కొన్నాళ్లు తెలుగు టీవీల్లో, ఓటీటీలో మ్యూజిక్ ప్రోగ్రామ్స్ పోటీ నడిచింది… ఆహా ఓటీటీలో ఇండియన్ ఐడల్ బాగా క్లిక్కయింది… అదేసమయంలో టీవీ చానెళ్లలో, ప్రత్యేకించి జీతెలుగులో వచ్చిన సరిగమప పెద్దగా ఆకట్టుకోలేదు… బోలెడు మంది జడ్జిలు, మెంటార్లు, హంగామా, ఖర్చు అసలు సంగీతం అనే కాన్సెప్టును గంగలో కలిపేసింది… దాన్నొక రెగ్యులర్ టీవీ ఎంటర్‌టెయిన్‌మెంట్ ప్రోగ్రాంగా మార్చారు… సేమ్, స్టార్ మాటీవీ… సూపర్ సింగర్ అని స్టార్ట్ చేసి, దాన్ని కూడా సరిగమపను మించిన నాసిరకం ప్రోగ్రాంగా మార్చారు…
చిత్ర, హేమచంద్ర, మనో వంటి సింగర్లున్న షోను నిజానికి బాగా రక్తికట్టించాలి… ఈ హంగులు, కృత్రిమ రంగులేమీ లేకపోయినా… ఈటీవీలోని మ్యూజిక్ షోలే కాస్త నయమనిపిస్తోంది… ఎన్ని అవలక్షణాల అపశృతులు, అపస్వరాలున్నా సరే…! ఇక్కడ సీన్ కట్ చేయండి… ఇప్పుడు ట్రెండ్ మార్చారు… ఇది డాన్స్ షోల సీజన్… అందరూ వాటిపై పడ్డారు… వాస్తవానికి ఈ షోలలో చూపేవి ఏమీ డాన్సులు కావు… అనబడవు… స్టెప్పులు, సర్కస్ ఫీట్లు… ఇదొక వింత నృత్యరీతి… అసలు నృత్యమే అనిపించబడని రీతి…
సినిమా పాటల్ని అష్టవంకర్లు తిప్పి, రీట్యూన్ చేసి, రీమిక్స్ చేసి… డాన్సర్లు అనబడే సర్కస్ ఆర్టిస్టులతో ఫీట్లు చేయిస్తుంటారు… వాస్తవంగా వాళ్ల శ్రమ, సాధన, ప్రయాస, కష్టం ఎంతైనా మెచ్చుకోవాలి… ఆ స్టెప్పులేమీ ఈజీ కాదు… కాకపోతే విషాదం ఏమిటంటే…? వాటిని రెగ్యులర్ డాన్సులుగా… కాదు, కనీసం సినిమా స్టెప్పులుగా కూడా కాదు, డాన్స్ షోల ఫీట్లుగా చూడాల్సి వస్తోంది… టీవీ నాట్యరీతులు అనాలేమో వీటిని…
Ads
అప్పట్లో మాటీవీవాళ్లు ఓంకార్‌తో ఓ డాన్స్ షో చేశారు… బోలెడు మంది జడ్జిలను పెట్టారు… అది కాస్తా ఫ్లాప్… అదే ఓంకార్ ఇప్పుడు ఆహా ఓటీటీ కోసం డాన్స్ ఐకాన్ అనే షో హోస్ట్ చేస్తున్నాడు… నిర్మించేది కూడా తనే కావచ్చు బహుశా… శ్రీముఖి ఓవరాక్షన్, ఓంకార్ చిత్రమైన యాంకరింగ్ సరేసరి… ఎప్పుడూ ఉండేవే… కానీ శేఖర్ మాస్టర్, రమ్యకృష్ణలను పట్టుకొచ్చారు… రమ్యకృష్ణ యాక్టివ్ పార్టిసిపేషన్ బాగుంది… ఓంకార్ కదా, మోనాల్ గజ్జర్‌ను మళ్లీ పట్టుకొచ్చాడు… కొత్తతరహా ఫార్మాట్… భారీ ఖర్చు… ఎటొచ్చీ అవే టీవీ నాట్యాలు… ఒక ఎపిసోడ్‌కు విజయ్ దేవరకొండ కూడా వచ్చినట్టుంది… కానీ…
ప్రేక్షకుల్ని పెద్దగా కనెక్ట్ కాలేదు… దానికి నిదర్శనం ఏంటంటే… ఇదే జెమిని టీవీలోనూ వస్తుంది… ఒకసారి తాజా బార్క్ రేటింగ్స్ చూస్తే, జస్ట్, 2.53 మాత్రమే… అంటే, మరోసారి ఓంకార్ డాన్స్ షో విషయంలో జనం మెప్పు పొందలేకపోయాడు అని అర్థం… జీతెలుగులో డాన్స్ ఇండియా డాన్స్ షో వస్తోంది… కొత్త యాంకర్ ఎవరో కనిపిస్తున్నారు, ఇంప్రెసివ్ కాదు, కానీ కొత్త మొహం కాబట్టి కాస్త రిలీఫ్… బాబా భాస్కర్‌ను కూర్చోబెడుతున్నారు… అదీ ఓవరాక్షన్ కేసే… ఈమధ్య శాకిని, ఢాకినీలు రెజీనా, నివేదాలను గెస్టులుగా పట్టుకొచ్చారు… ఆటవిడుపుగా జబర్దస్త్ రోహిణి పర్లేదు, సంగీత కూడా వోకే… కానీ…
దీన్ని కూడా జనం తిరస్కరిస్తున్నారు… కారణం, అదే ఈటీవీలో వచ్చే టీవీ డాన్సులే కదా ఇక్కడ కూడా… కొత్తదనం ఏముంది..? ఈసారి బార్క్ రేటింగుల్లో ఈ ప్రోగ్రామ్‌కు వచ్చిన రేటింగ్స్ జస్ట్, రెండు మాత్రమే… నిజమే… అంటే డాన్స్ ఐకాన్‌కన్నా నాసిరకం షో అని ప్రేక్షకులు చెప్పేశారన్నమాట… ఈటీవీకి ఇదే బలం… ఇలాంటి రియాలిటీ షోలను ఈటీవీ ఎంత చెడగొట్టినా సరే, జీటీవీ, మాటీవీ నాణ్యమైన పోటీ ఇవ్వలేక చేతులెత్తేస్తున్నయ్…
ఈటీవీ ఢీ డాన్స్ షోను నిజానికి కొంతకాలంగా భ్రష్టుపట్టించారు… జడ్జిలుగా, మెంటార్లుగా ఎవరెవరో వస్తున్నారు, పోతున్నారు… రసం తీసేసిన చెరుకు పిప్పి ఇప్పుడు అది… ఐనా సరే, అదే ప్రేక్షకులకు నచ్చుతోంది… ఇంత భ్రష్టుపట్టినా సరే, దానికి తాజా బార్క్ రేటింగ్స్ 2.64… పూర్వ వైభవం గుర్తుచేసుకోకండి… అది గతం… ఐనా సరే, జీవాడికన్నా, మాటీవీ వాడికన్నా ఈటీవీ వాడే ఈరోజుకు తోపు..!!
Share this Article