గద్వాల దగ్గర 750 కోట్ల నగదు ఉన్న ఓ ట్రక్కును పోలీసులు పట్టుకున్నారు… వావ్, సూపర్ కదా… మన పోలీసులు ఎంత బాగా పనిచేస్తున్నారు అనిపించింది కదా ఒకేసారి… కానీ అది ఆర్బీఐ అనుమతితో కేరళ నుంచి హైదరాబాదులోని ఓ బ్యాంకు ట్రెజరీకి వస్తున్న డబ్బు… అదంతా ఎన్నికల అక్రమాల కోసం, ప్రలోభాల కోసం వస్తున్న ట్రక్కుగా భావించి, ఏదీ నిర్ధారించుకోకుండా చాలాసేపు ట్రక్కును ఆపేశారు… చివరకు బ్యాకర్లు ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌తో మాట్లాడి, ఇన్వాల్వ్ చేస్తే తప్ప ఆ ట్రక్కు తన దారిలో ముందుకు కదల్లేదు… (సోర్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా) ఇక్కడ సీన్ కట్ చేద్దాం…
మొన్నామధ్య కర్నాటకలో మొత్తం 70 కోట్లను పట్టుకున్నారు, అఫ్‌కోర్స్ మన పోలీసులకు సంబంధం లేదు… కానీ అవన్నీ తెలంగాణ ఎన్నికల కోసం తరలించడానికి ఉద్దేశించిన డబ్బు అని గుప్పుమంది… గుడ్, అదుగో అలాంటి డబ్బే పట్టుబడాలి… పట్టుకోవాలి… పంచనామా చేయాలి… కానీ రాష్ట్రంలో జరుగుతున్నదేమిటి..?
ఒక బలమైన ఉదాహరణ చెప్పుకుందాం… నిన్న ఎక్కడో ఇద్దరు జువెలర్స్‌ను పోలీసులు పట్టుకున్నారు, బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు… గొప్పగా పత్రికలవారిని పిలిచి చెప్పుకున్నారు… కానీ ఓ చిన్న లాజిక్… ఏ బలిసిన పార్టీ అయినా సరే తులం నుంచి 5 తులాల బంగారు బిస్కెట్లను పంచే సీన్ ఉందా తెలంగాణలో..? మీరే చెప్పారు కదా, సరైన ఆధారాలు చూపిస్తే, ఎన్నికల అక్రమాల కోసం కాదని తెలిస్తే డబ్బు గానీ, నగలు గానీ, ఇతరత్రా కానుకలు గానీ సీజ్ చేయబోమని…! మరి ఇదేమిటి..?
Ads
ఇదేకాదు… ఒక్కసారి నిన్నటి ఆంధ్రజ్యోతి వార్త చదవండి…
అసలు తెలుగు మీడియాను అనాలి… గతంలో మొత్తం ఎన్నికల్లో సీజైన మొత్తంకన్నా ఇప్పుడు 9 రోజుల్లోనే సీజయ్యాయి… సూపర్, బంపర్, గ్రేట్, మన పోలీసులు ఎంత బాగా పనిచేస్తున్నారో తెలుసా అన్నట్టుగా రాసిపడేస్తున్నారు… కానీ ఆ స్వాధీనాల్లో ఎన్ని జెన్యూన్ కేసులున్నాయి, ఎందరు బాధితులవుతున్నారో ఒక్కటంటే ఒక్క కేసు కూడా రాయలేదు ఏ మీడియా కూడా… పోలీసులు ఏది చెబితే అదే… క్రాస్ చెక్ లేదు, డిఫరెంట్ వెర్షన్ లేదు…
ఒక రైతు తన పంట సొమ్మును హైదరాబాద్ నుంచి పట్టుకుపోతున్నాడు… పోలీసులు పట్టుకున్నారు… పోలీసులతో తలనొప్పి దేనికని డబ్బు ఇచ్చిన ఆసామీ సైలెంట్… రైతు సొమ్మును సీజ్ చేసి ఐటీకి అప్పగించేశారు… రైతు లబోదిబోమంటూ ఎవరో చెబితే ఎవరో సీఏ వద్దకు వెళ్లాడు… అడిగినంత ఇస్తానన్నాడు… ఐటీవాళ్లు గత మూడేళ్ల రిటర్న్స్ సబ్మిట్ చేయండి, చూస్తామన్నారు… అసలు పాన్ కార్డు కూడా లేదు తనకు… ఆ రైతు ఏం చేయాలిప్పుడు..? ఈ దాడుల్లో ఇలాంటి బాధితులు బోలెడు మంది…
అసలు 50 వేలు దాటితే చాలు, అది ఇక ఎన్నికల్లో పంచడానికేనా..? ఈరోజు తులం బంగారం కొనాలన్నా 60 వేలు కావాలి… పెద్ద స్కూళ్లు, పెద్ద హాస్పిటళ్ల బిల్లులు, ఫీజులు లక్షల్లో… ప్రత్యేకించి రిజిస్ట్రేషన్లలో నగదు లావాదేవీలు ఎక్కువే… పంట సొమ్ము చెల్లింపులు, వ్యాపార లావాదేవీలు… అన్నీ రెండు నెలల పాటు స్థంభించిపోవాలా..? లాక్ డౌన్ విధించినట్టు ఎవరిళ్లలో వాళ్లు ఉండిపోవాల్సిందేనా..? మీడియాకు ఈ బాధలు ఎందుకు పట్టడం లేదు..? బైండోవర్లు, గన్స్ స్వాధీనాలు, మద్యం సీసాలు పట్టుకున్నారంటే సరే… గంజాయి కూడా ఎన్నికల్లో అక్రమాల కోసమేనా..? అది నార్కొటిక్స్ కేసు, పట్టుకుంటే పర్లేదు, కానీ దానికీ ఎన్నికల కలర్ పూయడం దేనికి..?
నిజంగా పార్టీలు ఇలా బహిరంగంగా నగదు తరలిస్తాయా..? వాళ్లకు తెలియదా పట్టుబడే ప్రమాదాల గురించి… ఏయే మార్గాల్లో ఎలా తరలించాలో తెలుసు వాటికి… ఆ డబ్బు మాత్రం దొరకదు, పోలీసులు పట్టుకోలేరు… ఒక పార్టీ అయితే పంచాల్సిన నగదును వేర్వేరు ప్రాంతాల్లోకి (ఇళ్లల్లో) ఇప్పటికే చేరవేసి భద్రపరిచిందట… కొన్నిచోట్ల రకరకాల నంబర్ల నుంచి వోటర్లకు డిజిటల్ పేమెంట్స్ చేసే ఏర్పాట్లు చేసుకున్నారట… మద్యం పంపిణీకి ఆయా వైన్స్ డీలర్లతో ముందస్తు ఒప్పందాలు కుదిరాయట… అవన్నీ అలా సాగుతూనే ఉంటాయి… ఇంకోవైపు పోలీసులు ఘనతను ప్రదర్శించడం కోసం ఎందరెందరినో బాధపెడుతూనే ఉన్నారు… దాడులు, స్వాధీనాల పేరిట గొప్పలు…
నిజానికి ఈ ఓవరాక్షన్, ఎప్పటికప్పుడు ఈ కేసుల్ని క్లియర్ చేయకపోవడం అధికార పార్టీకి మైనస్ అవుతుంది… కానీ ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పినా యంత్రాంగం వినదు కదా… ఓ సంగతి చెప్పి ముగిద్దాం… గతంలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పది వేల జరిమానా వేసేవాళ్లు… ఇప్పుడు 2100… రెండోసారి పట్టుబడితే 3100… ట్రాఫిక్ చాలాన్లు తగ్గాయి… ఊదుడు పరీక్షలు కూడా తగ్గాయి… గమనించారా..? మరి ఈ దాడుల బాధితుల బాధలు ఎవరికీ ఎందుకు పట్టవు..? వికాస్ రాజ్, మీరేమంటారు..?!
Share this Article