అందెశ్రీ రాసిన తెలంగాణ గీతాన్ని కీరవాణి కంపోజ్ చేస్తే అర్జెంటుగా తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్థిత్వానికి వచ్చిన ముప్పేమిటో అర్థం కాదు… ప్రతి విషయాన్ని రచ్చ చేయడం మినహా..! ఇలా రచ్చ చేస్తున్నవాళ్లు కవిత రెహమాన్‌తో బతుకమ్మ పాటకు ఓ దిక్కుమాలిన కంపోజింగ్ చేయిస్తే మాత్రం కిక్కుమనలేదు… కీరవాణి తెలంగాణవాడు కాకపోవడం అనర్హత అవుతుందా..? ఖచ్చితంగా తెలంగాణ సంగీత దర్శకులు కంపోజ్ చేస్తేనే అందులో తెలంగాణతనం మత్తడి దూకుతుందా..?
తెలంగాణ తల్లి రూపురేఖలు కూడా మార్చాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం… మరీ ఎవరో మహారాణిలా నగలు, అట్టహాసం, ఆడంబరపు ఆహార్యం గాకుండా ఓ సగటు తెలంగాణ పోరాట మహిళగా కనిపించాలనేది కొత్త ప్రభుత్వం భావన… దాన్నీ రచ్చ చేయడానికి ప్రయత్నించారు… ప్రయత్నిస్తూనే ఉన్నారు…
తాజాగా తెలంగాణ ప్రభుత్వ లోగో (state emblem ఆర్ రాచముద్ర) మీద వివాదం… దాన్ని మార్చాలనేది రేవంత్ రెడ్డి నిర్ణయం… ఎందుకు..? తను చెబుతున్న కారణాలేమిటంటే, పాత రాచరికపు ఆనవాళ్లు గాకుండా మన అధికారిక లోగో పోరాటరూపంగా ఉండాలని…!
Ads
రుద్ర రాజేశం అనే చిత్రకారుడితో చర్చించాడు… ఇంకా అధికారిక చిహ్నం ఫైనల్ కాలేదు… ఇక మొదలైంది రచ్చ… కేటీయార్ సహా బీఆర్ఎస్ సెక్షన్ విమర్శ ప్రధానంగా ఏమిటంటే..?
ఎస్, నిజం… పాత ప్రభుత్వపు ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే… పాలన విధానాల్లో ప్రజోపయోగ మార్పులు, పాత అవినీతి అక్రమాలకు తెరవేయడం, నాటి ప్రభుత్వం బరితెగింపు విధానాలకు అడ్డుకట్ట… అంతేతప్ప లోగోలు మార్చడం, విగ్రహాలు మార్చడం, గీతాలు మార్చడం అయితే కాదు… అలాగని మారిస్తే తప్పూ కాదు, ఇవేవీ సీరియస్ విషయాలు అసలే కావు…
అలాగే ప్రభుత్వం ఏం చేసినా ఖచ్చితంగా తప్పుపట్టడమే ప్రతిపక్షం బాధ్యత అనే పాతతరహా రాజకీయ పోకడలు అస్సలు సరికావు… ఎస్, కాకతీయ కళాతోరణం ఖచ్చితంగా రాచరికపు ఆనవాలే… ఒక సమ్మక్క, ఒక సారలమ్మ అమరులైంది ఈ రాజరికం దాష్టీకం మీద పోరాటంలోనే… అది గత కాలపు సామ్రాజ్య వైభవం ఏమీ కాదు… అలా రుద్దబడింది జాతి మీద…
పైగా ఒక చార్మినార్, ఒక కాకతీయ కళాతోరణం మతచిహ్నాలు కావు… గంగా జమునా తెహజీబు భావనకూ వాటికీ సంబంధం ఏమీ లేదు… అన్నింటికన్నా హాస్యాస్పదమైన కామెంట్ ఏమిటంటే… అది తెలంగాణ అస్థిత్వాన్ని అవమానపరచడం అట… ఎలా..? అధికార చిహ్నంలో మార్పులు చేస్తే తెలంగాణ అస్థిత్వాన్ని అవమానపరచడం ఏమిటో వాళ్లకే తెలియాలి… తిలక్ చెప్పినట్టు… ఏ సంస్కృతీ కాదొక స్థిరబిందువు, అది అనైక నదీనదాలు కలిసిన అంతస్సింధువు… culture is not static, it is dynamic…
ఆమధ్య హైదరాబాద్ అనగానే అదేదో అధికార చిహ్నంలాగా హైటెక్ సిటీ బొమ్మ పెట్టేవాళ్లు… అది హైదరాబాద్ అస్థిత్వ ప్రతీక ఏమిటో ఎవరూ అడగలేదు, ఎవరూ విమర్శించలేదు… ప్రస్తుతం బీఆర్ఎస్ చేసేది కూడా ఏవో నాలుగు పడికట్టు మాటలతో పదే పదే ప్రజల్లో ఏదో తప్పు, నేరం, ప్రమాదం, ముప్పు అనే భావనల్ని ఉసిగొల్పే ఓ శుష్క ప్రయత్నం తప్ప ఇవేమీ సీరియస్ విషయాలు కావు, అక్షరాలా జనప్రయోజనానికి వీటితో వచ్చేది లేదు, పోయేది లేదు…
అన్నట్టు… రేవంత్ సారూ… విగ్రహం, పాట, ముద్ర… ఇవేనా మన రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టు, రాష్ట్ర పుష్పం తంగేడులను కూడా మార్చేసే ఆలోచన ఏమైనా ఉందా..? అవి అక్షరాలా తెలంగాణ అస్థిత్వ చిహ్నాలే… వాటిల్లో రాచరికపు ఆనవాళ్లేమీ లేవు… చివరగా మరోసారి… కేసీయార్ ఆనవాళ్లు చెరిపేయడం అంటే… కేసీయార్ పాలన వైఫల్యాలు, అక్రమాలు, అడ్డదిడ్డం పాలన ఫలితాల నుంచి తెలంగాణను బయటపడేయడం..!!
ఎవరో గానీ సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ కామెంట్ పెట్టాడు… లోగోలో అవి రాచరికపు ఆనవాళ్లు సరే, మరి మన జాతీయ అధికార చిహ్నంలోని నాలుగు సింహాలు, ధర్మచక్రం కూడా నాటి రాచరికపు ఆనవాళ్లు కాదా అని..! చివరగా లైటర్ వీన్‌లో… మన రాష్ట్ర ఫలం మామిడి, మన రాష్ట్ర క్రీడ కబడ్డీ… మన రాష్ట్ర నది గోదావరి… మరి మన రాష్ట్ర ఆహారంగా సకినాలో, సర్వపిండో ఎందుకు ఉండకూడదు అధ్యక్షా..!!
Share this Article