చందు సుబ్బారావుకి 75 ఏళ్ళు…
Writer, orator and an amazing critic
——————————————————
పురాణాలూ, పద్యాలూ కవిత్వం గురించి మాట్లాడితే తెలుగు ప్రొఫెసర్ అని ఇట్టే తెలిసిపోతుంది.
ఆంగ్ల సాహిత్యమూ, విమర్శ అని గుక్క తిప్పుకోకుండా ప్రసంగిస్తే ఇంగ్లీష్ ప్రొఫెసర్ అనుకుంటాం.
నిజానికి ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో జియోఫిజిక్స్ లెక్చరర్, రీడర్, ప్రొఫెసర్.
36 సంవత్సరాల అనుభవం.
ఈరోజు డాక్టర్ చందు సుబ్బారావు 75వ జన్మదినం. 1946 మే 18వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చదలవాడలో పుట్టారు.
రచయిత బొల్లిముంత శివరామకృష్ణ ఆయనకి మేనమామ అవుతారు.
చందు పది జతల కళ్ళతో చదువుతాడేమో!
పన్నెండు చేతులతో రాస్తుంటాడేమో!
శ్రీనాథుడూ, విశ్వనాథ నించి శ్రీశ్రీ, శివారెడ్డి దాకా, గురజాడా, కొడవటిగంటి నుంచి ఆరుద్ర, దాశరథి దాకా, రా.రా, కేవీ రమణారెడ్డి నుంచి బంగోరె, వేల్చేరు నారాయణరావు దాకా… ఎంత శ్రద్ధగా చదువుకున్నాడో, అంత బాగా కోట్ చేస్తూ ఇంటర్ ప్రెట్ చేస్తూ ప్రవాహంలా మాట్లాడగలడు. ఆంగ్ల సాహిత్యం కవిత్వం గురించీ అంతే సాధికారికంగా చెప్పగలడు. శ్రీశ్రీ, గురజాడ సాహిత్య కృషిని అంచనా వేస్తూ చందు ఇంగ్లీషులో రెండు పుస్తకాలు రాశారు. ఆయన ఇంగ్లీషు కవిత్వం, వ్యాసాలు పరిశోధనా పత్రాలూ చదివి ఆశ్చర్యపోయాను. అందమైన flawless ఇంగ్లీష్ అది. ఎడంచేత్తో రాసిపడేస్తాడు అంటామే, అంత అవలీలగా రాయగలడు. మాట్లాడినా అంతే… అది జలపాతం లాంటి వాగ్ధాటి.
ఆయన భూగర్భజల శాస్త్రవేత్త.
ప్రపంచ జలవనరుల మీద ఎంతసేపయినా
లెక్చర్లు దంచగలడు.
విశాఖపట్నంలో పరిశ్రమలూ, పేదలకు ప్రాణాంతకం అవుతున్న విష రసాయన జలాలు, జబ్బుల గురించి చందు చెబుతుంటే వినితీరాలి.
*** *** ***
1978లో ‘ఈనాడు’లో పనిచేయడానికి బిక్కుబిక్కుమంటూ నేను విశాఖ వెళ్ళినప్పుడు చుట్టూ కమ్మిన ఉప్పు సముద్రం మధ్య నాకు దొరికిన ఒయాసిస్సు… తెలుగు సాహితీ మంచినీటి సరస్సు ఒక్క చందు సుబ్బారావే! వారాంతాల్లో అన్నం పెట్టిన తల్లి ఆయన భార్య, జువాలజీ ప్రొఫెసర్ నిర్మల గారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేసిన మా పెద్దక్క సుశీల, విజయవాడ విశాలాంధ్రలో పనిచేసే ఆర్టిస్ట్ మోహన్ చందు, నిర్మల గారికి తెలుసు. వాళ్ల పరిచయాలే నాకు జీవితకాలపు స్నేహాలయ్యాయి.
“ఈయనతో చాలా కష్టం” అని కంప్లైంట్ చేసేవారు నిర్మల. ఒకసారి బాగా తెలిసిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి చందు, నిర్మల విశాఖ రైల్వేస్టేషన్ కి పొద్దున్నే వెళ్ళారు. ట్రైన్ గంట లేటు అన్నారు. టైం ఉంది కదాని టిఫిన్ కోసం ఇద్దరూ హోటల్ కి వెళ్లారు. ఏదో ఒక విషయం మీద సీరియస్ గా మాట్లాడుతూ చందు, ఓ ప్లేట్ ఇడ్లీ తెమ్మన్నారు. తిన్నాక రెండు గారెలు ఆర్డర్ చేశారు చందూ. అవి కూడా తిని కాఫీ చెప్పారు. తాగేసి ఇక వెళ్దామా అన్నారట చందూ. నాకూ ఒక ప్లేట్ ఇడ్లీ చెబితే బాగుండేది కదా అన్నారట నిర్మల. ఎదురుగా కూర్చున్న భార్యని కూడా పట్టించుకోనంతగా మైమరిచి మాట్లాడడం ఆయన స్పెషాలిటీ. 1980లో నాకు కాఫీ ఇచ్చిన నిర్మల గారు హేపీగా నవ్వుతూ ఈ సంగతి చెప్పారు.
మరోసారి చందు, నిర్మల పెళ్లి భోజనం చేస్తున్నారు. ఎదురు టేబుల్ దగ్గర భోంచేస్తున్న వాళ్ళ లో ఒక పెద్దాయన్ని చూపిస్తూ, నిర్మలా.. ఆయన గొప్ప రచయిత అని చెప్పారు చందు. “ఆయనకి కాస్త లూజ్ అనుకుంటాగా” అన్నారు నిర్మల. ఏ లూజూ లేకుండా ఎక్కడి నుంచి వస్తుందనుకుంటున్నావ్ సాహిత్యం! అని కోప్పడ్డారు చందు.
*** *** ***
అప్పట్లోనే పేపర్లు దిద్దడానికి అత్తిలి కాలేజీ నుంచి యూనివర్సిటీకి వచ్చే బ్రహ్మానందంకి ఆశ్రయమిచ్చిందీ, ఆదరించిందీ, ప్రేమించిందీ, ప్రమోట్ చేసిందీ ఈ దంపతులే! అప్పటికి బ్రహ్మానందం ఇంకా సినీనటుడు కాలేదు.
తెలుగు లెక్చరర్, మిమిక్రీ ఆర్టిస్ట్ మాత్రమే!
సాహిత్యం గురించి ఎంత సీరియస్ గా చర్చిస్తాడో, తెగ నవ్వించే జోకులు, మిమిక్రీ ఐటమ్స్ చెప్పి హాస్యం పండించడంలో చందూది అంతే సూపర్ స్పెషాలిటీ! అలా నా విశాఖ జీవితం వెన్నెల్లో తుళ్ళిపడే కెరటాల్లా హాయిగా, ఈజీగా గడిచిపోయింది.
*** *** ***
చందు కొన్ని కవితలు రాశారు. 60 దాకా కథలు రాశారు. ఏడెనిమిది నవలలూ ఉన్నాయి. విద్యార్థి, ఉపాధ్యాయ, అధికారుల సమిష్టి జీవనంపై చందు నవల ‘శాస్త్రీయం’ చదివి, “విశ్వవిద్యాలయ విద్యార్థి జీవనంపై నవలలు రాసిన వారిలో అంపశయ్య నవీన్ తర్వాత చందు సుబ్బారావు ఉంటాడు” అని అబ్బూరి ఛాయాదేవి రాశారు.
సాహిత్యమే శ్వాసగా బతికే చందు సుబ్బారావు ప్రధాన ఆయుధం విమర్శ. విచ్చుకత్తులు విసురుతున్నట్టుగా పదునైన విమర్శ రాయడంలో విసుగు చెందని విక్రమార్కుడు ఆయన. సాహిత్య విమర్శ వ్యాసాలతో ఏకంగా ఐదు పుస్తకాలు తెచ్చారు.
1. కవికి విమర్శకుడు శత్రువు కాదు
2. శిల్ప దృష్టి
3. చందన చర్చ
4. సాహిత్యాభినివేశం
5. నవ్యాలోకనం.
గన్ పౌడర్ దట్టించినట్టుగా పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపినట్టుగా ఉంటుంది చందు వాక్యం. వెర్రిమొర్రి కవిత్వాన్ని కోట్ చేసి హేళన చేసేవాడు.
అరగంట క్రితం అన్నం తిన్నాను
నేనెందుకు తిన్నాను,
నిన్న తిన్లేదు గనక ఇవ్వాళ తిన్నాను –
వింటున్నావా మోహన్, ఇదీ మనవాళ్ళ పొయిట్రీ, ఏం ప్రకాష్ ఇది కవిత్వమేనా? ఇలా దరిద్రంగా రాయడం, ఎవరూ పొగడరేం అని, ఇంకా అకాడమీ అవార్డు రాదే అని ఎదురుచూడ్డం… ఇదీ మనవాళ్లు చేస్తున్న పని అని తిట్టేవాడు. చచ్చు కవిత్వం ఉదాహరణలు చెప్పడం ఆయనకెంతో సరదా. పేరున్నవాళ్లు, ఎస్టాబ్లిష్ద్ కవులు వచన కవిత్వం పేరుమీద నాన్సెన్స్ రాస్తున్నారని కోప్పడిపోయేవాడు.
“ఈనాటి కవిత్వంలో శ్రద్ధలేమి, లోపించిన హయవేష, కుంటుపడుతున్న నడక లాంటి అవలక్షణాలను తీవ్రంగా ద్వేషిస్తాడు చందు. అది అతనిలో నాకు నచ్చిన గుణం” అని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ఒక వ్యాసంలో రాశారు.
చందుతో ఒక సాయంకాలం… యిలా సెన్స్ లెస్ పొయిట్రీ చమత్కారాలు, సరదాలతో నడిచి పోయేది. మర్నాడు మిమిక్రీ, సాహిత్య జోకులు, చెణుకులతో గడిచిపోయేది. ‘కవులు మాట్లాడుకుంటే చాలు, వ్యంగ్యం, చమత్కారం జాలువారు’ అన్నారుగా.
జియోఫిజిక్స్ పరిశోధన పత్రాలు సబ్ మిట్ చేయడానికి అనేక దేశాల్లో సదస్సులకు వెళ్లి వస్తుండేవాడు. హంగరీ, జర్మనీ, అమెరికా, బ్రిటన్… ఏ దేశం నుంచి తిరిగివచ్చినా హైదరాబాద్ లో మోహన్ దగ్గరికి వచ్చేవాడు, ఒకటో రెండో స్కాచ్ బాటిల్స్ తో. కనీసం మూడు దశాబ్దాలపాటు యీ లిటరరీ ఆల్కహాలిక్ కబుర్ల కిక్ ని ఎంజాయ్ చేశాను. చందు సాయంకాలం వస్తున్నాడంటే పదిమంది ఆర్టిస్ట్ లూ, కార్టూనిస్టులూ వచ్చి వాలిపోయేవాళ్ళు. ఖర్చు ఐదు వేలయినా, పది వేలయినా సుబ్బారావు గారే భరించడం ఆనవాయితీ. మమ్మల్ని ఎవర్నీ ఖర్చుపెట్టనిచ్చేవాడు కాదు.
*** *** ***
చదలవాడ అనే చిన్న గ్రామంలో తొమ్మిది మంది సంతానం ఉన్న ఇంట్లో పెద్దకొడుకు చందు. యూనివర్సిటీలో లెక్చరర్ అయ్యేదాకా ఆయన పడిన కష్టాలు అన్నీయిన్నీ కావు. ఇద్దరు తమ్ముళ్లని చదివించాడు. ఇద్దరూ ప్రొఫెసర్లు అయ్యారు. చందు కొడుకు దిలీప్ అమెరికాలో మోన్సాంటోలో శాస్త్రవేత్త. కూతురు కవిత విశాఖ ‘గీతం’లో ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్.
ప్రొఫెసర్ గా రిటైరయ్యాక, నాలుగు వందల మందికి పైగా ఆడపిల్లలు చదివే గరివిడి, తగరపువలస ఇంజినీరింగ్ కాలేజీలకు 14 సంవత్సరాలు ప్రిన్సిపల్, డైరెక్టర్ గా సుబ్బారావు పని చేశారు.
*** *** ***
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రని తెలుగులోకి తర్జుమా చేశారు చందు. ప్రసిద్ధ కవి యెండ్లూరి సుధాకర్ కవిత ‘గోసంగి’ని ఆంగ్లంలోకి అనువదించారు. గత యాభై ఏళ్లుగా విశాఖ లిటరరీ సర్కిల్ లో చందుకి తెలియని కవులూ, రచయితలూ ఎవ్వరూ లేరు. కారా, రావిశాస్త్రి, కె.ఎస్. చలం, కేవీఎస్ వర్మ, చలసాని ప్రసాద్, అల్లం శేషగిరిరావు, చా.సో, రోణంకి, పురిపండా, సోమసుందర్, బంగోరె, అర్నాద్, వివినమూర్తి, రామతీర్థ, జగద్ధాత్రి… లాంటి అనేకులు చందుకి సన్నిహితులు.
*** *** ***
రావిశాస్త్రి ఇంగ్లీషు సాహిత్యం బాగా చదువుకున్నారు. ఆయనతో ఇంగ్లీష్ లిటరేచర్ గురించి డిస్కస్ చేయాలని డిసైడైపోయిన చందు.. ముల్క్ రాజ్ ఆనంద్, హరీన్ చటో, నెహ్రూ, కేఏ అబ్బాస్ రచనల గురించి మాట్లాడుతూ, ఆ వూపులో swami and friends, malgudi, guide అంటూ ఆర్.కె.నారాయణ్ నాకు బాగా నచ్చుతాడు అన్నారు, ఒకసారి.
“అతను నాకు నచ్చలేదు” అన్నారు రావిశాస్త్రి.
“ఏమిటండీ అతను, every thing is ok. I have no quarrel with the world అన్నాడండీ… I cannot but quarrel with him” అంటూ నడుచుకుంటూ వెళిపోయారు శాస్త్రిగారు.
“మౌనంగా మిగిలిపోయాను” అని చందు ఒక వ్యాసంలో రాశారు.
*** *** ***
ఎప్పటిలాగే శ్రీశ్రీ forcefullగా రాసిన ఒక కవిత :
ముసలివాణ్ణి కాను నేను అసలువాణ్ణి
పడగెత్తిన తాచుపాము బుసలవాణ్ణి
అందుకున్న ఆకాశం కొసలవాణ్ణి
పీడితులను వెంటేసుకు మసలువాణ్ణి
దీనికి చందు సుబ్బారావు అనువాదం :
I am not the sixty old
I am but the shining gold
Like a cobra hissing bold
The cause of depressed i uphold
Taking high skies in my fold
*** *** ***
గురజాడ ‘దేశభక్తి’ గీతం దేశమును ప్రేమించుమన్నా… చందు అనువాదంలో
కొన్ని చరణాలు :
Why do you look back
Pretty little ‘good’ in the past
Move fast with no lethargy
To lag behind is to stay behind
Compete in a course of education
Animosity only for a bussiness corporation
Do not pamper wastfull hatred
Burn at once the knife and sword
Do not boast time and again
You care, much for the country
Do a ‘favour’ and show it
To the people standing before
Forget a past of your profit
For the help of one standing for it
A country does not mean soil
A country means people in turmoil
*** *** ***
మాటలతో, ప్రసంగాలతో, జ్వలించే నిజాయితీతో మనల్ని ఊగించి ఉత్తేజపరచిన fire brand జ్వాలాముఖి, చందు సుబ్బారావు గురించి ఒక పూర్తి స్థాయి కవిత రాశారు. అందులో కొన్ని చరణాలు :
జాగ్తేరహో అంటున్న చందు
వికట వివాదాల చందు
కవిసమయాల పసందు
అస్తినాస్తి విచికిత్సల ఆనందు
ప్రొఫెసరు సుబ్బారావు చందు
చెలియలికట్టను కసిగా కోస్తున్న
విశాఖ సముద్రాన్ని అపోసన పట్టగలడు
లక్ష్మణరేఖ మీద సలక్షణంగా
ఖతర్నాక్ కబడ్డీ ఆడగలడు
కొందరు ఆరుద్రను సీజర్ను చేసి పొడిస్తే
ఆంథోనిలా గర్జించిన సమగ్రాంధ్ర ధీరుడు
కుండబద్దలు కొట్టే సమయస్ఫూర్తి వీరుడు
నిష్కపటి, నిర్మొహమాటి, వృద్ధి చంద్రుడు
విశాఖ విగ్రహాల నిశ్చల పక్షపాతి
శ్రీరంగం శ్రీనివాసరావు అంతేవాసి
భాగవతుల శివశంకరశాస్త్రి దుబాసి
రాచకొండ విశ్వనాథశాస్త్రి రసనపిపాసి!
*** *** ***
ఈ నెలలోనే 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న చందు, నిర్మల గార్లకు స్నేహంగా, ఆప్యాయంగా …
– TAADI PRAKASH………. 9704541559
Share this Article