ఓ దిక్కుమాలిన కథ… ఓ పనికిమాలిన కథనం… ఓ తలతిక్క సీరియల్…! నిజానికి 950 ఎపిసోడ్లుగా టాప్ వన్ సీరియల్‌గా ఉంటూ, కోట్లాది మంది ఆదరణ మాటేమిటో గానీ… కోట్లకుకోట్లు కొల్లగొడుతున్న సీరియల్ అది…! పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలను మించి… ఇకపై ఏ సీరియల్ ఈ రేటింగ్ పొందదు అనే స్థాయిలో టీఆర్పీలు కొడుతున్న సీరియల్…! కార్తీకదీపం..! దాని గురించి నెగెటివ్ కామెంట్ చేయాలంటే బాగా ఆలోచించి చేయాలి… కానీ అంత ఆలోచన అవసరం లేదు… టాప్ వన్ సీరియల్ అదే… అనేకానేక సీరియల్ అవలక్షణాల్లోనూ టాప్ వన్ అదే… కామన్ సెన్స్‌కు, లాజిక్కు దూరంగా… ఏవేవో ట్విస్టులతో… కథకుడి దయ, దర్శకుడి కరుణ, మన భాగ్యం, మన ప్రాప్తం అన్నట్టుగా సాగుతుంది… సింపుల్‌గా చెప్పాలంటే… ఓ అనుమానప్పీనుగు హీరో… ఓ సతీ సావిత్రి తరహా హీరోయిన్… యంగ్ లేడీ యమ అన్నట్టుగా ఓ విలన్… ఇదీ కథ… దాని చుట్టూ కథనం రోజుకో పిల్లిమొగ్గ వేస్తూ సా–గు–తూ ఉంటుంది…
కాకపోతే ఈ సీరియల్ బలం ప్రేమి విశ్వనాథ్… నిస్సందేహంగా తను మంచి నటి… మిగతా వాళ్లతో పోలిస్తే ఆమే ఈ సీరియల్‌ను తన భుజాల మీద మోస్తోంది… ఆమె తరువాత ఆ ఇద్దరు పిల్లలు కృతిక, సహృద… వాళ్ల కోసమే ప్రస్తుతం ప్రేక్షకులు ఈ సీరియల్ చూస్తున్నారు… నిరుపమ్, సౌందర్య, మోనిత వోకే వోకే… ప్రధానంగా ఈ సీరియల్ విశేషం ఏమిటంటే..? ప్రతి సీరియల్లోనూ అత్త అంటే ఓ పిశాచి, ఆడపడుచు అంటే ఓ రాక్షసి, ఎప్పుడూ కోడళ్లను హతమారుద్దామా అని చూస్తుంటారు… మామ, భర్త తదితరులు నల్కా కేరక్టర్లు… దీనికి భిన్నంగా కార్తీకదీపం సీరియల్లో… మొదట్లో కోడలిపై విషం కక్కినా సరే, తరువాత తనే మారిపోయి, సౌందర్య అనే అత్త కేరక్టర్ కోడలు దీపకు అండగా ఉంటుంది… హీరో కేరక్టరైజేషన్ ఎంత చెత్తగా ఉన్నా సరే (అఫ్ కోర్స్, అన్ని పాత్రలూ అంతే…) సీరియల్ నిలబడటానికి కారణం ప్రేమి, ఆ పిల్లలు, కథలోని కొన్ని పాజిటివ్ సైడ్స్…
Ads
ఇప్పుడు చెప్పుకునేది ఏమిటయ్యా అంటే… శనివారం, అంటే నిన్న సీరియల్లో కాస్త తెలివైన డైలాగులు… భారీ తెలుగు సినిమాల రేంజ్ పంచ్ డైలాగులు వినిపించాయి… అఫ్ కోర్స్, బాగున్నయ్… అవి వినగానే ఈ సీరియల్ తిక్క దర్శకుడిని వెళ్లగొట్టి, కొత్త దర్శకుడిని తెచ్చిపెట్టారా..? డైలాగ్ రైటర్‌ను కొత్తగా తీసుకొచ్చారా..? అనే సందేహాలు కలుగుతాయి… ‘‘నీ బిడ్డ సౌర్య తండ్రి కోసం ఏడుస్తోంది, నాకూ జాలి ఉంది, కానీ జాలి నుంచి తండ్రి పుట్టడు దీపా… తండ్రి అంటే నమ్మకం, ఆ నమ్మకం ఆ బిడ్డ పుట్టకముందే పోయింది… దానికి కారణం నీకు తెలుసు…’’ ‘‘అలిసిపోయాను, మనసు అలిసిపోతే ఇంకా భవిష్యత్తు మీద ఆశలేముంటయ్..?’’ ‘‘తల్లి నిజం, తండ్రి నమ్మకం… కానీ నమ్మకాన్ని నిజం అని నిరూపించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందని నీలాంటి డాక్టర్‌కు నాలాంటి వంటలక్క చెప్పాలా..?’’ “నీ నమ్మకం నిజం అని నిరూపణ కావాలని కోరుకుంటున్నా” (ఇలాంటివే మరికొన్ని డైలాగులు…)(మెల్లిమెల్లిగా ఇక ఆ సీరియల్ ను ముగింపు దిశగా తీసుకెళ్తున్న టు మనకు బోధపడుతుంది…)
ఆ కథ అసలు లోతును, ఆ కేరక్టర్ల స్థితిగతులను అచ్చంగా పట్టించే డైలాగులివి… అంతేకాదు, తండ్రి నమ్మకం మాత్రమే కాదు, నిజం కూడా అని నిరూపించే ఆధునిక పరిజ్ఞానం సంగతిని ప్రస్తావించి…. ఇన్నేళ్లూ ఈ సీరియల్ ఆ అజ్ఞానపు పాయింట్ మీదే నడుస్తున్న తీరును తామే మొహం మీద కొట్టుకున్నట్టుగా కూడా ఉన్నయ్ ఆ డైలాగులు… గుడ్, డైలాగ్ రైటర్ ఎవరో గానీ భలే ఆత్మవిమర్శ రాశాడు… అసలు నిజం అదే… ఒకప్పుడు ‘‘తల్లి నిజం- తండ్రి నమ్మకం’’… తండ్రి ఎవరో నిరూపించలేని రోజుల్లో… కానీ ఇప్పుడు సింపుల్… డీఎన్ఏ టెస్టు చాలు… ఇప్పుడు ‘‘తల్లి నిజమే- పరీక్షిస్తే తండ్రి కూడా నిజమే’’ అనాలి… కాకపోతే మధ్యలో మోనిత అనే విలనీ కేరక్టర్ హీరోకు పిల్లలు పుట్టరనే తప్పుడు సాక్ష్యాలు పుట్టించడం, వీడు అవి నిజమని నమ్మేయడం, హీరో ఎవరో కవితో అక్రమ సంబంధం పెట్టుకుని, ఈ పిల్లల్ని కన్నదని అనుమానించడం… ఈమె ఎన్నేళ్లయినా సరే, నీ పిల్లలేరా మగడా అని నిరూపించి, తన దగ్గరకు చేరాలని తెగ విపరీతంగా కథను సాగదీయడమే ఈ సీరియల్… ఒక హాస్పిటల్ నడిపే మొనగాడు, స్వయంగా పెద్ద డాక్టర్ తనకు సంబంధించిన పరీక్షల్ని తను చదువుకోలేడా..? డీఎన్ఏ టెస్టులు చేసుకుని, వాళ్లు తన పిల్లలే అని తెలిస్తే, మరోసారి తన సంతానసాఫల్య పరీక్షల్ని మళ్లీ చేయించుకునేవాడు కదా… ఇంకెవరో డాక్టర్ చెప్పగానే నమ్మేస్తాడా..? కానీ ఈ కోట్ల విలువైన సీరియల్ నడుస్తున్నదే ఈ నాన్సెన్స్ పైన కదా… కానివ్వండి… కానివ్వండి…
Share this Article