మోహన భోగరాజు… ఎనిమిదేళ్లుగా పాటలు పాడుతోంది… బాహుబలిలో మనోహరీ పాడినప్పుడు ఎవరబ్బా ఈమె అనే ఆసక్తి క్రియేటైంది… ఆమె ఎక్కువగా కీరవాణి సంగీత దర్శకత్వంలో పాడుతోంది, కానీ మనోహరి పాట మిగతా అన్నిపాటలకన్నా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది… అఫ్ కోర్స్, చాలా పాటలు హిట్టయి ఉండవచ్చుగాక…. కానీ ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏమిటంటే…. ఆమె బుల్లెట్ బండి, డుగ్గుడుగ్గు పాట పాడిందిగా ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం… దాని గురించి…! ఎందుకంటే..? ఆమె నేటివ్ ఏలూరు… తెలంగాణ మాండలికంలో లక్ష్మణ్ రాసిన ఆ పాటలోని యాసను పర్‌ఫెక్ట్‌గా పట్టుకుంది… అదంత సులభం కాదు… తెలంగాణ జెనెటిక్ బర్త్ అయితే వేరే సంగతి… కానీ అంత తేలికగా పట్టుబడని యాస తెలంగాణ… ఆమె దాన్ని భలే పట్టుకుని పాడటమే విశేషం… ఇది అందరికీ చేతకాదు… పాట పట్ల ప్రేమ ఉండాలి, సాధనలో నిబద్ధత ఉండాలి… ఇక్కడ మోహన అందరి మనస్సులూ గెలిచింది…
మంగ్లీ… ఆమెది రాయలసీమ… కానీ తెలంగాణతనాన్ని ఓన్ చేసుకుంది, ఆమె మాట్లాడుతుంటే ‘ఒరెక్క’ వంటి పదాలు దొర్లుతూ ప్యూర్ తెలంగాణ పల్లె మనిషి అనిపిస్తుంది… సో, ఆమె ఓ తెలంగాణ పాటను అలవోకగా పాడగలదు… అచ్చం ఓ తెలంగాణ మనిషిలాగే… ఒక్కసారి చకచకా కొన్ని పేర్లు గుర్తుతెచ్చుకొండి…. ప్రసిద్ధ టీవీ యాంకర్లు, సింగర్లు…. ఒక్కరైనా తెలంగాణా యాక్సెంట్ పలకగలరా..? టీవీ సీరియళ్లు, సినిమాల్లో వాడే తెలంగాణ భాషలాగే కృతకంగా… వెగటుగా..! ఓ ఉదాహరణ చెప్పుకుందాం… జనం వేనోళ్ల మెచ్చిన వెటరన్ యాంకరిణి సుమ ఉంది కదా… కొన్ని వందల సినిమా ఫంక్షన్లు, అనేకానేక టీవీ షోలు… బోలెడు ప్రశంసలు… స్వతహాగా మళయాళీ అయినా తెలుగులో లొడలొడ… సారీ, ధారాళంగా మాట్లాడుతుంది కదా… హైదరాబాదులోనే పుట్టి పెరిగింది కదా… క్రీస్తుపూర్వం నాటి యాంకరిణి కదా… ఆమెకు ఈరోజుకూ తెలంగాణ డయలెక్ట్ చేతకాదు… కారణం :: ఆమెకు దాంతో పనిపడలేదు కాబట్టి…
Ads
గీతామాధురి, శ్రావణభార్గవి, మాళవిక, రమ్య బెహరా… దాదాపు ఈ ఆడ సింగర్సే కాదు, మగ సింగర్స్ అందరూ హైదరాబాదులోనే ఉంటారు, తిరుగుతారు, ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు… కానీ ఒక్కరికీ ఆ యాక్సెంట్ పట్టుబడలేదు… ప్రయత్నం కూడా చేయరు వాళ్లు… శ్రేయా ఘోషాల్ వంటి సింగర్ల గురించి చెప్పనక్కర్లేదు… పోనీ, ఓ పాట పాడాల్సి వచ్చినా, వాటిని అదే యాక్సెంటులో నాలుగుసార్లు ఎవరైనా పాడగా విని ప్రాక్టీస్ చేయరు, చేయించాలనే సోయి సంగీత దర్శకులకూ ఉండదు… వాళ్లకు ఆ ప్రేమ ఉంటే కదా… విజయనగరం రూరల్, చిత్తూరు రూరల్, ఉత్తర తెలంగాణ రూరల్ యాక్సెంట్ అంత ఈజీ కాదు… ప్రయాసపడితే రాదని కాదు… ఎటొచ్చీ వాళ్లకు పట్టదు, అంతే… మోహన భోగరాజు కూడా ఇక్కడే భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్, తరువాత ఎంబీఏ చేసినట్టుంది… నేటివ్ కూడా ఆంధ్రా… అయితేనేం, ఆ పాటలోని పదాల్ని కరెక్టుగా పట్టుకుంది… ఈ పాట కంపోజ్ చేసిన బాజీ కూడా కాస్త ప్రాక్టీస్ చేయించి ఉండవచ్చు, ఏ పదాన్ని ఎలా పలకాలోె గీత రచయిత లక్ష్మణ్ చెప్పి ఉండవచ్చు…
ప్రత్యేకించి కట్టుకున్నుల్లో కట్టుకున్న… చెరువు పొంటి చేమంతివనం… ఇలాంటి పదాల దగ్గర ఓ విరుపు ఉంటుంది… ప్రాక్టీస్ అవసరం… (విన్నారుల్లో, తిన్నారుల్లో తరహా ఓ టిపికల్ తెలంగాణ డయలెక్ట్ అది)… అఫ్ కోర్స్, లక్ష్మణ్ రాసిన ఆ పాటలోనూ మారాలు, గారాలు, ఎడతానురా వంటి పదాలు పంటికింద రాళ్లలా తగుల్తయ్… వాటిని వదిలేస్తే… కంటెంటు హృద్యంగా ఉంటుంది… ఇక టీవీ యాంకర్లు… హైదరాబాదులోనే పుట్టీపెరిగినా ఎవ్వరికీ తెలంగాణ పదాల్ని ఎలా పలకాలో తెలియదు, అసలు తెలుగే సరిగ్గా పలకలేరు… యాజమాన్యాలకు కూడా పట్టదు… వాళ్లూ అదే టైపు కదా… అంతెందుకు..? టీవీ9లూ, టెన్ టీవీలు… ఎందరు పెద్దలకు తెలంగాణ భాష తెలుసు…? జీరో… అంతా ఎవరో ఫారినర్స్ వచ్చి, హైదరాబాద్ మీడియా రాజ్యాల్ని ఏలుతున్నట్టు అనిపిస్తుంది… చివరకు తెలంగాణ పల్లెల్లో పుట్టీ పెరిగిన ప్రముఖ డిబేట్ ప్రజెంటర్లకే తెలంగాణంలో సరిగ్గా మాట్లాడటం రాదు… ఈ సింగర్లు, ఈ యాంకర్లను అనడానికేముందిలే…!!
Share this Article