మొన్న మనం చెప్పుకున్నాం కదా… ఆఫ్టరాల్ జబర్దస్త్ కమెడియన్ అని తీసిపారేసిన సుడిగాలి సుధీర్ ఈరోజు సక్సెస్ ఫుల్ చిన్న హీరో… ఏం, సక్సెస్ కొట్టాలంటే విషక్సేన్‌లు, శిరీష్‌లు, విష్ణులు అయి ఉండాలా..? సుధీర్‌లు కూడా కొడతారు… కొట్టి చూపిస్తారు… చూపించాడు సుడిగాలి సుధీర్… గాలోడు అంటే అందరూ ఒకే తీరు కాదు, కొందరికి సుడి ఉంటుంది, అందుకే సుడిగాలి సుధీర్ అయ్యాడు…
ఈమాట ఊరికే అనడం లేదు… తను హీరోగా చేసిన గాలోడు అనే సినిమా ఓ స్క్రాప్… తనను ఓ రెగ్యులర్ కమర్షియల్ హీరోగా బిల్డప్ ఇస్తూ, ఏమాత్రం కొత్తదనం లేక, జబర్దస్త్ స్కిట్‌కు ప్రొలాంగ్డ్ ఎక్స్‌టెన్షన్‌లా ఉన్న ఆ సినిమా మీద నెగెటివ్ టాక్ వచ్చింది… ఐతేనేం, సుడి… అప్పట్లో మార్కెట్‌లో అంతకన్నా దరిద్రం సినిమాలున్నయ్… పైగా సుధీర్‌కు బుల్లితెర మీద సంపాదించిన పేరుంది… మెరిట్ ఉంది… సినిమా నిలబడింది…
రెండో మూడో కోట్లు పెట్టి ఉంటారు… అదీ ఎక్కువే… 5 కోట్ల దాకా షేర్ వచ్చినట్టుంది… అంటే రెండు కోట్లు ప్రాఫిట్… అదీ థియేటర్లలోనే… ఈ సక్సెస్ చూసిన అల్లు అరవింద్ ఆహా ఓటీటీ కోసం కోటిన్నర ఇచ్చి రైట్స్ కొనేశాడట,.. అంటే సుధీర్‌ను పెట్టుకున్న నిర్మాతకు పెట్టుబడి మీద డబుల్ ప్రాఫిట్… ఏటా 80 శాతం సినిమాలు చీదేసే ఇండస్ట్రీలో ఇది లాభదాయకం, ఆనందదాయకమే కదా నిర్మాతకు…
Ads
నిజానికి ఇవ్వాళారేపు హీరో ఎవడు, వాడి నేపథ్యం ఏమిటి, వారసత్వం ఏమిటి అని ఎవడూ చూడటం లేదు… వాడి బాడీ లాంగ్వేజీ, విధేయత, సినిమా అంటే ప్రేమ, ప్రేక్షకులంటే విధేయత, మాట తీరు గట్రా జాగ్రత్తగా గమనిస్తున్నారు మీడియా మీట్లలో, ప్రి రిలీజ్ ఫంక్షన్లలో…. తన మీద వేయబడే జోకులను కూడా ఆస్వాదించే సుధీర్‌కు ఇందులో ఫుల్లు మార్కులు… పైగా డౌన్ టు ఎర్త్… తెర వెనుక ఏమిటనేది అప్రస్తుతం… బయట మాత్రం శుద్ధపూస…
అన్నింటికీ మించి తను పర్‌ఫార్మర్… యాక్షన్, డాన్స్, రొమాన్స్ బాగా ప్రదర్శించగలడు… అంతకుమించి ఓ చిన్న సినిమాకు ఏం కావాలి..? పైగా తెర ఎదుట అలవోకగా నటించగలడు… తెలుగునాట ప్రతి ఇంటికీ తను పరిచయం… కాకపోతే ఈ పాపులారిటీని గాలోడు వంటి పిచ్చి సినిమాకు గాకుండా మరేదైనా ‘మంచి’ సినిమాకు వాడుకోగలిగితే సుధీర్ నాలుగు రోజులు ఇండస్ట్రీలో నిలబడతాడు… కానీ తన చుట్టూ చెత్త సర్కిలే కదా… చెప్పేవాడెవడు..? అదీ అసలు ప్రశ్న…!!
Share this Article