగ్స్ ఇచ్చి వరస్ట్ నెంబర్ త్రీ అనేసింది టేస్ట్ అట్లాస్…
పంటా భట్ అని ఓ బెంగాలీ వంటకం… మనం చద్దన్నం చేసుకున్నట్టే దీన్ని కూడా పులియబెట్టిన అన్నంతో చేస్తారు… ఫిష్ కూడా దీనికి ఆధరువు… దీనికి 3.0 రేటింగ్స్ అట… ఇది తూర్పు భారతంలో పాపులర్… నిజానికి ఫర్మెంటెడ్ ఫుడ్ ఇండియన్ స్పెషాలిటీ… ఆరోగ్యానికి మంచిది… ప్రొ-బయాటిక్స్… ఈ ఫుడ్ విలువను ఇప్పుడిప్పుడే విదేశాలూ గుర్తిస్తున్నాయి… కానీ టేస్ట్ అట్లాస్ వాడు మాత్రం చెత్త ఆహారాల్లో చేర్చేశాడు…
ఆలూ బైంగాన్… వంకాయలు, ఆలుగడ్డలతో చేసే కూర… వండటం సులభం… సౌత్ ఇండియాలో పాపులర్ రెసిపీయే… కాకపోతే కొంతమందికి ఈ కాంబినేషన్ నచ్చదు కూడా… దీనికి కూడాా సదరు సైట్ 3.0 రేటింగ్ ఇచ్చింది… తండై అని నార్త్ ఇండియాలో ఫేమస్ డ్రింక్… ప్రత్యేకించి నవరాత్రి ఉత్సవాలు, హోలీ, మహాశివరాత్రి వంటి సందర్భాల్లో ఇళ్లల్లో చేసుకుంటారు… గసగసాలు, సోంపు, పుచ్చ గింజలు, బాదం పప్పు, యాలకులు, చక్కెర, పాలు… మంచి సత్తువ ఇచ్చే పానీయం… దీన్నీ చెత్త ఆహారం జాబితాలో చేర్చారు వాళ్లు…
అచప్పమ్ అని తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఓ స్నాక్… మన మురుకులు టైపు… ఎక్కువగా మలయాళీల ఇళ్లల్లో కనిపించే చిరుతిండి… బియ్యపు పిండితో డీప్ ఫ్రై చేస్తారు… దీనికి 3.2 రేటింగ్ అట… మిర్చీకాసాలన్… బిర్యానీ ప్రియులకు బాగా తెలిసిన, నచ్చిన కరీ టైప్ రెసిపీ… సరిగ్గా వండాలే గానీ బిర్యానీకి తోడుగా అదిరిపోయే వంటకం ఇది… ఇతర వంటకాలకూ ఆధరవుగా వాడినా సరే బిర్యానీతోనే ఫేమస్…
చాలామంది ఇష్టపడేది, ఐనా సరే టేస్ట్ అట్లాస్ వాడు 3.2 రేటింగ్ ఇచ్చాడు… ఇక మనందరికీ తెలిసిన ఉప్మా… ఈ ఉప్మాహారం మీద బోలెడన్ని జోకులు కూడా… చాలామందికి నచ్చకపోవచ్చుగాక, కానీ త్వరగా వండి, గెస్టులకు తక్షణం మర్యాద చేయగల, కడుపు నింపగల వంటకం… ఇంగ్రెడియెంట్స్‌ను బట్టి న్యూట్రిషన్ లెవల్స్ కూడా… ఇది వరస్ట్ జాబితాలో టెన్త్ ప్లేస్ అట… ప్చ్, ఈ టేస్ట్ అట్లాస్ వాడికి అస్సలు టేస్ట్ లేదు అనిపిస్తోందా..? మీ అభిప్రాయంలో హేతుబద్ధత ఉంది, న్యాయం ఉంది..!!
Share this Article