రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓవరాక్షన్ చేసే అధికారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం తమకే రాజకీయంగా నష్టం వాటిల్లజేస్తోంది… ఇంకా దీన్ని సమీక్షించుకున్నట్టు లేదు… అసలే బీఆర్ఎస్, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్‌లో ఉంది… ఉన్నవీ లేనివీ రచ్చ చేసి, గాయిగత్తర లేపడంలో ఆ పార్టీ నాయకులు సిద్ధహస్తులు… కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను పెంచడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తారు…
మొన్న కేటీయార్ ఒక ట్వీట్ చేశాడు… పక్షపాతంతో బాధపడే ఓ 80 ఏళ్ల ముసలామె పెన్షన్‌ను రికవరీకి ప్రభుత్వం నోటీసు ఇచ్చిందని దాని సారాంశం… ఒక పొలిటిషియన్‌గా కేటీయార్ చేసింది కరెక్టే… ఎవరైనా అదే చేస్తారు… కానీ నిజం ఏమిటీ అంటే… ఆమె డబుల్ పెన్షన్ పొందుతోంది… మరణించిన తన ఏఎన్ఎం కూతురి పెన్షన్ వస్తోంది… ఐనా ఆసరా పెన్షన్ తీసుకుంటోంది…
ఇలా వేలాది మంది ఉన్నట్టు గుర్తిస్తున్నారు సెర్ప్ సర్వేలో… సరే, అలాంటి వాళ్లకు జూన్ నుంచి అక్రమంగా వచ్చే పెన్షన్లు ఆపేయాలని ప్రభుత్వం చెప్పింది… కానీ కొందరు అధికారుల ఓవరాక్షన్… రికవరీ నోటీసులు ఇచ్చారు… అవీ స్వల్ప మొత్తాలు, పైగా పక్షవాతంతో బాధపడే 80 ఏళ్ల ముసలావిడ… చివరకు ఇది జనంలోకి ఎలా నెగెటివ్‌గా వెళ్లిందీ అంటే, కేసీయార్ పెన్షన్లు ఇస్తే రేవంత్ రెడ్డి అవన్నీ తిరిగి వసూలు చేస్తున్నాడు అనేలా…
Ads
ఇదుగో ఇదే, రాజకీయంగా నష్టం… మెల్లిమెల్లిగా వ్యతిరేకతను పోగుచేసేవి ఇలాంటివే… ఇప్పటికే కరెంటు విషయంలో బాగా బదనాం అయిపోయింది… ధాన్యం కొనుగోళ్లు, విత్తనాల విషయంలో కూడా బీఆర్ఎస్ ఏదో ట్రై చేసింది కానీ అది పెద్దగా వర్కవుట్ కానట్టుంది… ఇప్పుడిక నిరుద్యోగుల ఇష్యూ… రాజకీయాల్లో ఇవన్నీ సహజమే, ఇలాంటివి ఎలా అధికార పార్టీ డీల్ చేస్తుందనేదే ప్రధానం… అక్కడ సరైన అడుగులు పడటం లేదు…
రైతుబంధు విషయంలోనూ అంతే… సాగులో లేని గుట్టలు, రాళ్లు, పఢావు భూములకే కాదు, రియల్ ఎస్టేట్ వెంచర్లకూ డబ్బులిచ్చారు… మొత్తం 27 వేల కోట్ల ప్రజాధనం అప్పనంగా పంపిణీ చేసినట్టు ఓ అంచనా… ఒకాయన నుంచి 17 లక్షల రికవరీ నోటీసులు ఇచ్చి, ఆర్ఆర్‌యాక్ట్ ప్రయోగిస్తారని వార్తలు… నిజానికి తప్పు చేసింది ప్రభుత్వం… దాని పాలసీ తప్పు… ధనికులు, భూస్వాములు, వ్యాపారులు, అధికారులు కూడా రైతుబంధు తీసుకున్నారంటే అది వాళ్ల నేరం కాదు…
ప్రభుత్వం డబ్బు ఇస్తోంది దాని పాలసీ ప్రకారం… మేం తీసుకుంటున్నాం… అంతే… సరే, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సాగులో లేని భూములకూ డబ్బు తీసుకోవడం అనైతికం కావచ్చుగాక… కానీ లక్షలాది మంది నుంచి ఆల్రెడీ పంపిణీ చేసిన సొమ్మును రికవరీ చేయడం సాధ్యమేనా..? సరే, సాధ్యమే అనుకుందాం… ఇది జనంలోకి ఎలా వెళ్తోంది… కేసీయార్ దయతో వేల కోట్లు పంపిణీ చేస్తే, రైతులను ఆదుకుంటే రేవంత్ వచ్చి అవన్నీ మళ్లీ లాక్కుంటున్నాడు అనేలా…
సరే, రైతుబంధు పేరిట వేల కోట్లను అప్పనంగా తీసుకున్నవారి నుంచి తిరిగి వసూలు చేయడం కరెక్టే కదా అని ఓ కోణంలో అనుకున్నా సరే… డబుల్ పెన్షన్లను పొందే వయోవృద్ధుల నుంచి… అక్రమమే అయినా సరే, తిరిగి వసూలు చేయడానికి నోటీసులు ఇస్తే… రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముసలోళ్లను వేధిస్తున్నదనే నెగెటివిటీని పెంచుకోవడమే అవుతుంది… పోతే పోనీలేవయ్యా, ఈ డబ్బుతో ఏమైనా బిల్డింగులు కడతారా పాపం… పెన్షన్లు ఆపేస్తే సరిపోతుంది గానీ ఇలా వేధిస్తారా..? అనేవాళ్లు పెరుగుతారు..!!
Share this Article