బాహుబలి-3 అంటూ అందరూ ఏవేవో రాసేస్తున్నారు… అర్జెంటుగా కొత్త కథలు అల్లేస్తున్నారు… దాన్ని బలంగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారు… ఒకరకంగా ఇప్పుడిది ప్రచారంలోకి రావడం రాజమౌళి బ్లండరే… ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ జరగాల్సినవేళ చర్చను బాహుబలి సీక్వెన్స్ మీదకు తనే ఒకరకంగా మళ్లించాడు… కరెక్టు కాదు…
ఏదో భేటీలో ప్రభాస్ సరదాగా అన్నాడు, ఆర్ఆర్ఆర్ సినిమాలో కనీసం అతిథి పాత్రకైనా నన్ను అడగలేదు అని… నిజంగా చేస్తే గీస్తే హీరో పాత్రే, ప్రభాస్‌ను తీసుకోవాలంటే ఇప్పుడు అంత వీజీ కాదు… ఇక మొదలైంది వార్తల ప్రవాహం… అప్పుడెప్పుడో రాజమౌళి ఏదో జూమ్ ఇంటర్వ్యూలో ఓ మాటన్నాడు… ‘‘బాహుబలి-3 తప్పకుండా తీస్తాం, మా నిర్మాత కూడా ఆసక్తిగా ఉన్నాడు, బాహుబలి పాత్ర చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్ చూపిస్తాం… వర్క్ చేస్తున్నాం, టైమ్ పడుతుంది, బాహుబలి రాజ్యం నుంచి ఓ ఇంట్రస్టింగ్ వార్త రాబోతోంది…’’
నిజానికి అంత సీన్ ఏమీ లేదు… బాహుబలి రెండో పార్ట్‌ను సాగదీయడమే రాజమౌళికి కష్టమైపోయింది… చివరకు క్లైమాక్స్ యుద్ధాన్ని సరిగ్గా ప్లాన్ చేయలేక విసిగించేశాడు… పైగా ఒకసారి బాహుబలి పట్టాభిషిక్తుడు అయిపోయాక, ప్రత్యర్థులు మరణించాక శుభం కార్డు పడ్డాక… ఇక కథేముంటుంది..? అవసరమైతే కొత్త శత్రువుల్ని క్రియేట్ చేయాలి, కానీ ప్రేక్షకుడికి పెద్దగా ఆసక్తి ఉండదు…
Ads
రాజమౌళి ఆలోచనలు కూడా ఎప్పుడో గాడితప్పాయి… ఆర్ఆర్ఆర్‌లో అల్లూరి, కుమురం పాత్రల్ని వంకరగా చూపించబోవడమే దానికి నిదర్శనం… పైగా మహేష్‌బాబుతో సినిమా చేయాల్సి ఉంది… అది మినిమం రెండేళ్లకుపైగా పడుతుంది… ప్రభాస్ కూడా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు… ఇప్పుడప్పుడే రాజమౌళికి డేట్స్ ఇచ్చేంత వెసులుబాటు తనకు లేదు… అంతేకాదు, మళ్లీ రాజమౌళికి వరుసగా ఏడాదో రెండేళ్లో డెడికేటెడ్ డేట్స్ ఇచ్చే సీన్ అంతకన్నా లేదు… హాయిగా ఏడాదికి రెండుమూడు పెద్ద ప్రాజెక్టులు చేసుకుంటూ, తన పాపులారిటీ పంటను కోసుకునే పనిలో ఉన్నాడు… పైగా రాజమౌళి ఆ రేంజ్ హిట్ మళ్లీ ఇస్తాడనే నమ్మకమూ లేదు… సో, ప్రభాస్ రిస్క్ తీసుకోలేడు…
ఇదంతా రియాలిటీ… అయితేనేం..? మీడియా, ప్రత్యేకించి తెలుగు మీడియా ఎడాపెడా రాసేస్తూనే ఉంది… అంతెందుకు, ప్రభాసే మొన్న ఏదో సందర్భంలో చెప్పాడు… ‘‘బాహుబలి-3 గురించి నాకేమీ తెలియదు’’ అని… సో, క్లియర్… బాహుబలి మూడు ఉండదు… ఆ మూడ్ కూడా లేదు వాళ్లకు… ఏదో కాజువల్‌గా చెప్పాడు రాజమౌళి… తీరా ఆర్ఆర్ఆర్‌కన్నా ఈ బాహుబలే ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చేశాడు… అంతే… నిజానికి ఓ భారీ మూవీ ప్రమోషన్ చేస్తున్నప్పుడు చర్చ పక్కకు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సింది… కానీ రాజమౌళే అనవసరంగా తొందరపడ్డాడు…!!
ఒకవేళ తీస్తే… తమన్నా రాణిగా ఉండాలి, ఆమె కెరీర్ ప్రస్తుతం వీక్… ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు… అనుష్కను తల్లిగానే చూపించాల్సి ఉంటుంది… ఆమెకూ మార్కెట్ లేదు, ఆ పాత చార్మ్ లేదు, ఆ తల్లి పాత్ర కంటిన్యుటీని ప్రేక్షకుడు కోరుకోడు… ఇంకేం చేయాలి..? ప్రభాస్ పాత్రకు ఇంకో లేడీ పాత్రను వెతికి తగిలించాలి… దాంతో ఆ పాత్ర ఉదాత్తత మంటగలుస్తుంది… రానా రేంజులో మరో బలమైన విలన్ పాత్ర క్రియేట్ చేయాలి… ఎంత రాజమౌళి తండ్రి అయినా సరే, విజయేంద్రప్రసాద్‌కు ఇది ఓ కఠిన పరీక్ష అవుతుంది… ఎహె, ఇదంతా ఎందుకు ప్రయాస అని చివరకు ప్రభాసే చిరాకుతో వదిలేసే ప్రమాదమూ ఉంది…
Share this Article