అడిగేవాడికి చెప్పేవాడు లోకువ… సినిమావాళ్లు ఎలాగూ దొరికారు కదాని కొందరు ఫిలిమ్ జర్నలిస్టులు ఏవేవో ప్రశ్నలు వేస్తూ, చివరకు సినిమావాళ్లు ప్రెస్‌మీట్లు అంటేనే చికాకుపడే సిట్యుయేషన్ తీసుకొస్తున్నారు ఈమధ్యకాలంగా..! సినిమాకు సంబంధం లేని ప్రశ్నలు, ఏవో గెలికి, ఏదో రాబట్టే విఫల ప్రయత్నం చేసి, హబ్బ, భలే అడిగాం ప్రశ్నల్ని అనుకుని వాళ్లే భుజాలు చరుచుకునే విచిత్ర ధోరణి…
సోకాల్డ్ సీనియర్ జర్నలిస్టులు కూడా మినహాయింపేమీ కాదు… తెలుగమ్మాయి, హీరోయిన్ అనన్య నాగళ్ల ఓ లేడీ రిపోర్టర్ ప్రశ్నలకు మంచి సమాధానాలు ఇచ్చి నోరుమూయించింది అనే ప్రశంసల్ని, అభినందనల్ని చదువుతుంటే… అసలు ఏమిటి ఈ కథ అని యూట్యూబ్‌లో ఆ వీడియో చూశాను… పక్కాగా మీడియా నుంచే తప్పు కనిపించింది…
ఆ లేడీ రిపోర్టర్ ఎవరో గానీ బడబడా తనే అడిగేస్తోంది… మరి మిగతా జర్నలిస్టులు కూడా అభ్యంతర పెట్టినట్టు కనిపించలేదు… వరుసగా దర్శకుడికి, నిర్మాతకు, హీరోయిన్‌కు తనే ప్రశ్నలు అడిగేస్తోంది… ఎప్పుడో 1980 కాలం నాటి కథ దేనికి..? వర్తమాన సమస్యల మీదే తీయొచ్చు కదాని ఒక ప్రశ్న… ఏ కథ తీసుకోవాలి, ఆ కథలో ఏముండాలి, కథాకాలం ఏమిటనేది సినిమా తీసే నిర్మాత, దర్శకుల ఇష్టం… అంతేతప్ప, ఇది తీయాలి కదా, అదెందుకు తీసుకున్నారు అనే ప్రశ్న ఏమిటసలు..?
Ads
జర్నలిస్టు అంటే ఏమైనా అడగొచ్చు అనే భ్రమల్లో ఉన్నారా వీళ్లంతా..? ఇంకా నయం, ఆ టైటిల్ ఎందుకు..? వేరే టైటిల్ పెట్టొచ్చు కదా, ఈ హీరోయినే ఎందుకు, ఫలానా హీరోయిన్‌ను తీసుకోవచ్చు కదా వంటి ప్రశ్నలూ ఎదురవుతాయేమో మున్ముందు… పోనీ, వీళ్లకు స్టార్ హీరోలు, స్టార్ నిర్మాతలు, స్టార్ దర్శకులను ఇలాంటి ప్రశ్నలు అడిగే సాహసం ఉందా..? అది మాత్రం ఉండదు… పొట్టేల్ అని ఏదో ఓ సినిమా తీశారు, ప్రమోషన్ కోసం మీడియామీట్ పెడితే ఇవా ప్రశ్నలు అడగాల్సింది..? పైగా ఇండస్ట్రీలోకి రావడానికి తెలుగమ్మాయిలు భయపడిపోతున్నారట… ఎవడు అవకాశాలిస్తే ఎవరు భయపడ్డారమ్మా..! (ఏమో ఇలాంటి ప్రశ్నల్ని, జర్నలిస్టుల్ని ఫేస్ చేయాల్సి వస్తుందని భయపడిపోతున్నారేమో తెలుగమ్మాయిలు..?)
అందుకే మొదట్లోనే చెప్పింది… అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అని..!! ఏమైనా అంటే జర్నలిస్టులు ఏదేదో రాసేస్తారని భయం… ఆమధ్య అంతటి సీనియర్ హోస్ట్ సుమ సరదాగా ఏదో స్నాక్స్ అంటే, దాన్ని కూడా రచ్చ చేసి, సారీ చెప్పించుకున్నారు తెలుసు కదా… తిక్క ప్రశ్నలకు జవాబులు చెప్పలేక, వాళ్లను చూసి జాలిపడలేక, ఏమీ అనలేక సినిమా సెలబ్రిటీలు లోలోపల బూతులు తిట్టుకుంటారు…
మరీ ఘోరంగా కమిట్మెంట్ ఇస్తేనే చాన్సులు ఇస్తారు కదా, మీ ఇండస్ట్రీ వాళ్లే చెబుతున్నారు, పారితోషికం కూడా కమిట్మెంట్‌ను బట్టే ఉంటుందట కదా అని ఏదేదో అడిగేసింది… అసందర్భం… నువ్వు ప్రత్యేకంగా అనన్య ఇంటర్వ్యూ తీసుకుని ఆ ప్రశ్న వేయి, ఆ మీడియామీట్ ఉద్దేశం ఏమిటి..? ఈ ప్రశ్నలేమిటి..? అనన్య కూడా మంచి పరిణతిలోనే సమాధానాలిచ్చింది… కీపిటప్… సోకాల్డ్ జర్నలిస్టులు ఈ సమాధానాలతో కక్షకడతారేమో కాస్త జాగ్రత్తమ్మా… అద్భుతమైన మేధోసంపత్తి, అబ్బురపరిచే పాత్రికేయ ప్రమాణాలతో విలసిల్లే ఇండస్ట్రీ మనది… ఎడ్డిమొహాలతో, తెలివిలేనట్టుగా కనిపించాలి… సరేనా..?!
Share this Article