నిన్నటి నుంచీ చాలామంది వెక్కిరిస్తున్నారు ఒక వార్తను… ఫేస్‌బుక్‌లో ఫస్ట్ చాడ శాస్త్రి వాల్ మీద కనిపించినట్టుంది… ఈ వార్తను ఈమధ్యే చదివినట్టు గుర్తుంది, కానీ అది ఏ పత్రికో గుర్తురావడం లేదు… సరే, పత్రిక ఏదయితేనేం… పత్రికల్లో బేసిక్స్ కూడా తెలియనివాళ్లు అన్ని రంగాల మీద తోచినట్టు రాసిపారేస్తూ, అభాసుపాలవుతున్నారు… పాత్రికేయ ప్రమాణాలు రోజురోజుకూ పడిపోతున్నయ్ అనేది తాజా చర్చనీయాంశం…
టెక్నికల్, బిజినెస్ వంటి అంశాలపై ఏమైనా రాసేటప్పుడు వాటి మీద కనీసావగాహన ఉండాలనేది ఓ అన్ రిటెన్ రూల్… కానీ ఇప్పుడదేమీ లేదు… ఏదైనా పార్టీ మీద విరుచుకుపడటమే ఎజెండా అయితే, ఏ రూల్సూ అక్కర్లేదు… తిట్టిపోయడమే రూల్… విషయం ఏమిటంటే..? ఒక ప్రముఖ దినపత్రిక బాక్స్ కట్టి మరీ ఈ వార్త ప్రచురించింది. “అదానీకే అన్నీ… SBI 12,770 కోట్ల రుణ మాఫీ” అని వార్త రాసింది… నెట్‌లో చెక్ చేస్తే అసలు వార్త ఇంగ్లీషులో ఇది…
Ads
“The Adani Group has concluded financing of the Navi Mumbai airport as the public sector lender State Bank of India underwrote the entire debt requirement of Rs 12,770 crore for the project…” అంటే ఆ వార్త రాసిన సదరు వ్యక్తికి రైట్ ఆఫ్, వైవర్ మరియూ అండర్ రైటింగ్ పదాల అర్ధం, వాటి మధ్య తేడా తెలియదు అని అనుకోవాలి… రైట్ ఆఫ్ అంటే బ్యాంకు పుస్తకాలలో రుణ లెక్కల సర్దుబాటు, వైవర్ అంటే రుణ మాఫీ, అండర్ రైటింగ్ అంటే అంత మొత్తం వీరికి రుణం పొందడానికి అర్హులే, రుణం ఇస్తాం అని మూడో పార్టీకి హామీ ఇవ్వడం…
దీని అర్ధం ఏమిటి అంటే….. నవీ ముంబై ఎయిర్ పోర్ట్ నిర్వహణ అదానీ కంపనీ తీసుకునే ముందు ఆ కంపనీ ఆర్థికంగా బలంగా ఉన్నాము అని రుజువు చేసుకోవాలి. ఆ రుజువులు సరిగా ఉన్నాయి అని అనిపిస్తేనే ఆ ఎయిర్ పోర్ట్ నిర్వహణ కాంట్రాక్టు అదాని కంపెనీకి అప్పచెపుతారు. దీని కోసం అదాని కంపనీ ఈ కాంట్రాక్టు అలాట్‌మెంట్‌కి అవసరమైన స్థోమత చూపించడానికి ప్రయత్నించింది…
₹12770 కోట్ల వరకు ఆర్ధికంగా బలంగా ఉన్నాము అని రుజువులు చూపించడానికి అదాని కంపనీ తమ ఆస్తి, అప్పుల పత్రాలతో బ్యాంకులను లేదా ఇతర ఆర్ధిక సంస్థలను సంప్రదిస్తుంది. ఆ బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థలు ఈ కంపనీ ఆర్ధిక స్థితిపై అధ్యయనం చేసి, ఈ కంపనీ ₹12770 కోట్ల ఆర్ధిక బాధ్యతను నిర్వర్తించగలదు అని హామీ ఇస్తాయి. దాని కోసం అవి కొంత ఫీజ్ వసూలు చేసుకుంటాయి.
అంటే మేం కంపెనీకు కావలసిన ఆ ₹12,770 రుణం అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అనే పరోక్ష హామీని ఇవ్వడం… దీనినే ఇంగ్లీషులో అండర్ రైటింగ్ అంటారు. అంటే అండర్ రైటింగ్ అంటే రుణ మాఫీ కాదు. సరళంగా చెప్పాలి అంటే కంపనీ ఆర్ధిక పరిస్థితి బాగుంది, రుణం ఇస్తామనే పూచీకత్తుగా కూడా చెప్పుకోవచ్చు.
ఇప్పుడు స్టేట్ బాంక్ అదాని కంపనీకి ఇలా ₹12770 కోట్లు రుణం ఇస్తాం అనే హామీ ఇచ్చింది అన్నమాట… అంతే కానీ 12770 కోట్లు అదానికి రుణ మాఫీ చెయ్యలేదు. బ్యాంకులు, బీమా కంపెనీలు మరియు పెట్టుబడి సంస్థలు వంటి కొన్ని పెద్ద ఆర్థిక సంస్థల ద్వారా ఇటువంటి పూచీకత్తు సేవలు అందించబడతాయి. మరి ఘనమైన మన తెలుగు మీడియా ఇదే వార్తను ఎలా ప్రచురించిందో చూశారు కదా… పరువు పోయేది ఆ పత్రికకు మరియు దానిని నిర్వహిస్తున్న పెద్దలది మాత్రమే… అన్నట్టు, సాక్షి సైటులో కూడా ఈ వార్త కనిపించింది…
Share this Article